అధ్యయనానికి వెళ్లొచ్చిన అధికార్ల బృందం
వచ్చే వేసవి నుంచి అమలు!
రాష్ట్రంలో ప్రస్తుతం వారంలో రెండు రోజుల విద్యుత్ సెలవు అమలవుతోంది. పరిశ్రమలు జనరేటర్లపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా యూనిట్‌కు రూ.14పైగా భారం పడుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర అవసరాల కోసం ఏపీట్రాన్స్‌కో కొనుగోలు చేస్తోన్న కరెంటు యూనిట్ రూ.8 చొప్పున పడుతోంది. ఈ లెక్కన ట్రాన్స్‌కో కరెంటు కొనుగోలు చేస్తున్న ధరను చెల్లించడమే మేలనే భావనకు పారిశ్రామిక వర్గాలు వచ్చాయి. ప్రస్తుత సీజన్‌లోనే కొన్ని పరిశ్రమలు ఇలా కొనుగోలుచేసిన కరెంటు ఇస్తే ఖర్చు భరించడానికి ముందుకొచ్చినా అమలుకాలేదు. తమిళనాడులో యూనిట్ రూ.7 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం కొనుగోలు ధర ఎంతయితే అంతే మొత్తాన్ని ఛార్జీగా విధించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని, కొనుగోలు సీజన్‌కు ముందే టెండర్లు పిలిస్తే యూనిట్ రూ.2 నుంచి రూ.4కే కరెంటు దొరికే అవకాశాలున్నాయని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు. గత డిసెంబరులో ట్రాన్స్‌కో టెండర్లు పిలిచిన సమయంలో యూనిట్ రూ.2.50 చొప్పున ఇవ్వడానికి కొందరు కరెంటు వ్యాపారులు ముందుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ విధానంలో జనవరి నుంచి మే వరకు కరెంటు ఇచ్చే అవకాశాలున్నాయి. అది కూడా ప్రత్యేక ఫీడర్లు ఉన్న పెద్ద పరిశ్రమలకు మాత్రమే ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఈ తరహాలో కరెంటు సరఫరా చేయడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి తీసుకోవాలి. ఈ కసరత్తు అంతా పూర్తయితే వచ్చే సీజన్ నుంచి ఈ కొత్త విధానం అమలు చేస్తారు.