Wednesday, February 19, 2014

డిమాండ్ బంగారమే..


 
ముంబై: బంగారం దారి ఎప్పుడూ బంగారమేనని మరోసారి స్పష్టమైంది. 2013లో భారత్ పసిడి డిమాండ్ 2012తో పోల్చితే 13 శాతం పెరిగింది. పరిమాణంలో 864 టన్నుల నుంచి 975 టన్నులకు చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ఒకటి ఈ విషయాలను తెలిపింది. కరెంట్ అకౌంట్ కట్టడి(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా  దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య విలువ మధ్య వ్యత్యాసం)లో భాగంగా ప్రభుత్వం పసిడి దిగుమతులపై పలు ఆంక్షలు విధించినప్పటికీ పసిడి డిమాండ్ పెరగడం ఆసక్తికరం. 2013 గోల్డ్ డిమాండ్ ధోరణుల పేరుతో డబ్ల్యూజీసీ ఈ గణాంకాలను విడుదల చేసింది.

డబ్ల్యూజీసీ మేనేజింగ్ డెరైక్టర్(ఇండియా) సోమసుందరం తెలిపిన వివరాలు క్లుప్తంగా...
 2013 మొదటి ఆరు నెలలతో పోల్చితే ద్వితీయార్థంలో డిమాండ్ తగ్గింది. సరఫరా ఇబ్బందులు దీనికి కారణం. ఏప్రిల్-మే నెలల్లో బంగారం ధర తగ్గడాన్ని గృహస్తులు కొనుగోళ్లకు అవకాశంగా భావించారు.

 ఆభరణాలకు డిమాండ్ 11 శాతం పెరిగి 612.7 టన్నులుగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది రూ.1,61,751 కోట్లు. 2012లో ఈ పరిమాణం 552 టన్నులు. విలువలో రూ.1,58,359 కోట్లు.

 పెట్టుబడుల డిమాండ్ 16% పెరిగి 362.1 టన్నులుగా నమోదయ్యింది. 2012లో ఇది 312.2 టన్నులు. విలువలో ఈ పరిమాణం 6 శాతం పెరిగి రూ. 90,184.6 కోట్ల నుంచి రూ.95,460.8 కోట్లకు చేరింది.

 సైకిల్డ్ గోల్డ్ డిమాండ్ 10.79 శాతం పడిపోయింది. ఇది 113 టన్నుల నుంచి 100.8 టన్నులకు తగ్గింది.
2013 ద్వితీయార్థంలో గ్రే మార్కెట్ క్రియాశీలత పెరిగింది. ప్రభుత్వ నియంత్రణలు కొనసాగితే 2014లో ఈ ప్రభావం మరింత పెరిగి, స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

 {పభుత్వ ఆంక్షల వల్ల బంగారం అక్రమ రవాణా తీవ్రమయ్యింది. నెలకు 20 నుంచి 30 టన్నుల వరకూ అక్రమ రవాణా మార్గాల్లో పయనించినట్లు అంచనా.

 2014లో భారత్ బంగారం డిమాండ్ 900 టన్నుల నుంచి 1,000 టన్నుల వరకూ ఉండొచ్చు.

 ప్రపంచవ్యాప్తంగా డౌన్...

 కాగా ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 2013లో 15 శాతం పడిపోయింది. 2012తో పోల్చితే 4,416 టన్నుల నుంచి 3,756 టన్నులకు పడిపోయింది. ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)నుంచి భారీ మొత్తంలో నిధుల ఈక్విటీ మార్కెట్లకు తరలిపోవడమే దీనికి కారణం. అయితే ఈటీఎఫ్ రూపంలో డిమాండ్ పడిపోయినా... బంగారం మార్కెట్ విషయంలో వినియోగదారుల నుంచి 21 శాతం వృద్ధి నమోదుకావడం విశేషం.

 భారత్‌ను అధిగమించిన చైనా
 ఇదిలావుండగా... 2013లో బంగారం డిమాండ్ విషయంలో భారత్‌ను చైనా అధిగమించింది. ప్రపంచంలో అతిపెద్ద పసిడి వినియోగదారుగా తన హోదాను భారత్ మొదటిసారిగా చైనాకు అప్పగించింది. చైనాలో 2013లో బంగారం డిమాండ్ 1,065.8 టన్నులుగా నమోదయ్యింది. భారత్ ఈ పరిమాణం 975 టన్నులు మాత్రమే. కాగా 2012లో చైనా బంగారం డిమాండ్ 806.8 టన్నులుగా ఉంది. 2014 సంవత్సరంలో చైనా బంగారం డిమాండ్ 1,000-1,100 టన్నులుగా ఉంటుందన్నది అంచనా.

Saturday, February 15, 2014

బిర్యానీ ప్రియుల ప్యారడైజ్ !

Sakshi | Updated: February 15, 2014 08:37 (IST)
బిర్యానీ ప్రియుల ప్యారడైజ్ !
  1953 నాటి మాట.. సికింద్రాబాద్‌లో ‘ప్యారడైజ్ టాకీస్’ పేరిట సినిమా థియేటర్ నడిచేది. థియేటర్‌కు అనుబంధంగా సమోసా, చాయ్, బిస్కెట్ అమ్మే చిన్న టీ కొట్టు ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. మెల్లగా ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ హుస్సేన్ హిమ్మతీ టీకొట్టు మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. 10 మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు ఇప్పుడు 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే ప్యారడైజ్ హోటల్‌గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే లా దాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం 2.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి.

 స్థానికానికే ప్రాధాన్యం...
 దేశ, విదేశీ ప్రతినిధుల నోరూరించే ప్యారడైజ్ బిర్యానీ తయారీకి వస్తువుల్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారనేది చాలా మంది ప్రశ్న. ప్యారడైజ్ బిర్యానీకి ఉపయోగించే ధావత్ బాస్మతీ బియ్యాన్ని ఢిల్లీ నుంచి, సుగంధ ద్రవ్యాలైన సాఫ్రాన్‌ను కాశ్మీర్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మాంసం ఉత్పత్తుల్ని మాత్రం హైదరాబాద్‌లోని చెంగిచెర్ల నుంచి, తృణ ధాన్యాలు, గరం మసాలా, ఇతర దినుసులన్నిటినీ బేగంబజార్ నుంచే తెచ్చుకుంటారు. ఇవన్నీ స్థానికంగా లభించేవే.

 మొదటి గ్రేడువే వాడుతుంటారు. ‘‘మేం బిర్యానీ కోసం ఉపయోగించే మాంసం ఎంత లేతదంటే.. పచ్చి మాంసంతోనే బిర్యానీ వంటకం మొదలుపెడతాం’’ అంటారు గత 30 ఏళ్లుగా ప్యారడైజ్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్. హైదరాబాద్ నుంచి దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో బిర్యానీ పార్శిల్స్ వెళ్తుంటాయి.

 త్వరలో మరో 4 బ్రాంచీలు..
 ప్రస్తుతం సికింద్రాబాద్ ప్యారడైజ్‌తో పాటు హైదరాబాద్‌లో 6 ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటె క్‌సిటీ, మాసబ్‌ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్, కూకట్‌పల్లి, బేగంపేటల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఈ ఏడాదిలో దిల్‌సుఖ్‌నగర్, ఏఎస్‌రావ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మరో 4 హోటళ్లు ప్రారంభం కానున్నా చెప్పారు ఖాజిం హిమ్మతీ. ఇప్పటికే అందుబాటులో ఉన్న కూకట్‌పల్లి ప్యారడైజ్ హోటల్  నుంచి హోమ్ డెలివరీని కూడా ప్రారంభిస్తున్నామని, జనాదరణ బట్టి మిగతా బ్రాంచీలకూ హోమ్ డెలివరీని విస్తరిస్తామని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన.

 ఇత ర నగరాల్లోనూ... : ఇప్పటిదాకా హైదరాబాద్ వాసులు మాత్రమే రుచిచూసిన తమ బిర్యానీని ఇతర జిల్లాలు, మెట్రో నగరాలకు సైతం అందించడానికి ప్యారడైజ్ ప్రణాళికలు వేస్తోంది. 2015 ముగిసేలోగా రాష్ర్టంలోని విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లోను, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ ప్యారడైజ్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. ఏ నగరంలో మొదట ప్రారంభించాలి? అక్కడ అనువైన ప్రాంతమేది? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆదరణ, అవసరాలను బట్టి బ్రాండ్ అంబాసిడర్ ను కూడా ఎంపిక చేసుకుంటారు.

 పాఠశాల నుంచి మేనేజ్‌మెంట్ వరకు..
 ఇప్పటివరకు ప్యా రడైజ్ హోటళ్లలో పనిచేసే వారంతా హోటల్ మేనేజ్‌మెంట్‌లలో శిక్షణ పూర్తి చేసినవారే. ఎక్కడో కోర్సులు పూర్తి చేసిన వారికి కాకుండా తామే సొంతగా శిక్షణ ఇవ్వటానికి ప్యారడైజ్ హోటల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ‘ప్యారడైజ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ‘ప్యారడైజ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్’ను కూడా ప్రారంభించనున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణతో పాటు శిక్షణానంతరం తమ బ్రాంచీల్లో ఉద్యోగులుగా కూడా నియమించుకుంటారు.

 రుచి చూడని వారు లేరు...
 హైదరాబాద్‌కు ప్రముఖులు ఎవరొచ్చినా ప్యారడైజ్ బిర్యానీ రుచి చూడాలని కోరుకుంటారు. రాహుల్‌గాంధీ, ఎంపీలు జ్యోతిరాదిత్య సింధియా, ప్రియాదత్, సచిన్‌పైలట్, మిలింద్ దేవరా, కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, క్రికెట  ర్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి; చిత్రకారుడుఎంఎఫ్ హుస్సేన్, నాటి మంత్రులు గురుమూర్తి, రోడా మిస్త్రీ, సికింద్రాబాద్ మేయర్ సాంబయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖుల లిస్ట్ చాలా పెద్దదేనన్నారు ఖజీం హిమ్మతీ.

 ‘పీ’ లోగో ఉంటేనే ప్యారడైజ్...: ప్యారడైజ్ పేరుతో నగరంలో చాలా హోటళ్లు, బేకరీలున్నాయని అవన్నీ తమవి కావని ఖాజీం చెప్పారు. ‘పీ- అనే అక్షరం, 1953 ఉన్న లోగో హోటళ్లు మాత్రమే మావి. సికింద్రాబాద్‌లోని సెంట్రల్ కిచెన్‌లోనే బిర్యానీ వండుతాం. ఇక్కడి నుంచే అన్ని బ్రాంచీలకు సరఫరా చేస్తాం. రాబోయే తరాలూ ఈ వ్యాపారంలోనే ఉంటాయి’ అన్నారాయన.

Friday, February 14, 2014

పర్సు జారి గల్లంతయ్యిందే (Feb 14 Valentines Day Special)

ఫిబ్రవరి 14.. ప్రేమికులకే కాదు.. కంపెనీలకూ పండుగ రోజే. తన 'స్వీట్ హార్ట్' కోసం ప్రేమికులు కొనే బహుమతులు.. కంపెనీలకు కాసులు కురిపిస్తాయి. అందుకే ఇది ప్రేమికుల 'పర్సు జారి గల్లంతయ్యే రోజు.. కంపెనీలకు లాభాలు పంచే రోజు.. మరి ఈసారి వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు)కు ఏయే కంపెనీలు ఎలాంటి ఆఫర్లతో ప్రేమికులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయో తెలుసుకుందామా..!
వేలంటైన్స్ డే నాడు పుష్పగుచ్ఛాలు, చాకొలెట్ బాక్సులు, మొబైల్ ఫోన్లు, గడియారాలు, దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుతో పాటు.. కలసి రెస్టారెంట్లకు వెళ్లేందుకు యువతీయువకులు ప్రాధాన్యం ఇస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విక్రయ సంస్థలతో పాటు రెస్టారెంట్లు కూడా పలు పథకాలు ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, జబాంగ్ వంటి ఆన్‌లైన్ సంస్థలు ఆయా ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తున్నాయి. రూ.41,000 విలువైన ఐఫోన్ 5సి మోడల్‌ను రూ.37,000కే విక్రయిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇక విమాన ప్రయాణంతో ముందుకొచ్చింది స్పైస్‌జెట్.
బిగ్ సి: యువతీ యువకులు ఒకరికి మరొకరు కానుకగా ఇచ్చుకునేందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నట్లు బిగ్ సి డైరెక్టర్ పవన్ వెల్లడించారు. డ్యూయల్‌సిమ్, టచ్, స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఈ ప్రత్యేక ఆఫర్‌లో ఉన్నాయి. రెండు ఫోన్ల కొనుగోలుపై రూ.700-1,800 వరకు ఆఫర్ ఉంటుంది. రూ.10,000కు మించిన సోనీ ఎరిక్‌సన్ ఫోన్లు, రూ.15,000కు మించిన శామ్‌సంగ్ ఫోన్లు, రూ.22,000కు మించిన ఐఫోన్లను వడ్డీ లేని సులభ వాయిదాల్లో కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కూడా బిగ్ సి కల్పిస్తోంది. ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు. ఆదివారం వరకు ఈ ఆఫర్లు అమలులో ఉంటాయి.

యూనివర్‌సెల్: సిటీబ్యాంకు క్రెడిట్ కార్డుదారులకు 10% రాయితీతో పాటు స్మార్ట్‌ఫోన్లపై పలు ఆఫర్లు ఇస్తోంది.

లాట్: రూ.5,000-50,000 వరకు విలువైన స్మార్ట్ ఫోన్లను మార్చుకుని, కొత్తవి కొనుగోలు చేయాలనుకునే వారికి అవకాశం. పాత స్మార్ట్ ఫోన్ తీసుకుని వస్తే 50% విలువ ఇస్తామని, వెంటనే మార్చుకుని కొత్తది కొనుగోలు చేసుకోవచ్చు.

వాచీలపై 20-40 శాతం: వాచీలపై 20-40% వరకు రాయితీని టైటాన్ ప్రకటించింది.

స్పైస్‌జెట్: ఈ నెల 28 లోపు దేశీయంగా స్పైస్‌జెట్ విమానాల్లో ప్రయాణించిన వారు లక్కీ డ్రాలో మరో దేశీయ ప్రయాణానికి ఉచితంగా టికెట్టును గెలుపొందే అవకాశం కల్పిస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఇలా లక్ష టికెట్లు అందచేస్తామని తెలిపింది. డ్రాలో విజేతల వివరాలను మార్చి 7న తమ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని పేర్కొంది.

హోటళ్లలో: హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో ప్రేమికులు, దంపతులు ప్రత్యేక విందుకు హాజరు కావచ్చు. పార్క్ హయత్, ట్రిడెంట్ హోటల్, గోల్కొండ హోటల్, ఎల్లా హోటల్స్‌తో పాటు జీవీకే వన్ మాల్‌లోని హార్డ్‌రాక్ కేఫ్, బార్బెక్యు నేషన్ రెస్టారెంట్లు ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి.

రిలయన్స్ జువెల్స్, జోయాలుక్కాస్ ప్రత్యేక పథకాలను ప్రకటించాయి.
విదేశాల నుంచి ఆర్డర్ల వెల్లువ
భారత్ నుంచి అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లిన వారు చాలామంది ప్రేమికుల రోజుకు వారు ఆయా దేశాల నుంచి ఇక్కడి తమ సన్నిహితులకు బహుమతులు పంపుతుంటారు. ఈ ఏడాది భారత్ మొత్తం మీద 50,000 వరకు ఆర్డర్లు వస్తాయని ఆన్‌లైన్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందులోనూ సింహభాగం అమెరికా నుంచే ఉంటాయని సమాచారం. దేశం మొత్తానికీ వచ్చేవాటిలో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్‌కే ఉంటాయని యూఎస్2ఏపీడాట్‌కామ్ ఎండీ శ్రీధర్ చెప్పారు. గత ఏడాది సగటు ఆర్డరు 43 డాలర్లుండగా, ఈసారి డాలర్ విలువ 10 శాతం పెరిగినప్పటికీసగటు ఆర్డరు విలువ 45 డాలర్లుగా (సుమారు రూ.2,800) ఉందన్నారు.
అసోచామ్ అధ్యయనం చెబుతున్న
ఆశ్చర్యకరమైన నిజాలు..
చి గత ఏడాదితో పోలిస్తే ఈసారి 'ప్రేమ ఖరీదు' పెరగొచ్చు. 2013లో వేలంటైన్స్ డే వేళ దాదాపు రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రేమికులు ఈ ఏడాది రూ.18,000 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చి ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, హాస్పిటాలిటీ తదితర రంగాలతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలో అధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగులు భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది.

చి అధిక వేతన ఉద్యోగులు రూ.1000-50,000 వరకు వెచ్చించవచ్చు. విద్యార్థులైతే రూ.500-10,000 వరకు ఖర్చు పెట్టొచ్చని అంచనా.

చి ప్రేమికుల రోజున మరింత అందంగా కన్పించేందుకు 75 శాతం మంది తమ వ్యక్తిగత సౌందర్యం కోసం రూ.500-10,000 వరకు వెచ్చించడం ఆశ్చర్యమే కదూ!

చి రిటైల్ విక్రయ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఎంపీ3 ప్లేయర్లు, ఐపాడ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వస్త్రాలు ఆదాయం తెచ్చిపెట్టనుండగా.. ఆన్‌లైన్ విక్రయ సంస్థలకు పూలు, గ్రీటింగ్ కార్డులు, చాకొలెట్లు, బొమ్మలు, ఆభరణాల ద్వారా ఆదాయం రానుంది.

చి 'తమ వాళ్ల'తో కలసి రాత్రిపూట హోటల్‌కు భోజనానికి వెళ్లాలని 65% మంది అనుకుంటూండగా.. తనను డిన్నర్‌కు తీసుకెళ్తే బాగుండునని 49% మంది కోరుకుంటున్నారు. తమ ప్రేమను తెలిజేస్తూ చాకొలేట్లు ఇవ్వాలని 38 శాతం మంది భావిస్తూండగా, పువ్వులు ఇవ్వాలని 37% మంది భావిస్తున్నారు. తన ప్రియుడు/ప్రియురాలు నుంచి చాకొలేట్లు బహుమతిగా వస్తే బాగుంటుందని 30% మంది, పువ్వులు వస్తే సంతోషమని 20% మంది ఎదురుచూస్తున్నారు.

చి గ్రీటింగ్‌లు ఇవ్వాలనుకునేవారు 8% మంది అయితే.. గ్రీటింగ్ కార్డులు రావాలని ఎదురుచూస్తున్నవారు 15 శాతం మంది. 7% మంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతూ ఉండగా.. 20 శాతం మంది అలాంటివే రావాలని కోరుకుంటున్నారు.

చి వేలంటైన్స్ డే కొనుగోళ్లలో గుర్‌గావ్, నోయిడా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, గోవా, పుణెల్లో చదువుతున్న/ఉద్యోగం చేస్తున్న వారి వాటా 75 శాతం ఉంది.

చి ప్రేమికుల రోజున కానుకల కోసం 65 శాతం మంది పురుషులు వెచ్చిస్తుండగా.. మహిళలు 35 శాతం మంది మాత్రమే ఖర్చు పెడుతున్నారు.

పైచేయి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లదే

ముగిసిన స్పెక్ట్రమ్ వేలం
ప్రభుత్వానికి రూ.61,162 కోట్లు
లక్ష్యాన్ని మించి నిధులు 

రేడియో తరంగాల వేలానికి టెలికాం కంపెనీల నుంచి విశేష స్పందన లభించింది. 10 రోజుల పాటు కంపెనీల మధ్య పోటాపోటీగా జరిగిన స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ గురువారం ముగిసింది. ప్రభుత్వ లక్ష్యాన్ని మించి ఖజానాకు రూ.61,162 కోట్లు సమకూరాయి. ఢిల్లీ, ముంబయి, ఇతర నగరాల్లో కీలకమైన స్పెక్ట్రమ్‌ను వొడాఫోన్ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్‌లు దక్కించుకున్నాయి. 900 మెగాహెర్ట్జ్, 1,800 మెగా హెర్ట్జ్ (ఎంహెచ్‌జెడ్) బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేసింది. ఈ రెండు బ్యాండ్ల రేడియో తరంగాలను సొంతం చేసుకోవడానికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తహతహలాడినప్పటికీ 18 సర్కిళ్లలో 1800 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌నే ఎంచుకుంది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలలో వొడాఫోన్‌కు ఉన్న లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబరుతో ముగుస్తుంది. దీంతో కార్యకలాపాలను కొనసాగించాలంటే.. ఎంత ధరైనా చెల్లించి స్పెక్ట్రమ్‌ను పొందాల్సిన అవసరం కంపెనీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ మూడు మహానగరాల్లో 900 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్, 11 సర్కిళ్లలో 2జీ 1800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను పొందడానికి రూ.19,600 కోట్లు వెచ్చించి బిడ్లు దాఖలు చేసింది. ఢిల్లీ, కోల్‌కతాలలో ఎయిర్‌టెల్ లైసెన్సుల గడువు కూడా నవంబరుతో ముగుస్తుంది. ఈ రెండు మహానగరాలతోపాటు ముంబయిలో కూడా 900 మెగా హెర్ట్జ్ రేడియోతరంగాలను ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది. 15 సర్కిళ్లలో 1800 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్‌ను పొందింది. ఇందుకు రూ.18,530 కోట్లు వెచ్చించింది. 1800 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలను వినియోగించి దేశ వ్యాప్తంగా 4జీ సేవలందించనున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఢిల్లీలో ఐడియా కూడా 900 మెగాహెర్ట్జ్ రేడియో తరంగాలను సంపాదించింది.
2013-14లో రూ.18,296 కోట్లు 
వేలం పూర్తి కావడం సంతోషం కలిగిస్తోందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. ప్రభుత్వానికి మొత్తం రూ.61,162.22 కోట్లు లభిస్తాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే వేలం విజయవంతమైనట్లేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కనీసం రూ.18,296.36 కోట్లు లభిస్తాయి.భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఇన్ఫోకాం సహా 8 టెలికాం వేలంలో పాల్గొన్నాయని, 68 విడతల్లో వేలం జరిగిందని తెలిపారు. 1800 మెగా హెర్ట్జ్ విభాగంలో దాదాపు 78 శాతం బ్లాక్‌లకు బిడ్లు దాఖలయ్యాయి. 900 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో మొత్తం (100 శాతం) బ్లాకుల్లో బిడ్లు వేశారు. 1800 మెగా హర్ట్జ్ (ఎంహెచ్‌జెడ్) స్పెక్ట్రమ్ బిడ్డింగ్ మొత్తం కనీస విలువను మించింది. ఈ రేడియో తరంగాల్లో దాదాపు 385 మెగాహెర్ట్జ్‌ని ప్రభుత్వం పక్కన పెట్టింది. 900 ఎంహెచ్‌జెడ్‌లో 46 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు వేలం వేయలేదు. 900 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలకు రూ.37,572.60 కోట్ల బిడ్లు లభించాయని, 1,800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు రూ.23,589.62 కోట్ల విలువైన బిడ్లు లభించాయని టెలికాం కార్యదర్శి ఎం.ఎఫ్. ఫరూకీ తెలిపారు. మొత్తం స్పెక్ట్రమ్ కనీస ధరను ప్రభుత్వం రూ.47,933.40 కోట్లుగా నిర్ణయించింది. 1,800 ఎంహెచ్‌జెడ్ రేడియో తరంగాలకు ముందుగా (అప్ ఫ్రంట్) 33 శాతం మొత్తాన్ని చెల్లించడానికి కంపెనీలు అంగీకరించాయి. 900 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు ఇది 25 శాతం ఉంది.

Monday, February 10, 2014

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముఖ్యాంశాలు (10-02-2014)

హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వచ్చే ఆర్నెల్ల కాలానికి గాను నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సభలో తెలంగాణ సభ్యుల నిరసన నినాదాల మధ్య పదినిమిషాల్లోనే మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగించారు. అందులోని ముఖ్యాంశాలు.
* 2014-15 వార్షిక బడ్జెట్ రూ. 1,83,129 కోట్లు.
* ప్రణాళిక వ్యయం రూ. 67,950 కోట్లు.
* ప్రణాళికేతర వ్యయం రూ. 1,15,179 కోట్లు
*  రెవెన్యూ నిధుల అంచనా రూ. 474 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా రూ. 25,402 కోట్లు
*  2013-14 లో సవరించిన బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు రూ. 1.023 కోట్లు.

కొత్త ఉద్యోగాలు 
*  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,346 కొత్త ఉద్యోగాలు మంజూరు చేశాం.
*  98,652 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
*  వరిసాగు 2012-13 లో 36.28 లక్షల హెక్టార్ల నుంచి 2013-14లో 43.95లక్షల హెక్టార్లకు పెరిగింది.
*  2013-14లో ఆహారధాన్యాల ఉత్పత్తి 207.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా.
*  2013-14లో రైతులకు సబ్సిడీపై అందించే ఎరువుల మొత్తాన్ని 72.33 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచగలిగాం.
*  ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల కార్యక్రమం కేటాయింపును రూ. 571. 84 కోట్లకు పెంచాం.
*  గుడ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
*  పశుసంపద అభివృద్ధికి కేటాయింపులను రూ. 874.15 కోట్లకు పెంచాం.
* 2013-14లో రూ. 67,224 కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలన్నది లక్ష్యం.
*  జలయజ్ఞం కింద ఇప్పటివరకు 17 ప్రాజెక్టులు పూర్తి చేశాం.
*  మచిలీపట్నం నౌకాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తాం.
*  భావనపాడు, కళింగపట్నంలో రెండు చిన్న నౌకాశ్రయాల అభివృద్ధి ప్రతిపాదన ఉంది.
*  రాజీవ్ యువకిరణాల పథకం కింద 25 వేల మందికి ఉపాధి కల్పించాం.
*  బంగారు తల్లి పథకం కింద నమోదైన లబ్ధిదారుల సంఖ్య 1,59,163.

(Courtesy EENADU)

Thursday, February 6, 2014

అదరగొడుతున్న భారత సంతతి

Courtesy : Sakshi
అదరగొడుతున్న భారత సంతతి
భారత సంతతి అంతర్జాతీయ స్థాయిలో పలు అతి పెద్ద సంస్థల పగ్గాలు చేపట్టి తమ సత్తా చాటుతున్నారు. విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉద్యోగాలు చేస్తున్న టాప్‌ టెన్‌ అత్యంతకీలక సిఇఓల సరసన ఇప్పుడు సత్య నాదెళ్ల  చేరారు.  ప్రమోటర్ కాకుండా  అతి పెద్ద సాప్ట్ వేర్ కంపెనీ మైక్రోసాప్ట్ కు  సత్య సిఇఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇంద్రనూయి, లక్ష్మిమిట్టల్‌, అన్షుజైన్‌,ఇవాన్‌ మెనెంజీస్‌ లాంటి భారతీయ సంతతికి చెందిన వారు విదేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. దాదాపుగా 12 మంది భారతీయ సంతతికి చెందిన వారు వరల్డ్‌ టాప్‌కంపెనీల్లో అత్యున్నత సిఇఒ పదవుల్లో కొనసాగుతుండటం గర్వకారణం. అటువంటివాటిలో మైక్రోసాప్ట్‌, పెప్సికో, ఆర్సిలర్‌ మిట్టల్‌, డాయిచీ బ్యాంక్‌, డియాగో, మాస్టర్‌ కార్డ్‌ లాంటి కంపెనీలున్నాయి. ఇంతకు ముందు సిటీ గ్రూప్‌, వోడాఫోన్‌, మోటరోలా కంపెనీల సిఇఒలు సైతం భారతీయ సంతతికి చెందిన వారే ఉండేవారు.

అతి పెద్ద కంపెనీలు ఆర్సిలర్‌ మిట్టల్(లక్ష్మీమిట్టల్), రెక్కిట్ బెంకైజర్(రాకేష్ కపూర్), మాస్టర్ కార్డ్(అజయ్ బంగా), డిబిఎస్ గ్రూప్ హోల్డింగ్స్(పియూష్ గుప్త), శాన్ డిస్క్(సంజయ్ మెహ్రోత్ర),గ్రోబల్ ఫౌడ్రీస్( సంజయ్ ఝా), ఎడాబ్(శంతనుడు నారాయెన్) భారత సంతతి సారధ్యంలోనే నడుస్తున్నాయి. ఇవాన్‌ మెనెంజీస్‌  గత సంవత్సరం యుకె కేంద్రంగా నిర్వహించే అతి పెద్ద మద్యం వ్యాపార సంస్థ డియాజియోకు చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అన్షుజైన్ జర్మనీకి చెందిన డాయిచీ బ్యాంక్‌కు కో-సిఇఓగా వ్యవహరిస్తున్నారు. గతంలో అతి పెద్ద సంస్థలైన సిటీగ్రూప్, ఓడాఫోన్, మోట్రోలా వంటి కంపెనీలకు కూడా భారత సంతతికి చెందినవారే సిఇఓలుగా వ్యవహరించారు.

 భారత సంతతి సిఇఓలుగా వ్యవహరించే 10 టాప్‌ కంపెనీల వ్యాపారం విలువ అక్షరాల 350 బిలియన్‌ డాలర్లని అంచనా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారి సారధ్యంలో నడిచే వ్యాపారం  విలువ భారత ఎగుమతులకంటే ఎక్కువగా ఉంటుందని ఒక అంతర్జాతీయ మ్యాగజైన్ వెల్లడించింది. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో కూడా భారత సంతతి ఉన్నత పదవులు అధిష్టించి తమ ప్రతిభను చాటుతున్నారు.

మానవ వనరుల నిపుణుల అంచనాల ప్రకారం భారతదేశంలో నిపుణులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. భారతీయ నిపుణులు సాంకేతికంగా మంచి నైపుణ్యం గలవారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోని ముందుకు సాగిపోగల  సమర్ధులని తేల్చారు.

జిగేల్..జిగేల్..

    -ఆటో ఎక్స్‌పో అదుర్స్
    -కొత్త వాహనాలతో సందడి చేసిన సంస్థలు
    -కాన్సెప్ట్ కార్లే అధికం
    గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 5: ఆటోమొబైల్ సంస్థలకు పండుగ కళ వచ్చింది. కొత్త వాహనాలు, తళుక్కుమనే బెణుకులు, తారల సందడి, కంపెనీల ప్రతినిధుల సందడి ఇది తొలిరోజు గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటోఎక్స్‌పో విశేషాలు. గడిచిన రెండేళ్లుగా అమ్మకాలు లేక వెల ఆటోమొబైల్ సంస్థలు కొత్త వాహనాలను విడుదల చేయడంలో మాత్రం టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న 12వ ఆటో ఎక్స్‌పోలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు కొత్త కార్లతో సందడి చేశాయి. దేశవ్యాప్తంగా కాన్సెప్ట్ కార్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో తొలిరోజు సంస్థలు వీటిని ప్రదర్శించడానికి మొగ్గు చూపాయి. దేశ ఆర్థిక రంగం ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సంకేతాలు వెలుబడటంతో ఆటోమొబైల్ సంస్థలు 2014పైనే భారీ ఆశలు పెట్టుకున్నాయి.karina దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వంటి అగ్రస్థాయి సంస్థలు కాన్సెప్ట్ కార్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. తొలి రెండు రోజులు కేవలం కంపెనీ ప్రతినిధులు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ విశ్లేషకులకు మాత్రమే అనుమతినిస్తుండగా.. ఏడు నుంచి సామాన్యులకు కూడా అవకాశం కల్పించింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ఎస్‌ఐఏఎం), భారత పరిక్షిశమల సమాఖ్య(సీఐఐ)తోపాటు ఆటోమొటివ్ విడిభాగాలు తయారీదారుల సంఘం(ఏసీఎంఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్‌పో ఈ నెల 11 వరకు జరుగనున్నది.

    దీంట్లోభాగంగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ రెండు కొత్త కాన్సెప్ట్ మోడళ్లను నేడు ప్రదర్శించింది.అమ్మకాలను పెంచుకోవడానికి కొత్త వాహనాలను విడుదలచేయాలని నిర్ణయించినట్లు మారుతి సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. మాంద్యం పరిస్థితుల్లోనే గత ఆర్థిక సంవత్సరంలో 10.6 లక్షల యూనిట్లను సంస్థను విక్రయించింది. మరో ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన సంటే ఫీని ప్రవేశపెట్టింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.26.3 లక్షల నుంచి రూ.29.2 లక్షల మధ్యలో లభించనున్నది. అలాగే జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థ సుజుకీ మోటార్ 1000 సీసీ సామర్థ్యంతో రూ.15 లక్షల విలువైన ప్రీమియం బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

    నెక్సన్‌ను ప్రవేశపెట్టిన టాటామోటార్స్
    అమ్మకాలు లేక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్..కాన్సెప్ట్ కాంపాక్ట్ స్పోర్ట్స్ యూటిలిటీ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ‘నెక్సన్‌తోపాటు కనెక్ట్‌నెక్ట్’ పేర్లతో లభించే ఈ కొత్త కార్లతో మార్కెట్ వాటా పెరగడానికి దోహదపడుతుందని కంపెనీ ఆశిస్తున్నది. ఈ రెండింటితోపాటు కాంపాక్ట్ సెడాన్ జెస్ట్, హ్యచ్‌బ్యాక్ బోల్ట్ వాహనాలను కూడా ప్రదర్శించింది. కమర్షియల్ వాహన సెగ్మెంట్‌కు చెందిన మీడియం కమర్షియల్ వాహనాలైన సీఎక్స్ 1618టీ, అల్ట్రా 614, ఎల్‌పీఎస్ 4923 ఎల్‌ఏలను కూడా మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నది. ఈ కొత్త కార్లలో టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ, మాజీ చైర్మన్ రతన్ టాటా సందడి చేశారు.


    హీరో మోటో నుంచి 100 సీసీ బైక్
    ద్విచక్ర వాహనాల ఉత్పత్తలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్..ండు కొత్త బైక్‌లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి రెడీ అయింది. దీంట్లో 100 సీసీ సామర్థ్యం గల స్లెండర్ ప్రో క్లాసిక్, ప్యాషన్ టీఆర్ బైకులను వచ్చే నెల నుంచి దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పవన్ ముంజల్ తెలిపారు. ఈ బైక్‌లతోపాటు 620 సీసీ సామర్థ్యం గల సూపర్ ప్రీమియం మోటార్‌బైక్ ‘హస్టర్’, కాన్సెప్ట్ బైక్స్ ‘సింపిల్‌సిటీ’, ఇయాన్ బైక్‌లను కూడా ప్రదర్శించింది. 150 సీసీ సామర్థ్యంతో రూపొందించిన డీజిల్ బైక్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

    హార్లీ డేవిడ్సన్ నుంచి చవకైన బైక్
    ప్రీమియం బైకుల ఉత్పత్తి సంస్థ హార్లీ డేవిడ్సన్ దేశీయ మార్కెట్లోకి చవకైన బైక్‌ను విడుదలచేసింది. స్ట్రీట్ 750 పేరుతో లభించే ఈబైక్ ఢిల్లీ షోరూంలో రూ.4.11 లక్షలకు లభించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. యువతను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించడం జరిగిందని హార్లీ డేవిడ్సన్ ఇండియా ఎండీ అనూప్ ప్రకాశ్ తెలిపారు. ఈ కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు మార్చి 1 నుంచి బుకింగ్ చేసుకోవచ్చునని తెలిపింది. ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో 13 మోడళ్లు అందుబాటులో ఉండగా..స్ట్రీట్ 750 మిగత వాటికంటే తక్కువ ధర కలదు.

    రూ.1,100 కోట్లతో గుజరాత్‌లో ప్లాంట్: హెచ్‌ఎంఎస్‌ఐ
    గుజరాత్‌లో రూ.1,100 కోట్ల పెట్టుబడితో స్కూటర్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) ప్రకటించింది. ఇప్పటికే హర్యానా, రాజస్థాన్, కర్ణాటకలో మూడు ప్లాంట్లు ఉండగా..గుజరాత్‌లో ఏర్పాటుచేయబోయేది నాలుగొది కానున్నది. దేశవ్యాప్తంగా స్కూటర్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో రూ.1,100 కోట్ల పెట్టుబడితో ఏడాది 12 లక్షల యూనిట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈవో కైతా మరమత్సు తెలిపారు. 2016 కల్లా అందుబాటులోకి రానున్న ఈ ప్లాంట్లో మూడు వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నది.

    యమహా నుంచి సరికొత్త స్కూటర్
    జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థ యమహా..దేశీయ విపణిలోకి సరికొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ‘అల్ఫా’ పేరుతో లభించే ఈ స్కూటర్ ఢిల్లీ షోరూంలో రూ.49,518కి లభించనున్నది. కుటుంబ అవసరాలకోసం తయారు చేసిన ఈ స్కూటర్‌ను ఏడాదికి రెండు లక్షల యూనిట్లు విక్రయించాలనుకుంటున్నట్లు యమహా మోటార్ ప్రెసిడెంట్, సీఈవో హిరోయుకి యనగి తెలిపారు. 113 సీసీ ఇంజిన్‌తో రూపొందించిన ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు 62కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. భారత్‌లో స్కూటర్లకు డిమాండ్ అధికంగా ఉందని..2014లో దేశవ్యాప్తంగా 36 లక్షల వాహనాలు విక్రయించే అవకాశం ఉందన్నారు.

Wednesday, February 5, 2014

వాహన ప్రదర్శన నేటి నుంచే (5 ఫిబ్రవరి-2014)

(5 ఫిబ్రవరి-2014)
న్యూఢిల్లీ: భారత వాహన ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఆ పండుగకు తెరతీయనుంది. ఈ రంగం గత రెండేళ్లుగా డీలా పడ్డ సమయంలో తిరిగి గిరాకీని పెంచేందుకు.. కొనుగోలు దార్లను ఆకర్షించేందుకు ఇదో మంచి వేదికగా కంపెనీలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 11 వరకూ జరిగే ఈ ప్రదర్శనలో తొలి రెండు రోజులు మీడియా ప్రతినిధులకు కేటాయించారు. 7 నుంచి సాధారణ ప్రజలను అనుమతిస్తారు. అంతక్రితంలా కాకుండా ఈ సారి 12వ ఆటో ఎక్స్‌పో రెండు భాగాలుగా విడదీశారు. గ్రేటర్ నోయిడాలో వాహన ప్రదర్శనను; ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ప్రదర్శనను నిర్వహించనున్నారు.

మొత్తం మీద 70 కొత్త వాహనాలు ఈ ప్రదర్శనలో మెరవనున్నాయి. ఇందులో 26 అంతర్జాతీయ మోడళ్లు కావడం విశేషం. అంతక్రితం ప్రదర్శనలో నిర్వహణపై ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజాలు 'ఇది తమాషా కాదు' అన్న విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సారి నిర్వాహకులు మరింత పకడ్బందీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారన్న అంచనాలున్నాయి. భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), భారత వాహన విడిభాగాల తయారీ సంఘం(ఏసీఎమ్ఏ)లు నిర్వహణలో పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే.

తెలుగు తేజానికి మైక్రోసాఫ్ట్ పగ్గాలు

Courtesy : Eenadu

ఈ సంధి కాలంలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి ఎవరూ లేరు. ఇంజినీరింగ్ నైపుణ్యం, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను కలిసికట్టుగా ఉంచడం వంటి విషయాల్లో సత్య ఒక నాయకుడుగా నిరూపించుకున్నారు.

తదుపరి తరం ఉత్పత్తుల్లో వినూత్నత, వృద్ధిలోకి కంపెనీ అడుగుపెడుతున్న ఈ సమయంలో మైక్రోసాఫ్ట్‌కు ఏం కావాలో; సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాదెళ్లకు బాగా తెలుసు.
- బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు

సత్య నాదెళ్ల ఓ అద్భుతమైన నాయకుడు. వినూత్న సాంకేతిక నైపుణ్యం ఆయన సొంతం. వ్యాపార పోకడలను త్వరితంగా అర్థం చేసుకోగల శక్తిసంపన్నుడు. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో కనిపెట్టగలడు. వాటిని మైక్రోసాఫ్ట్ ఎలా అందిపుచ్చుకోవాలో నిర్ణయించగలడు. సత్య నాదెళ్లతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశా. సత్య నాదెళ్ల గొప్ప సీఈఓ అవుతారన్న నమ్మకం నాకుంది.
- స్టీవ్ బామర్, వైదొలగుతున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ 

న్యూయార్క్: వూహించినదే జరిగింది. ప్రపంచ అగ్రగామి సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన తెలుగు తేజం సత్య నాదెళ్ల నియమితులయ్యారు. 38 ఏళ్ల మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడుఈయనే కావడం గమనార్హం. స్టీవ్ బామర్ స్థానంలో 46 ఏళ్ల నాదెళ్ల నియామకంతో కొన్ని నెలలుగా షికారు చేస్తున్న వూహాగానాలకు తెరపడింది. ఒక అమెరికా కంపెనీలో.. అందునా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలో.. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత సీఈఓ పదవి చేపట్టిన వ్యక్తిగా సత్య నాదెళ్ల నిలిచారు. ఇది ఒక భారతీయుడికి లభించిన అరుదైన గౌరవం.
నాదెళ్లతో పాటు.. గూగుల్‌కు చెందిన సుందర్ పిచాయ్ కూడా మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి పోటీ పడ్డారు. క్రికెట్ అంటే బాగా ఇష్టపడే నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అంతక్రితం క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ గ్రూపునకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఛైర్మన్‌గా జాన్ థాంప్సన్ : ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న జాన్ థాంప్సన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్థానంలో ఛైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక బిల్‌గేట్స్ సాంకేతిక సలహాదారుగా కొత్త అవతారం ఎత్తనున్నారు. బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు.

మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు ఉద్యోగులకు సత్య నాదెళ్ల రాసిన లేఖ సారాంశం....... 

'ఈ రోజు నాకు చిరస్మరణీయం. 22 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టిన రోజు గుర్తుకొస్తోంది. పనిచేసే కంపెనీని ఎంచుకునే అవకాశం మీలాగే నాకూ లభించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా నమ్మి మైక్రోసాఫ్ట్‌లో అడుగుపెట్టా. ఆనాటి నుంచి కొత్త ఆలోచనలు, ఉత్పత్తులతో ప్రజల సామర్థ్యాలను పెంచుతున్న మైక్రోసాఫ్ట్‌ను చూస్తూనే ఉన్నా. అద్భుతాలు సృష్టించాలనుకుంటే.. పని చేయడానికి మైక్రోసాఫ్ట్‌కు మించిన కంపెనీ లేదని నాకు తెలుసు. ఇదే స్ఫూర్తి నన్ను ఈ రోజు వరకూ నడిపిస్తోంది. నాకు నమ్మలేని గౌరవం దక్కింది. ఇంత గొప్ప కంపెనీకి నాయకత్వం వహించి సేవ చేసే భాగ్యం కలిగింది. చిన్న ఆలోచన నుంచి ప్రపంచంలోనే అత్యంత గొప్ప, ఆరాధ్య కంపెనీ స్థాయికి మైక్రోసాఫ్ట్ ఎదగడానికి కారణమైన స్టీవ్, బిల్‌గేట్స్‌తో సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఇప్పుడు సీఈఓ బాధ్యతలు చేపట్టాను. కంపెనీకి అదనంగా సమయం కేటాయించమని, టెక్నాలజీ, ఉత్పత్తులపై దృష్టిపెట్టమని బిల్‌ను కోరాను. కంపెనీ కొత్త ఛైర్మన్ జాన్ థాంప్సన్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనం ఎన్నో విజయాలను సాధించాం. మరిన్ని విజయాల కోసం తహతహలాడుతున్నాం. పరిశ్రమకు, మైక్రోసాఫ్ట్‌కు ఇది కీలకమైన సమయం. మొబైల్, క్లౌడ్ రంగాల్లో మైక్రోసాఫ్ట్ దూసుకుపోయేలా చేయడం మనందరి ముందున్న కర్తవ్యం. ఈ తరుణంలో నా గురించి మీతో ఓ రెండు ముక్కలు చెప్పుకోవాలి. నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విషయాలను మీతో పంచుకోవాలి.

నా వయసు 46 ఏళ్లు. 22 ఏళ్ల క్రితం పెళ్త్లెంది. ముగ్గురు పిల్లలు. అందరి లాగే నా కుటుంబం, అనుభవాలే నన్ను తీర్చిదిద్దాయి. నా మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను పుస్తకాల పురుగంటారు. అయితే.. చదివిన పుస్తకాల కంటే కొన్నవే ఎక్కువ. ఆన్‌లైన్‌లో కొత్త కోర్సులకు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నా.. పూర్తి చేసింది తక్కువే. కొత్త విషయాలను తెలుసుకోలేకపోతే ఉపయోగపడే గొప్ప పనులు చేయలేమని నా నమ్మకం. మొత్తం మీద కుటుంబం.. జ్ఞానాన్ని సముపార్జించాలన్న తృష్ణ, ఉత్సుకతలే నన్ను మలిచాయి.

నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే..?

ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మైక్రోసాఫ్ట్‌లో ఎక్కువమంది ఎందుకు చేరుతున్నారో ఆ కారణం తెలుసుకోవాలి. ఆ కారణమే నేను ఈ కంపెనీలో చేరడానికి దారి తీసింది. అబ్బురపడే పనులు చేయగలగడానికి వీలుగా ప్రజలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, తద్వారా ఈ ప్రపంచంలో మార్పు తేవాలనే ఆశయంతోనే పలువురు మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు.. అయినప్పటికీ నిజం మాత్రం ఇదే. మనం దీన్ని చేసి చూపించాం. ఈవేళకీ చేస్తున్నాం.
రానున్న పది సంవత్సరాల్లో కంప్యూటింగ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని నా నమ్మకం. కొత్త రకాల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్రాణం పోసుకొని మనం చేస్తున్న అనేక పనులలోకి, వ్యాపారాల లోకి, జీవన శైలుల్లోకి, ఏకమొత్తంగా మనదైన ప్రపంచంలోకీ చొచ్చుకు వచ్చి డిజిటైజ్ చేసేస్తాయి. ఈ ప్రపంచం సాఫ్ట్‌వేర్ ఆలంబనగా నిలుస్తున్న ప్రపంచం.

మన కుటుంబాలతోనూ, స్నేహితులతోనూ ఉన్న అనుబంధాన్ని మరింత మెరుగ్గా మనం పెంచుకోవడానికీ, ఈ ప్రపంచాన్ని ఇదివరకెన్నడూ ఎరుగని పద్ధతుల్లో చూడడానికి, అనుభూతించడానికి, సన్నిహితంగా పంచుకోవడానికి ఉపయోగపడనుంది. ఒక బలమైన ప్రభావాన్ని కలగజేయడంలో సాటిలేని శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నందువల్లనే నేను ఇక్కడికి వచ్చాననుకుంటున్నా.

ఇక్కడ ఎందుకున్నాం?

ఇంతకు ముందు వరకు మన ధ్యేయమల్లా ప్రతి ఇంట్లోకీ ఒక పీసీని చేర్చాలనేది. దీన్ని మనం చాలావరకు సాధించగలిగాం. ఇవాళ మరింత విస్తృత శ్రేణి పరికరాలపై దృష్టి కేంద్రీకరించాం. నోకియాతో మన ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు కానీ.. ఆ కంపెనీ ఉపకరణాలను, సేవలను మన కుటుంబంలోకి ఆహ్వానిద్దాం. మొబైల్ ఫోన్లపరంగా వారు మనకు తెచ్చి ఇచ్చే శక్తియుక్తులను అందుకుందాం. ఈ ప్రపంచానికి మైక్రోసాఫ్ట్ తనవంతుగా అందించగల విశిష్ట సేవలేమిటన్నది మనం గుర్తించి తీరాలి. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఇది.

ఇక నుంచి ఏం చేద్దాం?

ఆస్కార్ వైల్డ్ అన్నట్లు 'మనకు అసాధ్యం అన్నది ఉండదన్న విషయాన్ని విశ్వసించాలి. అదే సమయంలో అనుమానాన్ని దరిదాపుల్లోకి కూడా రానీయకూడదు.'
అపుడే మనం చేయాల్సిన పనిపై ఒక స్పష్టత మొదలవుతుంది. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. వినూత్నతకు ప్రాధాన్యమివ్వాలి. మన వినియోగదార్లకు కావాల్సింది అదే. మనం అందించే ప్రతీ సేవ, వస్తువుల్లో మరింత వినూత్నతను కనబరచాలి.

ఇక, మనం మన అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శించాలి. మనలో ప్రతి ఒక్కరూ తమ పనికి అర్థాన్ని వెతుక్కోగలరని నేను గట్టిగా నమ్ముతున్నా. ప్రజల జీవితాన్ని మార్చేదేదో చేసినపుడే అది అత్యుత్తమ పని.చాలా వరకు కంపెనీలు ప్రపంచాన్ని మార్చివేయాలని భావిస్తుంటాయి. కానీ చాలా కొన్నిటి వద్దే అందుకు కావలసిన ముడిసరకులుంటాయి. అందులో ముఖ్యమైనవి: ప్రతిభ, వనరులు, నిరంతర శ్రమ. మైక్రోసాఫ్ట్‌కు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొత్త సీఈఓగా నేను మరింత గట్టి పునాదులుండాలని కోరుకోను. రండి.. ఈ పునాదిపైనే ఒక నవ లోకాన్ని నిర్మిద్దాం.

ముళ్ల బాటే!

మొబైల్ కంప్యూటింగ్ రంగంలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న మైక్రోసాఫ్ట్‌కు యాపిల్, గూగుల్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కంపెనీ 'మొబైల్' ఆశలను నెరవేర్చడంలో సత్య నాదెళ్ల ఎటువంటి వ్యూహాలను అమలు చేయనున్నారన్నదిఆసక్తి కరం.. సవాళ్లు పరిశీలిస్తే..
చి అంతర్జాలం (ఇంటర్నెట్) ఆధారిత, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో సత్యకు మంచి అనుభవమే ఉంది. కంపెనీకి నాయకత్వం వహించడానికి ఆయన తగిన వ్యక్తే. అయితే.. వినియోగదారులను మెప్పించడంలో.. వాటాదారులను సంతృప్తిపరచడంలో ఏ మేరకు విజయం సాధించగలరన్నది ప్రశ్న.

- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆయనకు అనుభవం ఉన్నా.. మొబైల్ సొల్యూషన్లపై పెద్ద అవగాహన లేదు. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

- వర్క్‌ప్లేస్ కంప్యూటింగ్‌లో కంపెనీకి ఇప్పటికీ తిరుగు లేకపోయినప్పటికీ.. అటు అమెరికాలోను, ఇటు విదేశాల్లోను క్రమక్రమంగా కంపెనీ వినియోగదారుల ఆదరణ కోల్పోతోంది.

- ఆండ్రాయిడ్ ఫోన్లు, యాపిల్ ఐపాడ్‌లను సవాలు చేయడానికి నోకియాను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. ఇది వాల్‌స్ట్రీట్‌ను అంతగా మెప్పించలేదు. హార్డ్‌వేర్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని కీలకమైన వాటాదారుల నుంచి ఒత్తిడి వస్తోంది.

- యూనిట్ అధిపతిగా సత్య నాదెళ్లకు అనుభవం ఉన్నా.. ఒక భారీ కంపెనీ ఎదుర్కొనే సవాళ్లను నేరుగా చవి చూడలేదు. ఇంత పెద్ద కంపెనీ లాభ, నష్టాల ఖాతాలపైనా ఆయనకు అనుభవం లేదు.

- పెద్ద పెద్ద కంపెనీల్లో వాటాదారుల విలువ పెరగడం నిధుల కేటాయింపుపైనే ఆధారపడి ఉంటుంది. కొత్త ఉత్పత్తుల వల్ల కాదు. వాటాదారుల విలువ పెంచడమే నాదెళ్లకు అసలైన సవాల్.

మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యాలయం: రెడ్‌మండ్, వాషింగ్టన్ 
ఏర్పాటు: 1975, ఏప్రిల్ 4, ఆల్బుకర్క్, న్యూమెక్సికో రాష్ట్రం 
వ్యాపార కార్యకలాపాలు: ఆసియా, ఐరోపా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలు దక్షిణ ఫసిఫిక్ 
ఉద్యోగుల సంఖ్య: సుమారు 1,00,932 (2013, డిసెంబరు నాటికి) 
ఆదాయం: 77.85 బిలియన్ డాలర్లు (2013లో)

బుక్కాపురం బిడ్డ.. 'ఐఏఎస్' యుగంధర్ కుమారుడు..

ఈనాడు, అనంతపురం; న్యూస్‌టుడే, తాడిపత్రి: సత్య నాదెళ్ల అలియాస్ నాదెళ్ల సత్యనారాయణ చౌదరి స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. లోగడ ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగాను, ప్రణాళికా సంఘం సభ్యుడిగాను, ఇతర హోదాల్లోను పనిచేసి, ప్రజాసంక్షేమం, పరిపాలనలో తనదైన ముద్ర వేసి జాతీయస్థాయిలో పేరుగాంచిన మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ కుమారుడే సత్య. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ అల్లుడు కూడా. యుగంధర్ చిన్నతనం నుంచే కష్టపడి చదివారు. ఐఏఎస్‌కు ఎంపికై, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కుమారుడు సత్యను బాగా చదివించారు. పలు సందర్భాల్లో తండ్రి యుగంధర్‌తో కలిసి సత్య బుక్కాపురం సందర్శించారు. తమ ఇల్లు, పంట పొలాలు చూశారు. బంధువులను కలిసి ఆత్మీయంగా పలకరించారు. యుగంధర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. వూరిలోని చెన్నకేశవస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, గ్రామంలో సీసీ రోడ్లు, ఎస్సీలకు పక్కా ఇళ్ల నిర్మాణం- ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ప్రధాన భూమిక పోషించారు. 'ఈనాడు-ఈటీవీ' బృందం మంగళవారం బుక్కాపురాన్ని సందర్శించి, సత్య బంధువులు, కుటుంబీకులతో ముచ్చటించింది. ఆయన అత్యున్నత స్థాయికి ఎదగడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. ఆ తండ్రీ కొడుకులు గ్రామానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చారని ప్రశంసించారు.
పంట పొలాలు చూసి సంతోషించాడు: సర్పంచ్

''సత్య తండ్రి, మా తండ్రి చిన్నాన్న పెదనాన్న పిల్లలు. సత్య మైక్రోసాఫ్ట్ సీఈవో కావడం చెప్పలేని ఆనందాన్నిస్తోంది. సత్య బీటెక్‌లో చేరే ముందు తండ్రితో కలిసి గ్రామానికి వచ్చాడు. పంట పొలాలు చూసి సంతోషపడ్డాడు. గ్రామస్థులందరిని ఆప్యాయంగా పలకరించాడు. ఇప్పటికీ వారికి ఇక్కడ పదెకరాల పొలం ఉంది'' అని బుక్కాపురం సర్పంచ్ భీమశంకర్ తెలిపారు.

Friday, January 31, 2014

మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువ్యక్తి నాదెళ్ల సత్య?


వాషింగ్టన్ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి: అతిపెద్ద సాఫ్ట్‌వేర్ నిర్మాణసంస్థ, ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ ఛైర్మన్‌గా ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థకు తదుపరి సీఈవోగా తెలుగువాడైన నాదెళ్ల సత్యను ప్రకటించే అవకాశం ఉన్నట్లు అమెరికాలోని పలు వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. మైక్రోసాఫ్ట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆయన నియామకంపై తుది నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. అధికారిక నియామకానికి సంబంధించిన తుది ప్రకటన అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం వెలువరించే అవకాశం ఉంది. సత్య నాదెళ్ల నియామక ఉత్తర్వులు వెలువడిన వెంటనే ప్రస్తుత సీఈవో స్టీవ్‌బామర్ రాజీనామా చేయనున్నారు. అయినప్పటికీ ఆయనకు మైక్రోసాఫ్ట్‌లో 4శాతం వాటా ఉంటుంది. నాదెళ్ల సత్య 2013 ఏడాదికి సుమారు రూ.48కోట్ల రూపాయల వేతనం అందుకున్నారు. ఇందులో జీతభత్యాల కింద 670డాలర్లు, బోనస్‌గా 1.5 మిలియన్ డాలర్లు, మరో 5.4 మిలియన్ డాలర్లు స్టాకుల రూపంలో ఆయనకు లభించాయి. దీంతో పాటు సుమారు రూ.90కోట్ల(15.4మిలియన్ డాలర్లు) విలువ కలిగిన 450వేల మైక్రోసాఫ్ట్ షేర్లను నాదెళ్ల సత్య కలిగి ఉన్నారు. 1992 నుంచి మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న సత్య, ప్రస్తుతం సంస్థ కోడ్, ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవోగా సత్య నియామకం కానున్నారని తెలుసుకున్న పలువురు ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసిన సమయానికి మైక్రోసాఫ్ట్ షేరు ధర 1శాతం పెరిగి 37.20 డాలర్ల వద్ద స్థిరపడింది. నాదెళ్ల సత్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

మళ్లీ కార్ల పండుగ -2014 Delhi Auto Show

6 నుంచి భారత్‌లో ఆటో షో
70 కొత్త వాహనాలను విడుదల చేయనున్న ఆటోమొబైల్ దిగ్గజాలు...
 మందగమనం నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశ్రమ ఆశాభావం


 న్యూఢిల్లీ: వాహన అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో భారత్‌లో అతి పెద్ద వాహన పండుగ ఆటో షో వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే నెల 6-12 తేదీల్లో జరిగే ఈ 12వ ఆటోషోలో వివిధ కంపెనీలు దాదాపు 70  కొత్త వాహనాలను ఆవిష్కరిస్తాయని, దీంతో మందగమనంలో ఉన్న వాహన మార్కెట్‌కు ఊపువస్తుందని వాహన పరిశ్రమ ఆశిస్తోంది. స్థలాభావం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం తదితర కారణాల వల్ల ఈ ఆటో షో రెండు చోట్ల జరుగుతుంది. గ్రేటర్ నోయిడాలో వాహనాల ప్రదర్శన,  ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ఎగ్జిబిషన్ జరుగుతాయి.  భవిష్యత్తులో ఒకే చోట ఆటో షో జరిగేలా ప్రభుత్వం చూడాలని  సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ కోరారు.  వినియోగదారులు వాహనాల కొనుగోళ్ల విషయమై డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నారని  చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం తదితర అంశాలు వారిని వెనక్కు లాగుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో అమ్మకాలు పుంజుకోవడానికి ఈ ఆటో షో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 కొత్త కార్ల సందడి... ఎస్‌యూవీల హల్‌చల్..
     ఈ ఆటోషోలో వివిధ వాహన కంపెనీలు 70 వరకూ కొత్త వాహనాలను ఆవిష్కరించే అవకాశాలున్నాయి. వీటిల్లో 26 వరకూ అంతర్జాతీయ మోడళ్లు ఉంటాయని(15 గ్లోబల్ కార్లు) అంచనా.
     దేశీ కార్ల దిగ్గజం మారుతీ.. ‘సెలెరియో’ను ఆవిష్కరించనుంది. ఆటోమాటిక్ గేర్ సిస్టమ్ దీని ప్రత్యేకత.
     కొత్త సెడాన్‌ను, దీంతో పాటు కొన్ని కాన్సెప్ట్ మోడళ్లను కూడా మారుతీ డిస్‌ప్లే చేయవచ్చు.
     హ్యుందాయ్ కంపెనీ మిడ్ సైజ్ ఐ10 గ్రాండ్‌ను డిస్‌ప్లే చేయనున్నది. కొత్త శాంటా ఫే ఎస్‌యూవీతో పాటు రెండు కాన్సెప్ట్ కార్లను కూడా ఈ కంపెనీ డిస్‌ప్లే  చేయనున్నది.

     నిస్సాన్ కంపెనీ డాట్సన్  గో చిన్న కారును,  గో ప్లస్ మల్టీ యుటిలిటి వెహికల్‌ను ప్రదర్శించనుంది
     ఫోక్స్‌వ్యాగన్ తైగన్, జనరల్ మోటార్స్ ఆడ్రా కాన్సెప్ట్. ఫియట్ కంపెనీ కొత్త ఎస్‌యూవీ, డస్టర్‌లో అప్‌గ్రేడ్ చేసిన ఎస్‌యూవీని రెనో కంపెనీలు. డిస్‌ప్లే చేయనున్నాయి.

     టాటా మోటార్స్ కూడా కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శనకు ఉంచుతోంది.
     మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌లో హైబ్రిడ్ వెర్షన్‌ను, క్వాంటోలో ఆటో-గేర్ వేరియంట్‌ను తెస్తోంది.
     హోండా కంపెనీ జాజ్ హ్యాచ్‌బాక్‌ను, మొబిలియో ఎంపీవీని డిస్‌ప్లే చేయనున్నది.
     ఇక లగ్జరీ కార్ల విషయానికొస్తే, మెర్సిడెస్ బెంజ్ కంపెనీ సీఎల్‌ఏ సెడాన్‌లో ఏఎంజీ వెర్షన్‌ను, జీఎల్‌ఏ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాన్సెప్ట్ మోడల్‌ను, ఎఫ్1 పోడియమ్ కారును డిస్‌ప్లే చేయనున్నది.

     ఆడి కంపెనీ ఆడి ఏ3 సెడాన్‌ను, ఆర్‌ఎస్ 7 స్పోర్ట్స్ కారును ఆవిష్కరించనుంది. బీఎండబ్ల్యూ ఐ కాన్సెప్ట్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచనున్నాయి.
     ఇక టూ వీలర్ల విషయానికొస్తే, హార్లే డేవిడ్సన్ కంపెనీ స్ట్రీట్ 750 బైక్‌ను ఈ ఆటో షోలోనే ఆవిష్కరించనున్నది. హీరో మోటో కార్ప్ కంపెనీ కొత్త మోడళ్లను, కాన్సెప్ట్ టూవీలర్లను డిస్‌ప్లే చేయనున్నది.

 రెండేళ్లకోసారి జరిగే ఈ ఆటో షో 12వది

 ఎప్పుడు: వచ్చే నెల 6-12 తేదీల్లో(5న మీడియా కోసం ప్రత్యేకంగా అనుమతించనున్నారు).
 ఎక్కడ: గ్రేటర్ నోయిడాలో  వాహనాల ప్రదర్శన, ప్రగతి మైదాన్‌లో వాహన విడిభాగాల ఎగ్జిబిషన్.
 వేదిక ఎందుకు మారింది?: గతంలో ఈ ఆటో షో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగేది. ఈ ఆటో షో జరిగినన్ని రోజులు జనం పోటెత్తడంతో ఢిల్లీ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌లతో అల్లాడి పోయాయి. దీనిని నివారించడానికి ఈ ఏడాది ఆటో షోను రెండు చోట్ల నిర్వహిస్తున్నారు.
 ఎన్ని కంపెనీలు:  గ్రేటర్ నోయిడా షోలో 55 వాహన తయారీ కంపెనీలు, ఢిల్లీ ప్రగతి మైదాన్ షోకు కనీసం 1,100 విడిభాగాల తయారీ సంస్థలు పాల్గొంటున్నాయి.

 సందర్శకుల సంఖ్య: 2012లో జరిగిన 11వ ఆటో షోకు 7 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఈ ఏడాది ఆటో షోకు 5.40 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశాలున్నాయి. గ్రేటర్ నోయిడాలో జరిగే ఆటో షోకు రోజుకు లక్ష మంది, ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే వాహన విడిభాగాల ప్రదర్శనకు రోజుకు దాదాపు 10 వేల మంది సందర్శకులు రావచ్చని అంచనా.
 టికెట్లు: రూ.500(బిజినెస్ అవర్స్ ఉ.10-మ.1.00) రూ.200 (జనరల్ అవర్స్)
 ఎవరు నిర్వహిస్తున్నారు: సియామ్(సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ), సీఐఐలు సంయుక్తంగా నిర్వహిస్తాయి.
 ఎవరు పాల్గొంటున్నారు?: మారుతీ, హ్యుందాయ్, హోండా వంటి చిన్నా కార్ల కంపెనీలే కాకుండా, ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్ల కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి.
 ఎన్ని కొత్త మోడళ్లొస్తాయి:70 వరకూ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తాయని అంచనా.

Monday, December 16, 2013

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రతి కోసం క్లిక్ చేయడి.

‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü X¾ÛÊ-ªý-«u-«-®Ôn-¹-ª½º G©Õx “X¾A Â¢ ÂËxÂú Í䧌բœË