Friday, March 19, 2010

వ్యవసాయం

కీబోర్డ్‌నే నాగలిగా చేసి... మౌస్‌ను మేడిలా పట్టి... వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? దుక్కిదున్ని... నాట్లు వేయాలనుందా? ఆవుల్ని... గొర్రెల్ని పెంచాలనుందా? అయితే, మీ కోసం వర్చువల్‌ పొలం సిద్ధం! రైతులా తలపాగా చుట్టి వ్యవసాయం చేసేయండి!
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ తెలిసిందే... వీడియో గేములూ ఎరిగినవే... ఇప్పుడు ఈ రెండూ కలిసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న 'సోషల్‌ గేమ్‌'గా మారాయి.

- ఈ సరికొత్త ఆటను రోజుకు 110 లక్షల మంది ఆడుతున్నారు!

- నేటికి 8.3 కోట్ల మంది ఆటలో భాగస్వాములై ఉన్నారు!

ఇంతకీ ఈ ఆటగాళ్లంతా ఏం చేస్తారో తెలుసా? భూమి దున్నుతారు. విత్తనాలు జల్లుతారు. రకరకాల పంటలు పండిస్తారు. పండ్ల తోటలు వేస్తారు. ఇంతేనా? కోళ్లు, పందులు, గొర్రెలు, పశువులు కూడా పెంచుతారు. ఓ అచ్చమైన రైతులా ఖర్చులూ భరిస్తారు. ఫలసాయాన్ని అమ్ముకుని డబ్బులూ ఆర్జిస్తారు. అంతా ఆన్‌లైన్లోనే! అంతా వర్చువల్‌ ప్రపంచంలోనే! కోట్లాది మందిని ఆకర్షిస్తున్న ఆ ఆట పేరేంటో తెలుసా? ఫార్మ్‌విల్లే. ఎలాంటి సైట్స్‌లోకి వెళ్లకుండానే, సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోకుండానే దీన్ని ఆడుకోవచ్చు. దీన్ని అమెరికాకు చెందిన Zynga గేమ్‌ డెవలపర్‌ కంపెనీ రూపొందించింది. ఫేస్‌బుక్‌ యూజర్లు, మైక్రోసాఫ్ట్‌ ఎమ్మెసెన్‌ గేమ్స్‌ పోర్టల్స్‌ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఫేస్‌బుక్‌ యూజర్లలో 20 శాతం మంది ఈ ఆట ద్వారా రైతులైపోయారు. మన దేశంలో కూడా 10 లక్షల మంది 'ఈ-వ్యవసాయం' చేస్తున్నారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీ స్నేహితులు తీర్చి దిద్దుకున్న పంటపొలాల్ని కూడా మీరు సందర్శించవచ్చు. మీ పొలాన్ని విస్తరించుకుని అందులోనే ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఎస్టేటు సరిహద్దుల్ని జెండాలు పాతి మరీ నిర్ణయించుకోవచ్చు.

'పట్టా' భూమి
నిజ జీవితంలో సెంటు భూమి కూడా లేదని చింతించక్కర్లేదు. ఫార్మ్‌ విల్లేలో సైన్‌ఇన్‌ అవ్వగానే ఆరు ప్లాట్ల పొలం పంటతో పాటు సిద్ధంగా ఉంటుంది. మీ రైతు అవతార్‌ని సృష్టించుకుని వ్యవసాయం చేయడమే తరువాయి. ఫేస్‌బుక్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ను వాడుతున్నట్లయితే ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు చేసుకోనక్కర్లేదు. సైట్‌లోకి వెళ్లి Play Now Connect with Facebookపై క్లిక్‌ చేసి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో సైన్‌ఇన్‌ అయితే చాలు. మీ అవతార్‌ని నచ్చినట్టుగా మార్చుకోవాలనుకుంటే పాయింటర్‌తో సెలెక్ట్‌ చేసి Create A New Farmerలోకి వెళ్లండి. శరీరం రంగు, ముఖం, తల, కళ్లు, ముక్కు, నోరు, మీసాలతో అవతార్‌ను క్రియేట్‌ చేశాక సేవ్‌ చేయండి. దీంతో మీరు, మీ పొలం సిద్ధం అన్నమాట!

సాగు చేయండిలా..!
వరి పొలంలో మడుల మాదిరిగా మీ పొలం ఆరు ముక్కలుగా ఉంటుంది. కొత్తగా సైన్‌ఇన్‌ అయినవారికి మూడు ప్లాట్‌ల పంట కోతకొచ్చి ఉంటుంది. ఇక మీరు అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే! కొత్త పంట వేయాలంటే పొలాన్ని దున్నాలి, విత్తనాలు నాటాలి, పంట చేతికొచ్చేవరకూ పొలాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. నిజ జీవితంలోలాగా పంట చేతికి రావడానికి నెలల కాలం పడుతుందనుకోకండి. ఈ హైటెక్‌ పంటలు గంటలు, రోజుల్లోనే పండేస్తాయి. పంట అమ్ముకోగా వచ్చిన డబ్బు, ఆడుతున్న గేమ్‌ లెవల్‌... లాంటి ఇతర వివరాలు ఫార్మ్‌ విల్లే పై భాగంలో కనిపిస్తాయి. ఇక సాగు చేయడానికి కావాల్సిన పలుగు, పారల్లాంటి పరికరాలతో టూల్‌బార్‌ ఉంటుంది. మీ అవతార్‌ని నడిపించడానికి, పంటను సెలెక్ట్‌ చేయాడానికి Multi Toolను వాడాలి. భూమిని సాగు చేయడానికి, కొత్తగా మరిన్ని ప్లాట్‌లను కొనుక్కోవడానికి Plow Toolను ఎంచుకోవాలి. ఒక్కో ప్లాట్‌ ఖరీదు 15 కాయిన్లు. మాగ్నిఫైయర్‌ టూల్స్‌తో పొలాన్ని జూమ్‌ ఇన్‌, జూమ్‌ అవుట్‌ చేసుకోవచ్చు. ఫార్మ్‌ని తెర మొత్తం చూడాలనుకుంటే ఫుల్‌స్క్రీన్‌వ్యూని ఎంచుకోవచ్చు. మీ ఫొలాన్ని ఫొటో తీసుకుని స్నేహితులతో పంచుకోవాలంటే ఫొటో ఫీచర్‌ను క్లిక్‌ చేయండి.

పె....ద్ద మార్కెట్‌
ఫార్మ్‌ విల్లే మార్కెట్‌లో విత్తనాల నుంచి వాహనాల వరకూ అన్నింటినీ కొనుగోలు చేసి మీ పొలంలో పెట్టుకోవచ్చు. అందమైన ఇంటిని కొనుగోలు చేసి పొలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసం టూల్‌బార్‌లోని Buy Items క్లిక్‌ చేయండి. విత్తనాల్ని కొనాలనుకుంటే థంబ్‌నెయిల్‌ బాక్స్‌ల్లో రేటు, పంట పూర్తవ్వడానికి పట్టే సమయం, అమ్మకపు ధర వివరాల్ని చూడొచ్చు. గోధుమ పంట వేద్దామనుకుంటే... విత్తనాల రేటు 10 కాయిన్స్‌, అమ్మకం రేటు 35 కాయిన్స్‌, పంట పూర్తవ్వడానికి పట్టే సమయం మూడు రోజులు. Decorationsలోకి వెళ్లి అదనపు హంగుల్ని ఏర్పాటు చేయవచ్చు. పొలం చుట్టూ ఫెన్సింగ్‌తో పాటు చెట్లను నాటొచ్చు. ఎద్దుల్ని, ఎడ్ల బండిని కొనుక్కోవచ్చు. పొలం మధ్యలో అందమైన కొలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పొలానికి కాపలాగా పాలేర్లను పెట్టుకోవచ్చు. మీ వ్యవసాయ భూమి, ఆదాయం పెరిగేకొద్దీ గేమ్‌ లెవల్స్‌ మారుతుంటాయి.

'కాడిగట్టు'లో స్నేహితులు
స్నేహితుల్ని కూడా ఫార్మ్‌ విల్లేలోకి ఆహ్వానించవచ్చు. తెరకు కింది భాగంలో ఉన్న Add Neighbourపై క్లిక్‌ చేసి మీ కాడిగట్టు రైతుగా వారికి ఆహ్వానం పలకొచ్చు. నైబర్స్‌లో ఐకాన్స్‌లో ఉన్న స్నేహితుల థంబ్‌నెయిల్స్‌పై క్లిక్‌ చేసి Visit/Help... ద్వారా వారి పొలాన్ని మీరూ సందర్శించవచ్చు. ఒకరికొకరు సాయపడొచ్చు. టూల్‌బార్‌లోని Giftsపై క్లిక్‌ చేసి స్నేహితులు మీకు పంపిన బహుమతుల్ని చూడొచ్చు. వాటిని మీ పొలంలో అలంకరించుకోవచ్చు. మీరు కూడా ఇతరులకు బహుమతుల్ని పంపాలనుకుంటే తెరకు పైభాగంలోని గిఫ్ట్‌బాక్స్‌పై క్లిక్‌ చేసి పంపొచ్చు. మరిన్ని వివరాలకు www.farmville.com చూడండి.

మరిన్ని గేమ్‌లు
ఫార్మ్‌ విల్లేతో పాటు మరిన్ని గేమ్స్‌ని ఆడాలనుకుంటే, సైట్‌లో ఎడమవైపు ఉన్న Zynga Games జాబితాలోని వాటిని ఆడుకొవచ్చు. FishVilleలో చేపల పెంపకం చేపట్టవచ్చు. Cafe Worldలో అవతార్‌ని సృష్టించుకుని సొంతంగా కేఫ్‌ని ఓపెన్‌ చేసి వ్యాపారం చేయవచ్చు. YoVille, Mafia Wars, Roller Coaster, Zynga Poker, PetVille... లాంటి మరిన్ని గేమ్‌లు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి.

విండోస్‌లైవ్‌లో కూడా
మైక్రోసాఫ్ట్‌ అందుబాటులోకి తెచ్చిన 'ఎంఎస్‌ఎన్‌ గేమ్స్‌ జోన్‌'లో కూడా ఫార్మ్‌ విల్లేని యాక్సెస్‌ చేయవచ్చు. అందుకోసం http://zone.msn. com/en/farmville/farmville.aspx లింక్‌ను చూడండి.