Saturday, May 27, 2017

మహా గణితజ్ఞుడు శ్రీనివాస రామానుజన్‌

ఆర్యభట్ట నుండి భాస్కరాచార్య వరకు మహోన్నతంగా విలసిల్లిన భారతీయ గణిత వాహినికి ఆధునిక కాలంలో తన విలక్షణ మేధాసంపత్తితో అనన్య సామాన్యమైన కృషిచేసి భారతీయ గణిత పతాకాన్ని ప్రపంచ గణిత శిఖరంపై దశదిశలా ఎగరవేసిన మహా గణితజ్ఞుడు శ్రీనివాస రామానుజన్‌. ఆయన జీవించింది 32 ఏండ్లే అయినా, 3900పైగా సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అపరగణిత మేధావి శ్రీనివాస అయ్యంగార్‌. 1887 డిసెంబర్‌ 22న తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాలోగల ఈరోడ్‌ అనే గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌, తల్లి కోమలత‌. చిన్ననాటి నుండీ రామానుజన్‌ విచిత్రమైన ప్రశ్నలు వేసేవాడు. ఆయన ధోరణి ఉపాధ్యాయులకు ఆశ్చర్యంగా వుండేది.


రామానుజన్‌ తండ్రి బట్టలకొట్టులో ఒక చిన్న గుమస్తా. ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. రామానుజానికి గణితమే సర్వస్వంగా వుండేది. పదమూడవ ఏటనే క్లిష్టమైన ఆల్‌జీబ్రా గణితంలో సమస్యలను పరిష్కారం చేసేవాడు రామానుజన్‌. ఈ బాల మేధావి 15 ఏండ్లు ఉన్నప్పుడే జార్జ్‌ స్కచ్‌ సిడ్జేకార్‌ రూపొందించిన 6000 గణిత సిద్ధాంతాలను అవుపాశన పట్టాడు. 1903 నాటికే మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో రామానుజంకు స్కాలర్ షిప్‌ వచ్చింది.


అయితే మితిమీరిన లెక్కలతో పిచ్చిపడుతుందేమోనని భయపడి రామానుజన్‌ తండ్రి ఈయనకు వివాహం చేశాడు. పెళ్లి అయినప్పటికీ రామానుజం చిత్తుకాగితాలను కూడా జాగ్రత్తగా వాడుకుంటూ గణితమే లోకంగా బతికేవాడు. ఈయన గణితంలో ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను చూసి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాస్‌ విశ్వవిద్యాలయం నెలకు 75 రూపాయల ఫెలోషిప్‌ మంజూరు చేసింది.  ఓ శ్రేయోభిలాషి చేసిన సిఫారసు వల్ల రామానుజన్‌ మద్రాస్ అకౌంటంట్ జనరల్ కార్యాలయంలో ఓ చిన్న ఉద్యోగం దొరికింది. నెలకి ఇరవై రూపాయలు జీతం. కాని ఆ ఉద్యోగంలో కొన్ని వారాలు మాత్రమే పని చేశాడు. తరువాత మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ లో ఓ గుమాస్తా ఉద్యోగం అకౌంట్స్ విభాగంలో గుమాస్తాగా నెలకి ముప్పై రూపాయల జీతంతో మార్చ్  1, 1912, నాడు రామనుజన్ కొత్త ఉద్యోగంలో చేరాడు.


పెళ్ళయిందన్న మాటే గాని జానకి తన భర్త రామానుజంని పెద్దగా చూసిందే లేదు. పుట్టింట్లో ఉంటూ అప్పుడప్పుడు కుంభకోణంలో అత్తగారి ఇంటికి వెళ్ళి వస్తుండేది. భర్తకి ఎప్పుడు సరైన ఉద్యోగం వస్తుందా, తనని కాపురానికి రమ్మని ఎప్పుడు పిలుస్తాడా అని ఆత్రంగా ఎదురుచూసేది. పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగం వచ్చింది కనుక రామానుజన్ భార్యని, తల్లిదండ్రులని రప్పించుకున్నాడు.


రామానుజం దినచర్య చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఉదయం ఉద్యోగానికి బయల్దేరే ముందు లెక్కలు చేసుకునేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ లెక్కలు చేసుకునేవాడు. రాత్రి తెల్లార్లూ కూర్చుని లెక్కలు చేసుకుని ఒకొక్కసారి తెల్లవారు జామున కునుకు తీసి, ఓ రెండు మూడు గంటలు నిద్రపోయి, లేచి ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఆఫీసులో పని చాలా సులభంగా ఉండేది. మొత్తం గణిత శాస్త్రాన్నే తిరగరాయగల సత్తా గల రామానుజంకి గుమాస్తా కూడికలు, తీసివేతలు ఓ లెక్క కాదు.


అగాథంలో ఉన్న ఆణిముత్యాన్ని వెలికితీస్తేనే దాని విలువ ప్రపంచానికి తెలుస్తుంది. ఎక్కడో తమిళనాడులో ఓ లెక్కల గుమాస్తాగా పనిచేస్తున్న శ్రీనివాస రామానుజంను మలుపు తిప్పింది మాత్రం ప్రోఫెసర్‌ హార్డీ పరిచయమే. గణిత శాస్త్ర చరిత్రలో అపురూప బంధంగా వీరి సహచర్యాన్ని పేర్కొంటారు


పోర్ట్ ట్రస్ట్ లో కూడా రామానుజన్ గణిత ప్రతిభ గురించి నలుగురికీ తెలిసింది. ఇంగ్లీష్‌ వారిని సంప్రదించి చూడమని కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. అలాంటి వారిలో ఒకరు పచ్చయ్యప్పా కాలేజికి చెందిన లెక్కల ప్రొఫెసరు, సింగార వేలు ముదలియార్. లండన్‌లోని ప్రఖ్యాతీ మేథమేటిక్స్‌ ప్రోఫెసర్‌ హార్డీ కి రామానుజం తన పరిశోధనలను ఉత్తరాల ద్వారా పంపేవారు. రామానుజం గణిత అధ్యయనాలపై హార్డీ ఆశ్చర్య పోయేవారు. కొంత కాలం హార్డికి, రామానుజన్ కి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాయి. రామానుజం తయారు చేసిన ఫార్ములాలకు నిరూపణలు పంపమని హర్డీ ఒత్తిడి చెయ్యడం, అందకు రామానుజం విబేధించడం జరిగింది. ఈ నేపథ్యంలో రామానుజన్ సిద్ధాంతాలని లోకం గుర్తించేలా చేసేందుకు గాను, కొంత కాలం రామానుజన్ ఇంగ్లండ్ కి వస్తే బావుంటుందని కూడా హార్డి సూచించాడు.


హార్డీ ప్రతిపాదనకు రామానుజన్ మొదట సుముఖంగా స్పందించలేదు. ఆ రోజుల్లో బ్రాహ్మణులు సముద్రాలు దాటి  విదేశాలు ప్రయాణించకూడదు అన్న నిషేధం ఉండేది. అలా చేసిన వారిని కులం నుండి వెలివేసేవారు. మరోవైపు ఇంగ్లాండు నుంచి హార్డీ రామానుజంను లండన్‌ రావాలని ఒత్తిడి చేశాడు. రామానుజంను ఇంగ్లాండు తీసుకురమ్మని ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త నెవిల్‌ ను భారత్‌ పంపాడు హార్డీ. నెవిల్ రామానుజన్ ని కలుసుకున్నాడు. రామనుజన్ తన నోట్సు పుస్తకాలు చూపించాడు. చేత్తో రాసిన ఆ కాగితాలు చూసి నెవిల్ మంత్రముగ్ధుడయ్యాడు. నెవిల్‌ ఆహ్వానానికి రామనుజన్ కాదనలేక ఒప్పుకున్నాడు. రామానుజన్ యాత్రకి, ఇంగ్లండ్ లో బసకి కావలసిన నిధులు వేగంగా అతి తక్కువ కాలంలో ఏర్పాటు చేశారు.


ఇంగ్లాండ్‌ కి పయనం అయ్యే ముందు రామానుజన్ మిత్రులు అతడి ఇంగ్లాండు జీవన విధానం గురించి రకరకాలుగా చెప్పారు. వేష భాషల గురించి వేగంగా తర్ఫీదు ఇచ్చారు. చివరికి అతడి పిలక సైతం కత్తిరించుకొని ఇంగ్లాండ్ వెళ్లేందుకు సూటు బూటుతో పయనమయ్యాడు రామానుజం. మార్చ్ 17  1913  నాడు ఎస్. ఎస్. నెవాసా అన్న ఓడలో ఇంగ్లండ్ కి బయల్దేరాడు. అంతవరకు గణిత లోకంలో ఎన్నో అద్భుత తీరాలని చూసిన రామనుజన్, ఇప్పుడు తన జీవితాన్ని సమూలంగా మార్చేసే ఓ పాశ్చాత్య తీరం దిశగా పయనమయ్యాడు.


ప్రపంచానికి సున్నాను అందించి చరిత్ర భారతీయులది, ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇప్పటికీ గ్రహాణాన్ని ఖచ్చితంగా అంచనా వేయగల శాస్త్రం మనకు సొంతం. ఈ మహోన్నత వారసత్వాన్ని తన భుజస్కంధాలపై మోసుకుంటూ లండన్‌ మహానగరంలో అడుగు పెట్టాడు రామానుజన్‌.

సుమారు నెల రోజుల సముద్ర ప్రయాణం అనంతరం 1913 ఏప్రిల్ 14 న రామానుజం లండన్‌ లో అడుగు పెట్టాడు. అసలే కొత్త ఊరు, కొత్త దేశం, కొత్త సంస్కృతి. కొత్త పరిసరాలకి  రామానుజన్ సులభంగా అలవాటు పడేందుకు గాను  నెవిల్ రామానుజన్ ని నేరుగా కేంబ్రిడ్జ్ కి తీసుకెళ్ళకుండా ముందు క్రామ్వెల్ రోడ్డుకి తీసుకెళ్లాడు. క్రామ్వెల్ రోడ్డు మీద ఇంట్లో ఓ నాల్గు రోజులు ఉన్నాక నెవిల్ రామానుజన్ ని కేంబ్రిడ్జ్ తీసుకెళ్ళాడు.


రామానుజన్ ప్రత్యేకించి ఓ విద్యార్థిలా అక్కడ చదువుకోడానికి రాకపోయినా, అక్కడ కొన్ని  కోర్సులు తీసుకోవాలని నిశ్చయమయ్యింది.  కొద్ది రోజుల్లోనే హార్డీ, రామానుజన్ ని చూడడానికి వచ్చారు. వీరిని చూడగానే రామానుజన్ కి చిన్ననాటి ప్రాణ స్నేహితులని చూసినంత సంతోషం కలిగింది.


కేంబ్రిడ్జిలో రామానుజం ప్రయాణం అంత సులభంగా ఏమి సాగలేదు. రామానుజన్ హార్డీ ల మధ్య ఇక్కడే ప్రపంచం నివ్వెర పోయే మేధో సహాధ్యాయం మొదలయ్యింది. అంతవరకు రామానుజన్ పంపిన ఉత్తరాలలోని గణిత విషయాలపై హార్డీకి వేల సందేహాలు ఉన్నాయి. రామనుజన్ పంపిన 120  సిద్ధాంతాలలో చాలా మటుకు రామానుజం రాసిన నోట్సు పుస్తకాలలోనే ఉన్నాయి.


రామానుజన్ సిద్ధాంతాలలో గొప్ప ప్రతిభ కనిపిస్తున్నా ఆ ఫలితాలన్నీ నిజం కావని హార్డీ వాదించేవాడు. కొన్ని సిద్ధాంతాలు మాత్రం దిగ్ర్భాంతి కలిగించేవిగా ఉన్నాయి ప్రగాఢమైనవి. రామానుజం నోటు పుస్తకాలలో అద్భుతమైన గణిత సంపత్తి వుంది. వేల కొద్ది సిద్ధాంతాలు, ఉపసిద్ధాంతాలు, ఉదాహరణలు రాశిపోసినట్టు ఉన్నాయి. ఆ నోట్సు పుస్తకాలలో నిక్షిప్తమై వున్న గణిత సంపదని తవ్వి తియ్యడానికి కొన్ని తరాల పాటు గణితవేత్తలు శ్రమించాల్సి వచ్చింది. 1921  వరకు అంటే సుమారు ఏడేళ్ల పాటు ఆ నోటు పుస్తకాలని అధ్యయనం చేసిన హార్డీయే  ఆ పుస్తకాలలో ఇంకా ప్రపంచానికి తెలియని అపార గణిత సంపద వుందని వాపోయాడు.


రామానుజన్‌ మొదటి పుస్తకం ముద్రణ అయ్యేందుకు చాలా వ్యయప్రయాసలకు ఒనగూర్చాల్సి వచ్చింది. హార్డీ రామానుజం మధ్య జరిగిన చర్చలు, విబేధాలు ప్రపంచానికి సరికొత్త గణిత ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ఇద్దరు మేధావులు పోటీ పడి చదరంగం ఆడితే ఎలా ఉంటుందో, హార్డీ, రామానుజం మధ్య జరిగిన మేధో చర్చలు కూడా అంతే ఆసక్తి కరంగా ఉండేవి.

సనాతన సంప్రదాయాలను గౌరవించే రామానుజం స్వయంపాకం, మడి మైలా పాటిస్తూ కేంబ్రిడ్జిలో కూడా అలాగే వుండేవాడు. ఒక సందర్భంలో విందులో మాంసం పొరపాటున తన ప్లేట్‌ లో వడ్డించినందుకు రామానుజం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.


ఇక రామానుజం ప్రతిభకు ఓర్వలేక తెల్లజాతీయులు తమ రామానుజంపై తమ అక్కసు కక్కేవారు. రామానుజం ఒక దశలో జాత్యహంకార అవమానాలకు సైతం గురయ్యాడు. అసూయతో కేంబ్రిడ్జిలో కొందరు సహ అధ్యాయులు, అలాగే ప్రొఫేసర్లు రామానుజం ను అవమానించేవారు. అయినప్పటికీ రామానుజం ఇవేవీ పట్టించుకోలేదు. ఎముకలు కొరికే చలిలో సైతం సంఖ్యలతో కుస్తీలు చేసేవాడు. ఫిబ్రవరి 18, 1918లో రామానుజన్‌ని ఫెలో ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీగా ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరం అక్టోబర్‌లో ఈయనను ఫెలో ఆఫ్‌ ది ట్రినిటి కాలేజీగా ఎన్నుకున్నారు. ఈయన ఆల్‌ జీబ్రాలో సాధించిన సమీకరణాల వల్ల యూలర్‌, జాకోబి వంటి గొప్ప శాస్త్రవేత్తల కోవలోకి చేరాడని కేంబ్రిడ్జిలో ఎంతో మంది చెప్పుకునేవారు.

ఇక అతి ముఖ్యంగా హార్డి, రామానుజం మధ్య తలెత్తిన మేధో చర్చల్లో ప్రధానమైన చర్చ సిద్ధాంత నిరూపణ .. గణితంలో ఓ సిద్ధాంతం నిజమా కాదా అన్నది దాని నిరూపణ మీద ఆధారపడుతుంది. నిరూపణ లేకుండా ఎంత గొప్ప మాథమేటిక్‌ ఈక్వేషన్‌ చేసినా గణిత లోకం  సమ్మతించదు.  గణిత లోకంలో ఇది అత్యంత ప్రాథమిక నియమం. కాని రామానుజన్ మాత్రం తన గణిత సూత్రాలకు నిరూపణలు చూపమంటే మాత్రం హార్డీతో విబేధించేవాడు. నిరూపణలు లేకుండా గణితంలో మనగలగడం కష్టమంటూ హార్డీ రామానుజంతో మేధో ఘర్షణలకు దిగేవాడు. ఇదే వాదులాటే ప్రపంచానికి ఒక గొప్ప ఆవిష్కరణలకు సాక్షీగా నిలిచింది.


గణితంలో నిరూపణ అంటే ఏంటి అన్న విషయంలో కచ్చితమైన అవగాహన ఉండడం. కచ్చితమైన, కఠోరమైన నిరూపణకే పెద్ద పీట వేసే స్వభావం హార్డీది ఆతడిది. అందుకే ఒక విధంగా రామానుజన్ కి హార్డీ సరైన  స్నేహితుడే కాక, తనలోని వెలితిని ఎత్తి చూపగల అసలైన గురువు అయ్యాడు.


శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని రామానుజం చేసిన పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగ పడుతున్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్-తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధమైనవి. ఆయన ప్రతిపాదించిన కొన్ని అంశాలు ఇప్పటికీ  అపరిష్కృతంగానే ఉండటం విశేషం.


పూర్తి శాఖాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లాండ్‌ వాతావరణం సరిపడకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, విశ్రాంతిలేని పరిశోధనలు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో క్షయ వ్యాధి సోకింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 32 పరిశోధనా పత్రాలను ఆయన సమర్పించారు.


ఆసుపత్రిలో చికిత్స పొంది అనారోగ్యంలో ఉన్నప్పటికీ రామానుజం మేధస్సు మాత్రం చెక్కు చెదరలేదు. అందుకు ఒక ఉదాహరణగా రామానుజం 1729 నెంబర్‌ గురించి చెబుతారు. 1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశారు. రామానుజన్ అనారోగ్యంతో హాస్పిటల్లో వున్నపుడు, హార్డీ ఆయనను పలుకరించటానికి వెళ్లి మాటల మధ్యలో తాను వచ్చిన కారు నంబరు 1729, ఈ సంఖ్య   ప్రత్యేకత ఏమైనా ఉన్నదా ? అని అడిగారు. అందుకు రామానుజన్ తడుముకోకుండా ఆ సంఖ్య ఎంతో చక్కని సంఖ్య అని, ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యా సమితిలో అతి చిన్నసంఖ్య అని తెల్పారు. ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అంకిత భావానికి నిదర్శనం.


క్షయవ్యాధి సోకడంతో రామానుజన్‌ ఇంగ్లాండ్‌ నుండి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ఏప్రిల్‌ 26, 1920న చనిపోయే నాటివరకు గణితంలో నిత్యం చిత్ర విచిత్రమైన అంశాలను ఆవిష్కరిస్తూ వుండేవాడు.  వీరి గౌరవార్ధం వీరి పేర ఒక అవార్డును నెలకొల్పారు. మ్యాజిక్‌ స్కేర్స్‌, ధియరీ ఆఫ్‌ నంబర్‌, మాక్‌-లేటా ఫంక్షన్స్‌ చాలా ప్రసిద్ధమైనవి. వీరి జీవితాన్ని నేటితరం ఉపాధ్యాయులు, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి. గణితంలో నూతన పరిశోధనలు చేయాలి.

రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్ ఇనిస్టిట్యూట్‌లో, అమెరికాలోని ‘ఇలినాయిస్’ యూనివర్సిటీలో నేటికీ రీసెర్చ్ జరుగుతోంది. గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘జాతీయ గణితదినోత్సవం’గా ప్రకటించింది.

Wednesday, February 10, 2016

51వ వసంతంలోకి ఎస్బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ ఈ మధ్యే 50 ఏళ్లు దాటి 51 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. బ్యాంక్ ఏడో సర్కిల్‌గా మొదలైన ప్రస్థానం ఇప్పుడు అనూహ్యమైన వృద్ధిని సాధించి మిగిలిన శాఖలకు పోటీగా ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తమ సేవలు కొనసాగిస్తూ.. రెండు రాష్ట్రాల వృద్ధిలో తాము కీలకపాత్ర పోషిస్తామని సిజిఎం హర్‌దయాల్ ప్రసాద్ చెబ్తున్నారు.

1965లో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఏడో సర్కిల్‌గా హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్  ప్రారంభమైంది. అప్పట్లో 61 బ్రాంచీలు, 41 సబ్ ఆఫీసులు మాత్రమే ఉండేవి. 22 కోట్ల డిపాజిట్లు, 8 కోట్ల అడ్వాన్సులతో మొదలైన ఎల్‌హెచ్ఓ(లోకల్ హెడ్ ఆఫీస్) ప్రస్థానం 50 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు 91 వేల కోట్ల డిపాజిట్లు, 1.03 లక్షల కోట్లు అడ్వాన్సులతో మిగిలిన సర్కిల్స్‌కు ధీటుగా ఎదుగుతోంది హైదరాబాద్.

చీఫ్ జనరల్ మేనేజర్‌గా గతేడాది పదవీ బాధ్యతలు స్వీకరించిన హర్‌దయాల్ ప్రసాద్.. హైదరాబాద్ సర్కిల్‌ను మరింత అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హర్‌దయాల్ ప్రసాద్, 1983లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన సత్తాను చాటి ఎస్బీఐ లాస్ ఏంజెల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ఇక్కడి బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన ముంబై ఎల్‌హెచ్‌ఓలో జనరల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. బ్యాంకింగ్‌లోని వివిధ శాఖల్లో విస్తృతమైన అనుభవాన్ని సంపాదించుకున్న హర్‌దయాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పుడు 1,435 శాఖలు పనిచేస్తున్నాయి.

50 సంవత్సరాలు పూర్తిచేసుకుని.. కొద్ది రోజుల క్రితమే 51 సంవత్సరంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ లోకల్ హెడ్ ఆఫీస్ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. సర్కిల్‌లో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైన తమ అనుభవాలు పంచుకున్నారు. ఉద్యోగులంతా ఒక్క చోట చేరి.. జరుపుకున్న సంబరాలు అందరినీ సంతోషంలో ముంచెత్తాయి.

కస్టమర్లకు సులువుగా ఎస్బీఐ రుణాలు

ఒకప్పుడు లోన్లు కావాలంటే.. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఈ మధ్య బ్యాంకులో మన ముంగిట్లోకి వచ్చి లోన్లు ఇచ్చే పరిస్థితి వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కార్, హౌజింగ్ మేళాతో కస్టమర్లకు సులువుగా రుణాలు దొరుకుతున్నాయి. డిస్కౌంట్లతో పాటు స్పాట్ అప్రూవల్‌ ఉండడం కూడా కస్టమర్లకు కలిసొస్తోంది.

ఇల్లు.. ఓ సామాన్యుడి కల. సొంతింట్లో ఉంటే ఆ అనందమే వేరు. ఎన్ని తిప్పలు పడ్డా.. చివరకు ఓ గూడు ఉండాలనేది ప్రతీ ఒక్క మధ్యతరగతి వ్యక్తి ఆలోచన. అందుకే బ్యాంకులు కూడా ముందుకు వచ్చి విరివిగా తమ కస్టమర్లకు లోన్లు ఇస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వ బ్యాంకులు మేలా.. ప్రైవేట్ బ్యాంకులు మేలా అనే కన్ఫ్యూజన్‌తో ఉంటారు జనాలు. సాధారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా ఎస్బీఐ వంటి ప్రముఖ బ్యాంకులే వడ్డీల్లో మొదట కోత విధిస్తాయి. మిగిలిన వాటితో పోలిస్తే కొన్ని బేస్ పాయింట్లు వడ్డీ కూడా తక్కువే ఉంటుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివి కూడా కాస్త అందుబాటులోనే ఉంటాయి. అందుకే ఎస్బీఐ వంటి వాటికే కస్టమర్లు ఎక్కువగా మొగ్గుచూపుతూ ఉంటారు.

లోన్లు కావాలంటే ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు బ్యాంకులే మన ఇళ్ల దగ్గరికి వచ్చేస్తున్నాయి. కార్ మేళా, హౌజింగ్ లోన్ మేళా పేరుతో కస్టమర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. తరచూ రుణమేళాలు నిర్వహిస్తూ కస్టమర్లకు చేరువవుతోంది. ఇలాంటి ప్రాపర్టీ షోస్ నిర్వహించడం వల్ల బిల్డర్లు, కస్టమర్లను ఒకే వేదికపైకి తెచ్చినట్టు అవుతుందని బ్యాంకర్లు చెబ్తున్నారు.
ప్రాసెసింగ్ ఫీజ్‌ను రద్దు చేయడంతో పాటు సింపుల్ లోన్ ప్రాసెస్‌ ఉండడం వల్ల కస్టమర్ల టైం సేవ్‌ అవుతుందనేది వీళ్ల భావన.

అటు బిల్డర్లు, ఇటు బ్యాంకూ ఒకే చోట ఉండడం చాలా సంతోషంగా ఉందంటున్నారు కస్టమర్లు. మొదట ప్రాపర్టీల చుట్టూ తిరగడం, వాటికి లోన్లు వస్తాయో రావడం తికమకపడాల్సిన అవసరం లేదంటున్నారు. రుణాలు ఇచ్చే బ్యాంకులే ముందుకు రావడం సంతోషంగా ఉందనేది మరికొంత వినియోగదారుల మాట.

ఇలాంటి ప్రాపర్టీస్ మేళా వల్ల తమకు కన్వర్షన్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయని బిల్డర్స్ చెబ్తున్నారు. స్పాట్ సాంక్షన్స్ వల్ల కస్టమర్లకు కూడా ఒక క్లారిటీ వస్తుందనేది వాళ్ల సంతోషం.

ఇలాంటి రుణమేళాలలో ప్రాసెసింగ్ ఫీజులు రద్దు చేయడం, కొన్ని బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లలో డిస్కౌంట్లు కూడా ఇవ్వడంతో కస్టమర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తామని చెబ్తున్నారు అధికారులు.

అరుంధతీ భట్టాచార్య నాయకత్వంలో ఎస్బీఐ

రెండు శాతాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న బ్యాంకులో మొదటిసారిగా మహిళ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు అరుంధతీ భట్టాచార్య. మూడేళ్ల క్రితం ఆమె ఎస్బీఐ పగ్గాలు చేపట్టినప్పుడు అంతా నోరెళ్లబెట్టారు. అయితే అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ.. అరుంధతీ భట్టాచార్య దూసుకుపోతున్నారు. ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా తీర్చిదిద్దడంతో పాటు కొత్తతరం జనాలకు చేరువ చేసేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు అందరి మన్ననలూ పొందుతున్నాయి.


బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం అరుంధతీ భట్టాచార్య సొంతం. 1977లో ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా ఆమె చేరారు. 39 సంవత్సరాల తన కెరీర్‌లో రిటైల్, ట్రెజరీ, కార్పొరేట్ ఫైనాన్స్ వంటి విభాగాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు. డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, మర్చంట్ బ్యాంకింగ్‌ చీఫ్ వంటి ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. జనరల్ ఇన్సూరెన్స్, కస్టడీ సర్వీసెస్, ఎస్‌బీఐ మెక్వైరీ ఇన్‌ఫ్రా ఫండ్ సబ్సిడరీస్ వంటి విభాగాల ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. బ్యాంక్ న్యూయార్క్ ఆఫీస్ ఎక్స్‌టర్నల్ ఆడిట్, కరస్పాండెంట్ రిలేషన్స్ చీఫ్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు.

57 ఏళ్ల అరుంధతీ భట్టాచార్య.. బ్యాంకులో నూతన్నోత్తేజాన్ని నింపారు. సోషల్ మీడియాలో రావాలని గతంలో ప్రయోగం చేసి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎస్బీఐ.. ఈమె సారధ్యంలో దూసుకుపోయింది. వస్తూవస్తూనే ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో బ్యాంక్ ప్రమోషన్‌కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎస్బీఐకి ట్విట్టర్‌లో  3.24 లక్షల మంది, ఫేస్ బుక్‌లో 39 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇవే కాదు ఇన్‌స్టాగ్రామ్, పిన్‌ట్రెస్ట్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఎస్బీఐ హవా కనిపిస్తోంది. ఎస్బీఓ అంటే ఓ ఓల్డ్ ఫ్యాషన్డ్ గవర్నమెంట్ బ్యాంక్ అనే ట్యాగ్‌ను పూర్తిగా చెరిపేసి 'జెన్ వై' కస్టమర్లకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

బ్యాంకును అంతర్గతంగా, బహిర్గతంగా పటిష్టం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. మొండి బకాయిలతో ఇబ్బందిపెట్టేవాళ్లను గుర్తించడం, ఖర్చుల తగ్గింపు, హెచ్ఆర్‌ విభాగాల్లో మార్పులు, కస్టమర్ సర్వీస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భట్టాచార్య బాధ్యతలు చేపట్టాక బ్యాంక్ డిపాజిట్స్ 13 శాతం పెరిగాయి. ఎస్బీఐ ఆస్తులు 14.24 శాతం వృద్ధి చెందడంతో పాటు లాభాలు కూడా ఇరవై శాతం వరకూ పెరిగాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆమెను బెస్ట్ సీఈఓ 2015గా మార్చాయి.

స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్ కూడా ఆమె సారధ్యంలో రూపకల్పన జరిగిందే. ఒక్క ఏడాదికాలంలోనే రూ. 11,662 కోట్ల విలువ చేసే 7.71 కోట్ల లావాదేవీలు ఈ వేదిక ద్వారా జరిగాయి. మొబైల్ బ్యాంకింగ్ స్పేస్‌లో ఇప్పుడు ఎస్బీఐ మార్కెట్ లీడర్. ప్రస్తుతం ఎస్బీఐ దగ్గర 1.35 కోట్ల మంది మొబైల్ యూజర్స్ ఉన్నారు. మొత్తం మొబైల్ బ్యాంకింగ్‌లో ఒక్క ఎస్బీఐ వాటానే 46 శాతం. 13 భాషల్లో ఉన్ 'బడ్డీ' డిజిటల్ వాలెట్ ఇప్పటికే ఎంతో మంది చేరువైంది. 'బటువా' పేరుతో మరో యాప్‌ను మాస్‌ కోసం తయారు చేసేందుకు భట్టాచార్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా ఒక్క రిటైల్ కస్టమర్లకే పరిమితం కాకుండా కార్పొరేట్ జనాలకు కూడా ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చి డిటిటల్ సీఈఓగా పేరుతెచ్చుకున్నారు అరుంధతీ భట్టాచార్య.

దూసుకుపోతోన్న ఎస్బీఐ

లీడర్.. లీడ్స్ ఫ్రం ది ఫ్రంట్.. అంటారు. అంటే.. ముందుండి నడిపించే వాడే నాయకుడు. బ్యాంకింగ్ సామ్రాజ్యంలో ఎస్బీఐ కూడా అలాంటి పాత్రే పోషిస్తోంది. బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అని అనిపించుకుంటున్న ఎస్బీఐ... టెక్నాలజీని, వినూత్నతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటోంది. ఇతర బ్యాంకులు ఎంత పరిజ్ఞానంతో ముందుకు వచ్చినా.. వాళ్లందరినీ బీట్ చేస్తూ.. దూసుకుపోతోంది.


ఏ వ్యవస్థనైనా నూతనత్వమే ముందుకు నడిపిస్తుంది. కస్టమర్ల అవసరాలు, మారుతున్న కాలానికి తగ్గట్టు మారితేనే మనుగడ ఉంటుంది. ప్రపంచమంతా అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతున్న తరుణంలో ఏ మాత్రం వెనుకబడినా ఇబ్బందులు తప్పవు, అందునా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో ఆ జోరు మరింత ముఖ్యం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత స్పీడ్‌లో ఓన్ చేసుకుంటే.. అంత స్పీడ్‌గా వృద్ధి కూడా ఉంటుంది. బ్యాంకులకు వచ్చి కార్యకలపాలు నిర్వహించుకునే స్థాయి నుంచి జనాలు ఇంట్లో కూర్చునే పనులు కానించేసే పరిస్థితులు వచ్చేశాయి. చేతుల్లో ఉన్న మొబైల్‌తోనే ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు జనాలు ఎక్కువగా మొగ్గుచూపుతున్న పరిస్థితులు. బ్యాంక్ శాఖల్లో క్యూ లైన్లలో నిలబడేందుకు కూడా జనాలు సిద్ధంగా లేరు. అందుకే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ కూడా జోరు పెంచుతూ వస్తోంది. ఓ వైపు బ్రాంచ్ నెట్‌వర్క్ విస్తరించుకుంటూనే టెక్నాలజీని కూడా బలోపేతం చేస్తోంది.

ఎస్‌బిఐఐన్ టచ్ (SBIIN TOUCH) పేరుతో బ్యాంక్ ఈ మధ్యే ఆరు సరికొత్త డిజిటల్ టెక్నాలజీ బ్రాంచులను ప్రారంభించింది. ఢిల్లీ సహా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఈ శాఖలు ఉన్నాయి. యంగ్ జనరేషన్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వీటిని ప్రారంభించారు. ఈ కియోస్క్ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాను తెరవచ్చు. ఈ ఇంటరాక్టివ్ మెషీన్స్ ద్వారా అక్కడికక్కడే ఫోటోగ్రాఫ్స్ తీసుకుని, డాక్యుమెంట్లను స్కాన్ చేసుకుని సబ్మిట్ చేయవచ్చు. త్వరలో ఇలాంటి డిజిటల్ బ్యాంకుల సంఖ్యను 250కి పెంచబోతున్నట్టు ఎస్బీఐ చెబ్తోంది. ఇప్పటికే బిజినెస్ కరస్పాండెంట్ల నెట్‌వర్క్ ఉన్న ఈ సంస్థ.. మరింత మందికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్ బ్యాంకుల్లో కేవలం ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రమే ఉండి సేవలందిస్తారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా వీటిని విస్తరించాలని బ్యాంక్ యోచిస్తోంది. స్మార్ట్ ఏటిఎం, పర్సనలైజ్డ్ ఏటిఎం కార్డులు వంటివి కూడా కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోనూ నిత్యం మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాలో భాగంగా అనేక కార్యక్రమాలను బ్యాంక్ డిజిటలైజ్ చేస్తూ వస్తోంది.

గతేడాది బడ్డీ పేరుతో స్టేట్ బ్యాంక్ ఓ మొబైల్ వాలెట్ ప్రారంభించింది. యాక్సెంచర్, మాస్టర్ కార్డ్‌ కలిసి దీన్ని రూపొందించింది. ఇప్పుడు బ్యాంకుకు ఉన్న దాదాపు 30 కోట్ల మంది కస్టమర్లలో దాదాపు రెండు కోట్ల మంది ఇంటర్నెట్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కోటి ఇరవై లక్షల మంది మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఈ బ్యాంకును అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ లాంటి దేశంలో బ్యాంకింగ్‌కు ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇక్కడి నుంచి ఎన్నో రెట్లు అభివృద్ధి చెందేందుకు కూడా అవకాశం కలిగి ఉన్న నేపధ్యంలో ఎస్బీఐ లాంటి అతిపెద్ద బ్యాంక్ ఇలాంటి ఆలోచనలతో ముందుకు రావడం హర్షించాల్సిన విషయం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుదీర్ఘమైన చరిత్ర

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ది బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. దేశంలోని నెంబర్ ఒన్ ప్రభుత్వ బ్యాంక్. దేశవ్యాప్తంగా అనేక మారుమూల ప్రాంతాల్లో ఈ బ్యాంక్ తన నెట్‌వర్క్ విస్తరించి ఉంది. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంటుందో ఉండదో కానీ.. అక్కడ మాత్రం ఎస్బీఐ శాఖ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అనే ట్యాగ్ లైన్‌లానే.. మన దేశంలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఎస్బీఐతో అనుబంధం ఉండనే ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రైవేట్ బ్యాంకులతో పోటీపడడం, వినూత్న ప్రోడక్టులతో కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే సాధ్యమైంది. అందుకే కోట్లాది మంది కస్టమర్లు ఎస్బీఐని తమ సొంత బ్యాంకులా భావిస్తారు.

మన ఊళ్లో.. మన కాలనీలో, ఇంటర్నెట్లో.. ఇంటిపక్కన కనిపించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. బలమైన పునాదులపై నిర్మాణమైన ఈ బ్యాంక్ నానాటికీ అంతే ధృడంగా మారుతూ వస్తోంది. 1806లో మొదలైన ప్రస్థానం.. అంచలంచెలుగా... ఎదిగి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో చేరింది.

బ్రిటిష్ పాలనా కాలంలో నుంచే ఎస్‌బీఐ మూలాలు ఉన్నాయి. 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఏర్పాటయ్యింది. తరువాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను నెలకొల్పారు. 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పాటయ్యింది. 1921లో ఈ మూడు బ్యాంకుల విలీనంతో కలకత్తా కేంద్రంగా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకును 1955లో నెహ్రూ ప్రభుత్వం జాతీయీకరణ చేసింది. ఇంపీరియల్ బ్యాంక్ పేరును పార్లమెంటులో చట్టం ద్వారా  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద 66వ బ్యాంకుగా ఎస్బీఐ కీర్తిగడించింది. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ అసెట్స్‌లో ఎస్‌బీఐ, దాని ఐదు అనుబంధ బ్యాంకులు 20 శాతం పైగా వాటాను కలిగి ఉన్నాయి.

20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు, 16 వేలకు పైగా శాఖలు, 36 దేశాల్లో 190కి పైగా ఫారిన్ ఆఫీసులు.. ఇదీ సింపుల్‌గా ఎస్బీఐ ట్రాక్ రికార్డ్. దాదాపు 29 కోట్ల మంది ఖాతాదారులు, 45 కోట్లకుపైగా ఖాతాలతో ఎస్బీఐ దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థగా అలరారుతోంది. దేశంలో ఉన్న శాఖల్లో దాదాపు 66 శాతం బ్రాంచ్‌లు గ్రామీణ - ద్వితీయ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, చిన్న పట్టణాలపై కూడా బ్యాంకుకు ఉన్న శ్రద్ధ ఎలాంటిదో. అదే స్థాయిలో మాస్కో, కొలంబో, హాంకాంగ్, ఫ్రాంక్‌ఫర్ట్, టోక్యో, సిడ్నీ, లండన్.. ఇలా వివిధ దేశాల్లో ఎన్‌ఆర్‌ఐలకు చేరువయ్యేందుకు కూడా ఎస్బీఐ శాఖలను తెరిచింది. 2014 ఆర్థిక సంవత్సరం నాటికి ఎస్బీఐకి 43,515 ఏటిఎంలు ఉన్నాయి. అనుబంధ బ్యాంకులతో కూడా కలిపి చూసుకుంటే ఈ సంఖ్య 53 వేలకు పెరుగుతుంది. జమ్మూ - కాశ్మీర్ కార్గిల్ వంటి అతి సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతంలో ఏటిఎం ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎస్బీఐకే దక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశ అత్యున్నత బ్యాంకుకు ఉన్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. వీటిని బ్రేక్ చేయడం కాదు కదా.. దరిదాపుల్లోకి వచ్చే సత్తా కూడా మిగిలిన వాటికి లేదు అంటే ఆశ్చర్యం కాదు.

ఎస్బీఐ అసోసియేట్ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ ఉన్నాయి. నాన్ బ్యాంకింగ్ సబ్సిడరీల్లో క్యాపిటల్ మార్కెట్స్, ఎస్బీఐ కార్డ్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. ఆర్థిక, బ్యాంకింగ్ విభాగాల్లో తన సత్తా చాటుతున్న బ్యాంక్ నానాటికీ విస్తరిస్తోంది. అందుకే అవార్డుల్లోనూ ఈ  బ్యాంకుకు సాటిలేదు. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్‌లో చేరిన మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఇదే. ఫోర్బ్స్ టూ థౌజండ్ (2000) లార్జెస్ట్ కంపెనీస్ ఇన్ ది వాల్డ్‌ లిస్ట్‌లో కూడా తన స్థానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది ఎస్బీఐ. లండన్‌కు చెందిన ది బ్యాంకర్ మ్యాగ్జైన్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్  - 2008గా అవార్డును ఇచ్చింది. ఆర్థిక రంగంలో రెప్యుటేషన్ ఉన్న టాప్ కంపెనీలపై వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్న ఘనత కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే దక్కింది. రికార్డులు క్రియేట్ చేయడంలో అయినా, వాటిని బ్రేక్ చేయడంలో అయినా ఎస్బీఐకి ఎస్బీఐ మాత్రమే సాటి అని ప్రపంచం మొత్తం మెచ్చుకుంటోంది.

Tuesday, January 5, 2016

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలుపుదల ఎందుకు?

(ఈనాడు సౌజన్యంతో)
నూతన సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజైన సోమవారం చైనా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో షేర్లు 7% నష్టపోవడంతో, ట్రేడింగ్‌ను నిలిపి వేశారు. విపణిలో అధిక హెచ్చుతగ్గులను నివారించేందుకు ప్రవేశపెట్టిన సర్క్యూట్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఈ రోజు నుంచే పని ప్రారంభించినట్లు అయ్యింది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మాత్రం షేర్ల ధరల్లో 20 శాతం కదలిక ఉంటేనే ట్రేడింగ్‌ నిలుపుతారు.
చైనాలో ఇలా: చైనాలో అమల్లోకి వచ్చిన సర్క్యూట్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ప్రకారం సీఎస్‌ఐ300 సూచీ 5 శాతం నష్టపోతే, షాంఘై, షెన్‌జెన్‌ ఎక్స్ఛేంజీలలో ట్రేడింగ్‌ను 15 నిముషాల పాటు నిలుపుతారు. ఒకవేళ పతనం కొనసాగి చూసీ 7% నష్టపోతే, మిగిలిన రోజంతా ట్రేడింగ్‌ను రద్దు చేస్తారు.
మన దేశంలో..: దేశీయ ఈక్విటీ విపణుల్లో మాత్రం సర్క్యూట్‌ బ్రేకింగ్‌ అమలుకు సూచీ కదలికల పరిధిని మరింత పెంచారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలలో ఏ సూచీలో అసాధారణ కదలిక ఏర్పడినా, ఈక్విటీలతో పాటు డెరివేటివ్‌ల ట్రేడింగ్‌ మొత్తాన్ని నిలిపేస్తారు.
* మధ్యాహ్నం ఒంటి గంటలోపు సూచీ 10 శాతం పెరిగినా/నష్టపోయినా ట్రేడింగ్‌ మొత్తాన్ని 45 నిముషాలు నిలిపేస్తారు. అదే మధ్యాహ్నం 1-2.30 గంటల మధ్య సూచీ కదలికల్లో 10 శాతం తేడా వస్తే, ట్రేడింగ్‌ను 15 నిముషాలే ఆపుతారు. ఒకవేళ మధ్యాహ్నం 2.30 గంటల తరవాత ఈ పరిణామం సంభివిస్తే, ట్రేడింగ్‌ను నిలుపరు.
* మధ్యాహ్నం ఒంటి గంట లోపే సూచీ 15 శాతం క్షీణించినా, లాభాలతో దూసుకెళ్లినా 105 నిముషాల సేపు ట్రేడింగ్‌ ఆపేస్తారు. ఇది మధ్యాహ్నం 1-2 గంటల మధ్య సంభవిస్తే ట్రేడింగ్‌ను 45 నిముషాలు నిలుపుతారు. అదే మధ్యాహ్నం 2 గంటల తరవాత సూచీలో 15 శాతం కదలిక వస్తే, మిగిలిన సమయం మొత్తం ట్రేడింగ్‌ ఆగిపోతుంది.
* ఒకవేళ సూచీ 20 శాతం కుంగినా, లాభపడినా మిగిలిన రోజంతా ట్రేడింగ్‌ను నిలిపి వేస్తారు.

Tuesday, December 8, 2015

స్టార్టప్ మానియా

ప్రపంచంలో ఎక్కడాలేని స్టార్టప్ మానియా మనదేశంలో కనిపిస్తోంది. ఉద్యోగాల్ని అర్థించకుండా.. కల్పించాలన్న ప్రభుత్వాల పిలుపు యువతపై బాగా ప్రభావం చూపింది. ఏమాత్రం అనుభవం లేకుండానే ఈ రంగంలోకి దిగుతూ బోర్లా పడుతున్నారు. అదే చక్కని వ్యాపార వ్యూహాలతో ముందుకెళ్లే కంపెనీలు మంచి లాభాల్నే చవిచూస్తున్నాయి.

మనదేశంలో స్టార్టప్ కంపెనీల్లో పదిశాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. వ్యాపారంలో అనుభవం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. టాప్ బిజినెస్ స్కూళ్లు, ఐఐటీ, ఐఐఎంల్లో చదువుకున్న వాళ్లయినా సరే.. నేరుగా వ్యాపారంలో దిగితే నష్టపోతున్న వారు అనేకం. అదే కొన్నాళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత వస్తున్న వారు మాత్రం ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సందర్భాలు చాలా తక్కువ. స్టార్టప్ ల కోసం యూత్ తహతహలాడేందుకు కారణం ఈ-కామర్స్ బూమే. నాలుగైదేళ్లు వెనక్కి వెళ్తే టెలికాం రంగంలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్.. ఇలా అన్ని కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేవి. నెలనెలా కోట్లలో కొత్త సిమ్ కార్డులు సేల్ అవుతుండేవి. కారణం.. కంపెనీల ఆఫర్ల కోసమే తీసుకునేవాళ్లు ఎక్కువ. ఆఫర్ అయిపోగానే వాటిని పక్కన పడేసేవాళ్లు. అంటే వాపు చూసి బలుపు అనుకున్నాయి అప్పట్లో టెలికం కంపెనీలు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఈకామర్స్ రంగంలో కనిపిస్తోంది.

ప్రస్తుతం భారత ఈకామర్స్ మార్కెట్ విలువ దాదాపు రెండు లక్షల కోట్లు. 2020 నాటికి నాలుగు రెట్లు పెరుగుతుందని గోల్డ్ మాన్ శాక్స్ అంచనా. టాప్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్ కార్ట్ సేల్స్ చూస్తే 2013-14కన్నా 14-15వ ఆర్థిక సంవత్సరంలో మూడింతలు  పెరిగాయి. కానీ పైసా లాభం రాలేదు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2వేల కోట్లు నష్టపోయింది. అంతకుముందు ఏడాది నష్టం 715 కోట్లు.  సేల్స్ పెరుగుతున్నకొద్దీ నష్టాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఆపరేషనల్ కాస్ట్ పెరగడమే దీనికి కారణం. డిస్కౌంట్లు, ప్యాకేజింగ్, రవాణా, ఉద్యోగుల జీతాలు, వెబ్ సైట్ నిర్వహణ, లేటెస్ట్ టెక్నాలజీ వాడకం.. ఇలా అన్నీ ఖర్చులే. ఆదాయ మార్గాలు మాత్రం సెల్లర్స్ నుంచి వచ్చే కమీషన్, కస్టమర్ డేటా, లాయల్ కస్టమర్స్ కొనుగోళ్లు. అన్ని వెబ్ సైట్లదీ ఇదే పరిస్థితా అంటే అదేంలేదు. ఇందుకు అమెజాన్, ఈబే లాంటి కంపెనీలే నిదర్శనం. బహుళజాతి ఆన్ లైన్ మార్కెట్ సంస్థలైన అమెజాన్, ఈబే, అలీబాబా చక్కని లాభాల్ని ఆర్జిస్తుండటం విశేషం. కారణం.. వాటికి పటిష్టమైన బ్యాక్ ఎండ్ వ్యవస్థ ఉండటం ఒకటైతే.. ఒక్కసారిగా లాభాలు ఆర్జించే దగ్గరి దారుల్ని వెతకవవి. ఎంత డిస్కౌంట్ ఇవ్వొచ్చో అంతే ఇస్తాయి. అదే వాటిని ఇంతటి పోటీ ప్రపంచంలోనూ మేటి ఈకామర్స్ కంపెనీలుగా నిలబెట్టాయి.

వెబ్ సైట్లు, యాప్ లంటూ టెక్నాలజీకి, కస్టమర్లను ఎట్రాక్ట్ చెయ్యడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్న మన కంపెనీలు.. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టట్లేదన్నది నిపుణుల విశ్లేషణ. వాట్సాప్ లాంటి కంపెనీలు ఖాతాదారుల అభిరుచులు, ఆలోచనలను తెలుసుకుని.. వాటిని విశ్లేషించి విక్రయించడం ద్వారా భారీ ఆదాయం ఆర్జిస్తున్నాయి. కానీ మన ఈకామర్స్ సైట్ల దగ్గరా కోట్లలో కస్టమర్లున్నా.. వారు ఏమేం కొంటారో తెలిసినా.. ఆ డేటాని విశ్లేషించలేకపోతున్నాయి. పైగా యాడ్ రెవెన్యూని పెంచుకోవడంలోనూ వెనుకబడ్డాయి. అందుకే చివరికి ఉద్యోగుల్ని తొలగిస్తూ.. ఆపరేషన్స్ క్లోజ్ చేస్తూ అబాసుపాలవుతున్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా... అనుభవం... అనుభవ రాహిత్యం మధ్య తేడా గమనించకుండా వ్యాపార రంగంలో అడుగు పెడితే చేతులు కాలడం ఖాయమన్నది ఈ కామర్స్‌ బిజినెస్‌ను చూస్తే అర్థమవుతుంది.

ఆన్‌లైన్ బూమ్‌తో తంటా

యూత్ ఎక్కువగా ఉన్న మన దేశంలో ఆన్ లైన్ బూమ్ తెచ్చిన తంటా అంతాఇంతా కాదు. సంప్రదాయ వ్యాపారాన్ని దెబ్బతీస్తూ యావద్దేశాన్ని ఈ-కామర్స్ వైపు ఆకర్షిస్తోంది. ఐతే సరైన ప్లాన్ లేక.. గంపెడాశలతో వచ్చిన చాలా స్టార్టప్ కంపెనీలు ఏడాది తిరక్కముందే చాపచుట్టేస్తున్నాయి. చిన్నాచితకా వెబ్ సైట్లే కాదు.. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి టాప్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లకూ నష్టాలు తప్పలేదు.

ఆన్ లైన్ బూమ్ మనదేశంలో వ్యాపార పోకడల్ని పూర్తిగా మార్చేసింది. గుండు పిన్ను మొదలు కార్ల వరకూ ఇప్పుడేది కావాలన్నా ఆన్ లైన్లో కొనుక్కోవచ్చు. కొన్ని కంపెనీలు సొంతంగా.. వాటి ఉత్పత్తుల కోసమే ఆన్ లైన్ మార్కెట్లో ప్రవేశిస్తే.. అంగళ్లను పోలిన వ్యాపార విధానంలో ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, ఆస్క్ మీ బజార్, పేటీఎం లాంటివి అమ్మకాల్లో అదరగొడుతున్నాయి.

బిగ్  బిలియన్ డే, వీకెండ్ ఆఫర్స్, ఫెస్టివల్ డేస్.. ఇలా తోచిన ఆలోచనని అమలు చేస్తూ కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇన్ని వెబ్ సైట్లలో దేంట్లో కొనాలో అన్న అయోమయం మీకెందుకంటూ.. ఎక్కడ తక్కువ ధర ఉందో చెప్పేందుకు మరో వెబ్ సైట్.. ఇలా వ్యాపారమంతా ఆన్ లైన్ అయిపోయింది. అదే వాటికి చేటు తెస్తోంది. అంతా ఒక్క క్లిక్ తోనే తెలిసిపోతుంది. ఇది ఓ విధంగా కస్టమర్లకు వరంలా మారినా.. కంపెనీలకు ప్రతికూలంగా తయారైంది. కస్టమర్లను నిలుపుకోవడం ఇప్పుడు ఈకామర్స్ కంపెనీలకు సవాల్‌గా మారింది.

బూమ్ ని చూసి మొదట్లో ఈ-కామర్స్ సైట్లకు వందలు, వేల కోట్ల పెట్టుబడులు వరదలా వచ్చిపడ్డాయి. విదేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థలతోపాటు దేశీయంగానూ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడికి ఛాన్స్ వస్తే చాలన్నట్లు వ్యవహరించారు. ఒక్కసారిగా వచ్చిపడ్డ నిధుల్ని చూసి చాలా కంపెనీలు వాటి వ్యాపారాన్ని వేగంగా విస్తరించాయి. ప్రాడక్ట్ పోర్ట్ ఫోలియోతోపాటు తమ వెబ్ సైట్లో అమ్ముకునే రిటైలర్ల సంఖ్యనీ గణనీయంగా పెంచుకున్నాయి. ఇందుకోసం వేలమంది ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. దీంతో దశాబ్దాలుగా మెట్టూ మెట్టూ ఎక్కుతూ వచ్చిన టాటా, బిర్లా, రిలయన్స్ లాంటి కంపెనీల మార్కెట్ విలువ సైతం వీటిముందు దిగదుడుపైంది. ఒక్కరోజే ఆరొందల కోట్ల అమ్మకాలు జరిగితే ఏటా ఎంతుండాలి.. లాభమెంత వస్తుంది.. ఐదేళ్లు, పదేళ్లు.. ఇలా భవిష్యత్తు లాభాల్ని పేపర్ పై పెట్టడంతో ఈ-కామర్స్ కంపెనీల మార్కెట్ విలువ లక్షల కోట్లకు చేరింది. అంతా గుడ్ విలే.. కానీ విలువ మాత్రం వేలు, లక్షల కోట్లలనే ఉంది. దీన్ని చూసి కొత్త స్టార్టప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్లాన్ ని పేపర్ పెట్టడం, నిధులు రాబట్టడం.. అనుకుందే తడవు నెలలోపే స్టార్ట్ చెయ్యడం జరిగిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఆ తర్వాతే వాటికి చుక్కలు కనిపిస్తున్నాయి. మొదట్లో కస్టమర్ ని రాబట్టుకోవడానికి రిటైలర్ రేట్ మీద మరికొంత డిస్కౌంట్ ఇచ్చిన కంపెనీలు.. తర్వాత వారిని నిలబెట్టుకోవడానికి కూడా మళ్లీ మళ్లీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోంది. అంటే తయారీ ధరకన్నా తక్కువ ధరకే అమ్ముతున్నారన్నమాట. వాటికితోడు ప్యాకింగ్, డెలివరీ అదనపు ఖర్చులు ఎలాగూ ఉన్నాయి. ఇంతా చేసినా కస్టమర్లు సెలెక్టివ్ గా కొన్ని ఉత్పత్తులు మాత్రమే  ఎక్కువగా కొంటున్నారు. అవికూడా కంపెనీలకు తక్కువ మార్జిన్లు వచ్చే ఉత్పత్తులే. ఎక్కవు కమీషన్ ఉండే ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితేనే నష్టాల్ని తగ్గించుకోవచ్చన్నది వాటి వ్యూహం. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. దీంతో నిర్వహణ కష్టంగా మారింది. కొత్త నిధులు రాక, ఇక డిస్కౌంట్లు ఇచ్చేపరిస్థితి లేక.. చాలా కంపెనీలు చేతులెత్తేశాయి. కొంతమంది ఎంతకో అంతకు వెబ్ సైట్లను అమ్మేసుకుంటుండగా.. ఇంకొంతమంది కార్యకలాపాలను పూర్తిగా ఆపేశారు. ఈ ప్రభావం రెడీమేడ్ ఫుడ్, గ్రాసరీ రంగంలోని వెబ్ సైట్లపై ఎక్కువగా పడింది. ఫుడ్ పాండా, స్విగ్గీ, జొమాటో.. ఇలా ఎన్నో సైట్లు మనకు దగ్గర్లోని రెస్టారెంట్లను వెతికి పెట్టడమే కాక.. ఆర్డరిస్తే అరగంటలో రెస్టారెంట్ రేటు కన్నా తక్కువకే ఇంటికి తెచ్చిస్తున్నాయి. రెస్టారెంట్ల నుంచి వచ్చే 10-15శాతం కమీషన్ ట్రాన్స్ పోర్టేషన్ కే పోతుంది. మరి ఉద్యోగి శాలరీ, వెబ్ సైట్ నిర్వహణ, ప్రకటనల ఖర్చులు.. ఇలా చూస్తే ఏ విధంగానూ లాభం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అటు ట్యాక్సీ క్యాబ్స్ కోసం వచ్చిన ఓలా, ఉబర్ లాంటి కంపెనీలు గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి.

ఇక కిరాణా సరకుల రంగంలో ఉన్న గ్రాసరీ వెబ్ సైట్లదీ మరీ దీనగాధ అని చెప్పాలి. డిస్కౌంట్లు, కూపన్స్ అంటూ ఇంటర్నెట్లో విచ్చలవిడి ప్రచారమే వాటి కొంపముంచుతోంది. ఇలాంటి ఎత్తుగడల్ని ఎలా సొమ్ము చేసుకోవచ్చో బాగా తెలిసిన మన నెటిజన్లు.. ఫ్రీ కూపన్స్ వరకే వాటి దగ్గర కొనుగోలు చేస్తున్నారు. మిగతా వాటికోసం ఇంటి దగ్గర్లోని దుకాణాలకు, హోల్ సేల్ షాపులకు వెళ్తున్నారు. అందుకే చాలా వెబ్ సైట్లు ఒకట్రెండు నెలల్లో వందల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. భవిష్యత్తు లాభాల్ని చూసి వీటిలో పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. లాభం మాట దేవుడెరుగు అసలొస్తే చాలన్నట్లు తమ వాటాల్ని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కస్టమర్లకు వరం.. కంపెనీలకు నష్టాలు

ఏ వస్తువైనా తయారీ ధరకు దొరుకుతుందా? పైసా లాభం లేకుండా ఎవరైనా అమ్ముతారా? సంప్రదాయ వ్యాపారంలో ఈ పరిస్థితి ఎక్కడా ఉండదు. ఒక్కో మెట్టు ఎక్కితేనే పైకెళ్లేది.. ఒకేసారి ఆకాశానికి నిచ్చెనెయ్యాలని చూస్తే ఏమవుతుంది? ఈ తప్పే ఇండియన్ ఈ-కామర్స్ ని ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టేసింది. భవిష్యత్తు లాభాల్ని బేరీజు వేసుకొని వర్తమానంలో నష్టాల్ని కోరి కొనితెచ్చుకుంటున్నాయి.

అతి సర్వత్రా వర్జేయత్.. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ఏ వ్యాపారంలోనైనా ప్రాథమిక సూత్రం ఒకటి ఉంటుంది. లాభాల విషయం పక్కనబెడితే నష్టం రాకుండా అమ్ముకోవాలి. కానీ స్టార్టప్ ల పేరుతో రోజుకో ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ పుట్టుకొచ్చి.. పూర్తి వ్యతిరేక విధానంలో వ్యాపారం చేస్తున్నాయి. నష్టమొచ్చినా సరే కస్టమర్ ని ఆకర్షించాలన్న సూత్రంతో ముందుకెళ్తున్నాయి. కస్టమర్ బేస్ పెరిగితే లాభాలు వాటంతటవే వస్తాయన్నది ఈ-కామర్స్ కంపెనీల వ్యూహం. అందుకే కొనుగోలుదారులను పెంచుకోవడమే లక్ష్యంగా ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులోనూ వైవిధ్యం కనిపిస్తోంది. ఆఫర్లకోసం వీకెండ్స్, పండగల దాకా ఎందుకు ఎదురుచూపులు ఇదుగో తీసుకోండంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి.

కొన్ని కంపెనీలైతే కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు మరో అడుగు ముందుకేసి రూపాయికే అంటూ ఊదరగొడుతున్నాయి. మరికొన్ని ఈ-కాం వెబ్ సైట్లు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే వందల రూపాయల విలువైన కూపన్స్ ఫ్రీగా ఇస్తున్నాయి. మనదేశంలో ఇప్పుడిదో వ్యాధిలా మారింది. లాయల్టీ కస్టమర్లుగా మార్చుకుంటే జీవిత కాలం ఆదాయం పొందొచ్చన్నది వాటి ఆలోచన. ఇదే వాటి కొంప ముంచుతోంది. వాటి దూరాలోచనే దురాలోచనగా మారి నష్టాలపాలు జేస్తోంది.

ఒక్కో కస్టమర్ ని ఆకర్షించడానికి ఈ-కామర్స్ వెబ్ సైట్లు సగటున 200 నుంచి 500 రూపాయల దాకా ఖర్చు చేస్తున్నట్లు ఓ అంచనా. ఆన్ లైన్ కొనుగోళ్ల సగటు ఆర్డర్ విలువ నాలుగొందలకు మించట్లేదని ఓ అధ్యయనంలో తేలింది. రోజురోజుకూ కొనుగోలు దారుల సంఖ్య, ఆన్ లైన్ మార్కెట్ సైజ్ పెరుగుతోందే తప్ప.. సగటు కొనుగోలు విలువ మాత్రం వందల్లోనే ఉంటుంది. అటు ఎక్కువ అమ్ముడయ్యే చాలా ఉత్పత్తులపై ఈ కంపెనీలకొచ్చే కమీషన్ పది శాతానికి మించట్లేదు. అంటే ఒక కస్టమర్ కు ఇచ్చిన డిస్కౌంట్ ని రాబట్టుకోవాలంటే మళ్లీ అతను మరో 10-12 సార్లయినా అదే వెబ్ సైట్లో కొనుగోలు చెయ్యాలి. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. కస్టమర్లేం తెలివి తక్కువవాళ్లు కాదుకదా.. ఏ వెబ్ సైట్లో తక్కువ ధర ఉందో తెలిపే మై స్మార్ట్ ప్రైస్ డాట్ కామ్ లాంటి వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఎక్కడ తక్కువుంటే అక్కడే కొంటారు.. అది ఫ్లిప్ కార్ట్ అయితేంటి, స్నాప్ డీల్ అయితేంటి? ఆన్ లైన్లో ఎక్కడా ఎమ్మార్పీ మీద ఐదు, పదిశాతానికి మించి డిస్కౌంట్ రావట్లేదని గ్రహిస్తే.. ఆఫ్ లైన్ లో సంప్రదాయ రిటైల్ షాపులకు వెళ్లి కొనుక్కుంటున్నారు. పైగా కొత్తగా పుట్టుకొచ్చే కంపెనీలు సైతం ఒకేసారి పాతవాటికి పోటీ ఇవ్వాలని చూస్తున్నాయి. ఇందుకోసం కూపన్లు, ఫ్రీగిఫ్ట్ లు, సినిమా టికెట్ల పేరుతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇదే వాటిని బొక్కబొర్లా పడేస్తోంది.

Monday, November 9, 2015

ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?

కర్టెసీ : Sakshi

బంగారంతో మనది విడ దీయరాని బంధం. అందుకేనేమో! వినియోగంలో చైనానూ మించిపోయారు మనవాళ్లు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో భారీ విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పెపైచ్చు దేశాభివృద్ధికి ఈ బంగారం పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించింది. ఒకటి బంగారం బాండ్లు. రెండు నాణేలు. మూడు బంగారం డిపాజిట్.

ఈ మూడింటి లక్ష్యం ఒక్కటే. బంగారం కొనుగోలు చేయాలన్న భారతీయుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే... అందుకోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం... విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం... ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం. ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరతాయనేది పక్కనబెడితే... అసలు ఈ పథకాలు ఎవరికి పనికొస్తాయి? లాభమెంత? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఫైనాన్షియల్ ప్లానర్ ‘అనిల్ రెగో’ చేస్తున్న ఈ విశ్లేషణ.

* అందుబాటులోకి కొత్త బంగారు పథకాలు  
* పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ బాండ్లు
* ఇంట్లో భారీ బంగారం ఉన్నవారికి డిపాజిట్ స్కీమ్ 
* చిన్న మదుపరులకు ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లే బెటర్
* కావాలనుకుంటే కొనుక్కోవటానికి నాణేలు కూడా

కొత్త కొత్తగా గోల్డ్ బాండ్లు...
గోల్డ్ బాండ్లను జారీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ఇది పరిమిత కాల పథకం. అంటే ఈ నెల 5న ఆరంభమైంది. 20వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు 20వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు జారీ చేస్తున్న ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఉంటుంది. బాండ్లకు, ఈ వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది.

గ్రాము విలువను ప్రభుత్వం రూ.2,684గా నిర్ణయించింది. అంటే బాండ్లు ఎవరు కొన్నా ఈ ధరకే కొనాల్సి ఉంటుంది. కనీసం రెండు గ్రాముల్ని, గరిష్ఠంగా 500 గ్రాముల్ని కొనుగోలు చేయొచ్చు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.

సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై  ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్‌బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు.

ఎక్కడ కొనుగోలు చేయాలి?
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లకు కూడా దరఖాస్తులు తీసుకుని బ్యాంకుల్లో అందజేయటానికి అనుమతి ఉంది.

ఎవరికి లాభం?
వడ్డీ కూడా వస్తుంది కనక... బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు నేరుగా బం గారం కొనకుండా ఈ బాండ్లు కొనవచ్చు. వీటిని పేపర్ రూపంలోను, డీమ్యాట్ రూపంలోను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ రకంగా కొనుగోలు చేసినపుడు దీన్ని దాచుకోవటం చాలా ఈజీ. పెపైచ్చు తరుగులాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించి నగదు చేసుకోవచ్చు.

నష్టాలున్నాయా?
బాండ్లతో నష్టాలున్నాయని చెప్పలేం. అయితే బంగారం ధరలోని హెచ్చుతగ్గులు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత బంగారం ధర తగ్గితే మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఈ స్కీమను ప్రకటించినపుడు... అప్పటి ధరను పరిగణనలోకి తీసుకుని గ్రాము ధరను రూ.2,684గా నిర్ణయించింది.

కాకపోతే నవంబరు 5న ఈ స్కీమ్ ఆరంభించేనాడు ముంబై బులియన్ మార్కెట్లో గ్రాము ధర రూ.26,025గా ఉంది. అంటే దాదాపు 660 రూపాయలు తగ్గినట్లు. ఇది 2.75 శాతానికన్నా ఎక్కువే. అంటే తొలి ఏడాది ఇస్తామన్న వడ్డీ ఈ రకంగా పోయినట్లన్న మాట. ఇలాంటి రిస్కులుంటాయని గమనించాలి.

గోల్డ్ ఈటీఎఫ్‌లు/ మ్యూచ్‌వల్ ఫండ్లు
ఇవేవీ కొత్తగా ఆరంభించినవి కావు. కాకపోతే బంగారంలో మదుపు చేసే పథకాల గురించి తెలుసుకుంటున్నాం కనక గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు), గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల (ఎంఎఫ్‌లు) గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లంటే బంగారం ధరను బట్టి ఆ ధరకే ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఫండ్లన్న మాట.

షేర్ల మాదిరే వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయటం, విక్రయించటం చేయొచ్చు. దీన్లో కనీస పెట్టుబడి రూ.5వేలు. డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. అయితే దీన్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్‌మెంట్ కుదరదు. ప్రస్తుతం 13 సంస్థల వరకూ ఈటీఎఫ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అదే గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లకైతే డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. నెలకు రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ పద్ధతిలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు.

గోల్డ్ డిపాజిట్ స్కీమ్..
ప్రభుత్వం దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌గా పిలుస్తోంది. అంటే బంగారాన్ని డబ్బు చేసుకునే పథకమన్నమాట. దీనిప్రకారం మన దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాల్ని డిపాజిట్ చేస్తే అక్కడ రాళ్లు, ఇతరత్రా తరుగు తీసేసి, దాన్ని కరిగించి నిపుణులు దాని బరువెంతో లెక్కిస్తారు.

ఒకవేళ బంగారు నాణేలు, బార్లు డిపాజిట్ చేస్తే వాటి బరువును అక్కడే చెబుతారు. ఆ బరువును పేర్కొంటూ మీకొక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెనక్కి తీసుకునేటపుడు ఆ సర్టిఫికెట్‌ను అందజేస్తే దాన్లో పేర్కొన్న బరువు గల బంగారాన్ని మీకిస్తారు. అంతేతప్ప మీ ఆభరణాలను తిరిగివ్వరు. అదనపు ఆకర్షణేంటంటే దీనిపై వడ్డీ కూడా ఇస్తున్నారు.

ఈ వడ్డీ 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకూ ఉంటుంది. నిజానికిదేమీ తొలిసారి అందిస్తున్న పథకం కాదు. చాలా కాలం కిందటే ఎస్‌బీఐ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత బంగారాన్నయినా డిపాజిట్ చేయొచ్చు. దీనికి పరిమితి లేదు. 1999 నాటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కూడా ఇలాంటి మినహాయింపులు ఉంటాయనే భావిస్తున్నారు.

ఎవరికి లాభం?
ఆభరణాల రూపంలో కాకుండా బార్ల రూపంలోనో, నాణేల రూపంలోనో ఇంట్లో బంగారం ఉన్నవారికి ఇలాంటి పథకాలు లాభదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని భద్రంగా దాచుకోవటం కూడా సమస్యే. అదే బ్యాంకులో అయితే భద్రత సమస్య ఉండదు. పెపైచ్చు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆదాయమూ రాదు. బ్యాంకులో ఉంటే ఏటా వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులో కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.

నష్టాలు ఉన్నాయా?
బంగారం ఉన్నవారు డిపాజిట్ చేస్తే మంచిది తప్ప బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న వారు దాన్ని కొని డిపాజిట్ చేయటం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తరవాత ధర తగ్గితే ఆ మేరకు నష్టపోవాల్సి ఉంటుందని గమనించాలి.

కేంద్రం తాజాగా అశోకచక్ర చిహ్నంతో బంగారు నాణేలను కూడా విడుదల చేసింది. ఎంఎంటీసీ ఔట్‌లెట్లలో ఇవి లభ్యమవుతాయి. నాణేలు కొనాలనుకున్నవారికి కేంద్రమే అందిస్తోంది కనక ఇవి ఉపయుక్తమని చెప్పాలి. వీటిని ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించినా ఏకమొత్తంలో మదుపు; ధర తగ్గితే రిస్కు ఉంటాయి.

ఎవరికి ఏ పథకం లాభం?
గోల్డ్ ఈటీఎఫ్/ గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్స్  : ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేవారికి,  రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసేవారికి (సిప్)
 గోల్డ్ బాండు : ప్రభుత్వ మద్దతున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి; భవిష్యత్తులో బంగారం కొనా లనుకున్నవారికి
 గోల్డ్ డిపాజిట్ పథకం : నేరుగా బంగారం ఉండి, దాన్ని అదే రూపంలో తమ వద్ద ఉంచుకోకూడదని భావించేవారికి

ఉదాహరణకు ఈ మూడు పథకాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకు సమానమైన బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం...

ఈ పట్టిక చూస్తే ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఎంఎఫ్‌లకన్నా గోల్డ్ డిపాజిట్ స్కీమ్, బాండ్లపైనే ఎక్కువ రాబడి వస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం... వడ్డీ. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతిలో గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసినపుడు మిగతా వాటికన్నా ఎక్కుకే రాబడి రావచ్చు. ఎందుకంటే ధరలు పెరిగినా, తగ్గినా ఆ ధరలకే యూనిట్లు లభిస్తాయి కనక సగటు ధర తక్కువే ఉంటుంది.

లాభమూ బాగానే ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు బాగా పడిపోయినా ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ బాండ్లు, డిపాజిట్ స్కీమ్‌తో పోలిస్తే సిప్ పద్ధతిలో నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అయితే పై స్కీముల్లో వడ్డీ రేట్లు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. అందుకని బాగా డబ్బులుండి ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేదాద్దమనుకున్న వారికి, ఇంట్లో ఆభరణాలు కాకుండా అదనపు బంగారం ఉన్నవారికి మాత్రం పై రెండు స్కీములూ ఆకర్షణీయమేనని చెప్పొచ్చు.

Friday, July 10, 2015

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలు

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలు

                    గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు పతనమవుతాయో అంచనావేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడి పెట్టే కంటే... కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రయోజనం పొందవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇలాంటి హెచ్చుతగ్గుల మార్కెట్లలో చిన్న ఇన్వెస్టర్లకు ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ వివిధ పథకాలతో చక్కని రాబడులను అందిస్తోంది.
                    మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను దృష్టిలో పెట్టుకొని ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ డైనమిక్ ఫండ్ ను ప్రవేశపెట్టింది.  డైనమిక్ ఫండ్ అనేది పూర్తిగా ఈక్విటీ పథకమే అయినా దీని పనితీరు భిన్నంగా ఉంటుంది. మార్కెట్లు పతనమైనప్పుడల్లా కొనుగోలు చేసి గరిష్టస్థాయికి చేరుకున్నప్పుడల్లా విక్రయిస్తుంటాయి. దీని వలన దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు చక్కని లాభాలు వస్తాయి. 2002 అక్టోబర్ 31న ప్రారంభమైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్.... ప్రస్తుతం 59 స్టాక్స్ ను హోల్డ్ చేస్తోంది. 0.76 కంటే తక్కువగా బీటా ఫండ్ ను కలిగి ఉన్న ఈ ఫండ్ తొలి ఏడాది 7.96 శాతం రిటర్న్స్ ఇచ్చింది. తొలి మూడేళ్ళలో  ఏటా సగటున 19.59 శాతం,  ఐదేళ్ళలో 12.45 శాతం, ఏడేళ్ళలో 15.35 శాతం, పదేళ్ళలో 19.37 శాతం రిటర్న్స్ నిచ్చింది, ఇప్పటి వరకు ఏటా సగటున 25.62శాతం లాభాలను అందించింది. 2002లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 18 లక్షల 10 వేల 669 రూపాయలకు పెరిగింది.
                     బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీ రాబడితో పాటు డెట్  పథకాల రక్షణనూ పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ విభాగంలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌‍డ్ అడ్వాంటేజ్ ఫండ్.  2009 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ ఫండ్ కూడా ఇన్వెస్టర్లకు చక్కని రిటర్స్ ఇస్తోంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, హెచ్‌‍సీఎల్ టెక్నాలజీస్‌‍తో పాటు మొత్తం 64 కంపెనీల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది.  అత్యుత్తమ కంపెనీలపైనే దృష్టి పెడుతోన్న ఈ ఫండ్..  తొలి ఏడాది 15.75 శాతం రాబడినిచ్చింది. తొలి మూడేళ్ళలో ఏటా సగటున 19.87 శాతం, ఐదేళ్ళలో 14.54 శాతం, ఏడేళ్ళలో సగటున 14.59 శాతం రిటర్న్స్ నిచ్చింది. 2006లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌‍డ్ అడ్వాంటేజ్  ఫండ్‌లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 2 లక్షల 58 వేల రూపాయలు. ఈ ఫండ్ ద్వారా వచ్చిన రిటర్న్స్‌కు పన్నుపరంగా కూడా ప్రయోజనం ఉంటుంది.
                     ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ లో చక్కని రిటర్న్స్ ఇస్తోంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్. 2008లో ప్రారంభమైన ఈ ఫండ్...   HDFC బ్యాంక్,  ICICI  బ్యాంక్,  ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్,  HCL టెక్నాలజీస్ తో పాటు మొత్తం 49 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. మెరుగైన కంపెనీలనే దృష్టి పెడుతోన్న ఈ ఫండ్..  తొలి ఏడాది 15.94 శాతం రాబడినిచ్చింది. తొలి మూడేళ్ళలో ఏటా సగటున 21.57 శాతం, ఐదేళ్ళలో 14.41శాతం, ఏడేళ్ళలో ఏటా సగటున 17.60 శాతం రిటర్న్స్ నిచ్చింది.  2008 నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ సగటున ఏటా 16.19  శాతం రాబడిని అందించింది. 2008లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 2 లక్షల 91 వేల 6 వందల రూపాయలుగా ఉంది.
                    మీ పోర్ట్ ఫోలియోలో తప్పనిసరిగా ఉంచుకోదగ్గ మరో ఫండ్... ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్. ఇది వాల్యూ ఓరియెంటెండ్ ఫండ్. 2004లో ప్రారంభమైన ఈ ఫండ్ చక్కని ట్రాక్ రికార్డ్ ను కలిగి ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ లో 65 నుంచి 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తోంది. ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, విప్రోతో పాటు మొత్తం 61 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. తొలి ఏడాది 27.83 శాతం రాబడినిచ్చిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్... తొలి మూడేళ్ళలో ఏటా సగటున 31.58 శాతం, ఐదేళ్ళలో 19.39శాతం, ఏడేళ్ళలో సగటున 24.58 శాతం రిటర్న్స్ నిచ్చింది. 2004 నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ సగటున ఏటా 24.95 శాతం రాబడిని అందించింది. 2004లో  ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ లో ఏకమొత్తంగా లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత విలువ 11 లక్షల 34 వేల ఒక వంద రూపాయలుగా ఉంది.