రెయిన్ కమోడిటీస్ పునర్ వ్యవస్థీకరణ
అమ్మకం కోసమేనా..?
హైదరాబాద్ - న్యూస్‌టుడే
సిమెంటు, కాల్సినైడ్ పెట్రోలియం కోక్ (సీపీసీ) వ్యాపారంలో ఉన్న రెయిన్ కమోడిటీస్ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణను చేపట్టింది. ఇందులో భాగంగా సిమెంటు వ్యాపారాన్ని విడదీసి దాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనుంది. సిమెంటు వ్యాపారంలోకి సహ భాగస్వామిని తీసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నట్లుగా కంపెనీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, మంచి విలువ వచ్చిన పక్షంలో దీన్ని విక్రయించే ఆలోచన సైతం యాజయాన్యానికి ఉన్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం సిమెంటు వ్యాపారం విడిగానే ఉండేది. ప్రియదర్శిని సిమెంట్స్ పేరుతో ఉన్న సిమెంటు కంపెనీ, ప్రియా బ్రాండుతో సిమెంటు విక్రయించేది. ఇప్పటికీ సిమెంటు బ్రాండు అదే అయినప్పటికీ, అప్పట్లో వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా రెయిన్ కమోడిటీస్‌లో విలీనం చేశారు. రెండు కంపెనీలు ఒకే యాజమాన్యానికి చెందినవి కావడంతో విలీనం ద్వారా వ్యయాలు తగ్గడమే కాకుండా, ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో అప్పట్లో దీనికి సిద్ధపడ్డారు. ఆ తర్వాత అటు సీపీసీ వ్యాపారం, ఇటు సిమెంటు వ్యాపారం వేగంగా విస్తరించాయి. సిమెంటు విభాగంలో సామర్థ్యాన్ని కూడా విస్తరించారు. కర్నూలులో ఉన్న యూనిట్లో సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. సిమెంటు ధర అధికంగా ఉన్న నేపథ్యంలో కంపెనీకి ఆదాయాలు కూడా అధికమయ్యాయి. దీంతో సిమెంటు వ్యాపారాన్ని విడదీసి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ హోల్డింగ్ కంపెనీ: ఇదే కాకుండా కాల్సినైడ్ పెట్రోలియం కోక్ (సీపీసీ) వ్యాపార కార్యకలాపాలకు అమెరికా కేంద్రంగా ఒక గ్లోబల్ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలని కూడా రెయిన్ కమోడిటీస్ యాజమాన్యం ప్రతిపాదించింది. ఈ విభాగంలో భవిష్యత్తు అవసరాలకు నిధులు సమీకరించడానికి అనువుగా ఈ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటవుతోంది. అంతేగాక అప్పు తీర్చడానికి కూడా ఈ ఏర్పాటు వీలు కల్పిస్తోంది. నిధుల సమీకరణ నిమిత్తం ఈ హోల్డింగ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
మెరుగైన ఫలితాలు.. వాటాదార్లకు డివిడెండ్ కేలండర్ ఏడాది ప్రకారం ఆర్థిక ఫలితాలు ప్రకటించే రెయిన్ కమోడిటీస్ 2009 సంవత్సరానికి ఆదాయంలో 18 శాతం క్షీణతను నమోదు చేసింది. కానీ లాభాలు మాత్రం 10 శాతం పెరిగాయి. రూ.3,633 కోట్ల వార్షిక ఆదాయంపై రూ.443 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జించింది. అంతకు ముందు ఏడాదిలో ఆదాయం రూ.4,454 కోట్లు, నికరలాభం రూ.403 కోట్లు ఉన్నాయి. ఈపీఎస్ 2009లో 9 శాతం పెరిగి రూ. 62.66 నమోదైంది. స్థూల అప్పు 2008 సంవత్సరాంతానికి ఉన్న రూ. 3,769 కోట్ల నుంచి గణనీయంగా తగ్గి రూ.3,031 కోట్లకు పరిమితం అయినట్లు కంపెనీ తెలిపింది. ఇదేకాలంలో నికర అప్పు రూ.3,533 కోట్ల నుంచి రూ.2,696 కోట్లకు తగ్గింది. వాటాదార్లకు 37 శాతం డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కల ఒక్కో షేర్‌కు రూ. 3.70 చొప్పున డివిడెండ్ లభిస్తుంది.