సౌరవిద్యుత్తు రసాయనాల తయారీలోకి ఎన్‌ఎఫ్‌సీఎల్
జర్మనీలో సంయుక్త కంపెనీ ఏర్పాటు హైదరాబాద్, న్యూస్‌టుడే: సౌర విద్యుత్తు, సెమీ కండక్టర్ అప్లికేషన్లకు అవసరమైన రసాయనాల తయారీని నాగార్జునా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌సీఎల్) చేపట్టనుంది. ఇందుకోసం జర్మనీలో ఒక సంయుక్త కంపెనీని, దానికి పెట్టుబడి సమకూర్చడం కోసం మారిషస్‌లో మరో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. ఈ వినూత్న రసాయనాలను తయారుచేసే వారితోనే ఎన్‌ఎఫ్‌సీఎల్ ఒక ఒప్పందానికి వచ్చి, వారితో కలిసి జర్మనీలో నాగార్జునా స్పాంట్ జీఎంబీహెచ్, జర్మనీ అనే కంపెనీని నెలకొల్పుతోంది. దీన్లో ఎన్‌ఎఫ్‌సీఎల్‌కు 50 శాతం వాటా ఉంటుంది. అందులో 5 మిలియన్ యూరోలు తన వంతుగా ఎన్‌ఎఫ్‌సీఎల్ పెట్టుబడి పెట్టాల్సి ఉంది. మారిషస్‌లో నెలకొల్పే అనుబంధ కంపెనీ అయిన నాగార్జునా మారిషస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా ఈ పెట్టుబడి పెడతారు. ఈ నెల 15న ఎన్‌ఎఫ్‌సీఎల్ వాటాదార్ల అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రతిపాదనలకు వాటాదార్ల నుంచి అనుమతి తీసుకుంది. నాగార్జునా మారిషస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అందించాల్సిన 5 మిలియన్ యూరోలను అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చుకుంటున్నట్లు ఎన్‌ఎఫ్‌సీఎల్ వెల్లడించింది. సౌర విద్యుత్తు, సెమీ కండక్టర్ అప్లికేషన్లలో వినియోగించే రసాయనాలకు డిమాండ్ ఎంతో వేగంగా పెరుగుతోందని, ఈ విభాగంలో ప్రవేశించడం ద్వారా నూతన వ్యాపారావకాశాలను అందిపుచ్చుకున్నట్లు అవుతోందని కంపెనీ అభిప్రాయపడుతోంది.