ఇక గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా...ఇచ్చింది తక్కువ-పుచ్చుకుంది ఎక్కువ
బడ్జెట్-షేర్‌మార్కెట్ చాలాకాలంగా అంటే గత 30, 40 సెషన్లుగా ఎటువంటి భారీ కదలికలకు నోచుకోని మార్కెట్ ప్రధాన సూచీలు బడ్జెట్ రోజు అమాంతంగా పెరిగిపోయాయి. అయితే, సుదీర్ఘ వారాంత సెలవులు రావడం, రిటైల్ మదుపరులు అమ్మకాలకు పూనుకోవడం, లాభాల స్వీకరణ వంటి వాటి వలన ట్రేడింగ్ చివర్లో కొంత మేర సూచీల పెరుగుదల దెబ్బ తిన్నది. ఇచ్చింది తక్కువ-పుచ్చుకుంది ఎక్కువ అనే విమర్శకు గురైన గురైన ఈ బడ్జెట్ విదేశీ సంస్థాగత మదుపరులను బాగా ఆకర్షించింది. అందుకు వారి కొనుగోళ్ళ శాతం బడ్జెట్ రోజు హెచ్చుగా ఉంది. అయితే సాధారణ మదుపరులు మాత్రం అమ్మకాల వైపే మొగ్గు చూపారు.
గత కొన్ని సెషన్లుగా మార్కెట్ ఇంత భారీగా వృద్ధి చెందకపోవడం వీరిని అమ్మకాల వైపు మళ్ళించి ఉండవచ్చు. బడ్జెట్‌లో మార్కెట్లకు సంబంధించి ఎటువంటి నెగటివ్ ప్రభావం చూపించే అంశాలు ఉండకపోవడం వల్ల కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ ఏర్పడింది. ఇక రేపటి నుంచి మార్కెట్లు యథావిధిగా గ్లోబల్ ట్రెండ్‌ను అనుసరించి సాగుతాయి. ప్రస్తుతానికి టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 4920 పాయింట్ల పైన పటిష్ఠంగా క్లోజ్ అయ్యింది. ఈ ఏడాది చాలా వరకు నిఫ్టీ 4,700-5,200 పాయింట్ల మధ్య కదలాడే అవకాశం ఉంది. ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారు మంచి కరెక్షన్‌లు సంభవించినప్పుడు పెట్టుబడులకు అవకాశంగా వినియోగించుకుంటే లాభాలను అందుకోవచ్చు.
లాభపడనున్న సెక్టార్స్: ఆటో, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ రంగాలతో పాటుగా కొంతకాలంగా బలపడుతున్న పీఎస్‌యూ ట్రెండ్‌ను అనుసరించి ఆ కంపెనీల షేర్లు...ఇవన్నీ కూడా ముందు ముందు మంచి తీరు కనబర్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఇన్వెస్టర్లు ఐపీఓలలో ఎక్కువగా పాల్గొనడం లేదు. సెకండరీ మార్కెట్ కూడా చాలా సెషన్లుగా స్తబ్దుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అయోమయ పరిస్థితులు చక్కపడగానే ఇక్కడ కూడా ర్యాలీకి ఆస్కారం ఉంది. ఎటూ కదలకుండా నిలకడగా బ్లూ చిప్ షేర్లు చాలా ఉన్నాయి. మిడ్‌కేప్ షేర్ల కంటే కూడా వాటిని కొనుగోలు చేస్తే ఉపయోగం ఉంటుంది.

