మూడేళ్లలో రెట్టింపు
చందాదారులపై టాటా స్కై ఆశాభావం
'ఇంటరాక్టివ్' సేవలతో ఆకర్షిస్తాం
త్వరలో తెలుగు పాఠాలు
'న్యూస్‌టుడే'తో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మెహ్రా
హైదరాబాద్, న్యూస్‌టుడే: మూడేళ్లలో చందాదారుల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సేవలందిస్తున్న టాటా స్కై లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీకి 45 లక్షల మంది చందాదారులు ఉన్నారని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ విక్రమ్ మెహ్రా 'న్యూస్‌టుడే'కు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన టెలివిజన్‌ను కొనుగోలు చేసినా టెలివిజన్ ప్రసారాలు సరిగ్గా లేకపోతే స్పష్టమైన బొమ్మ కనిపించదు. ఇదే విషయాన్ని వినియోగదారులు గ్రహిస్తున్నారు. కేబుల్ నుంచి డీటీహెచ్ ప్రసారాలకు బదిలీ అవుతున్నారు. టెలివిజన్ ప్రసారాలేకాక ఇంటరాక్టివ్ సేవలు చందాదారులను ఆకర్షిస్తున్నాయి. భవిష్యత్తులో మొబైల్ ఫోన్ చందాదారుల తరహాలో డీటీహెచ్ చందాదారులు పెరుగుతారు. మూడేళ్లలో ప్రస్తుతమున్న 2.1 కోట్ల మంది చందాదారులు నాలుగు కోట్లను మించే వీలుంది. డీటీహెచ్ వీక్షకుల్లో చాలా మంది సాధారణ టెలివిజన్ ప్రసారాల కన్నా ఇంటరాక్టివ్ సేవల (విలువ ఆధారిత సేవలు)నే ఎక్కువగా వీక్షిస్తున్నారు. టాటా స్కై భవిష్యత్తులో ఈ సేవలపైనే ఎక్కువ దృష్టి సారించి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇటువంటి సేవలను అందించడంలో మిగిలిన కంపెనీల కంటే మేం ముందున్నాం. 'యాక్టివ్ ఇంగ్లిష్' పేరుతో గృహిణులు మొదలైన వారికి ఆంగ్లం నేర్చుకునే సేవలు అందిస్తున్నాం. ఇదే తరహాలో ప్రాంతీయ భాషల్లో ముందుగా తెలుగును నేర్పే సేవలను ప్రారంభించనున్నాం. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కీలకమైనందునే ప్రాంతీయ భాషల్లో ముందుగా తెలుగును ప్రారంభిస్తున్నాం. దేశ వ్యాప్తంగా టాటా స్కైకి మూడు ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఉంటే అందులో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. టాటా స్కైల ఇతర కంపెనీలు ఇప్పటి వరకు 'పర్సనల్ వీడియో రికార్డర్' సౌకర్యాన్ని కల్పించడం లేదు. డీటీహెచ్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ ప్రసారాల కన్నా మరింత మెరుగైన హై డెఫినేషనల్ టెలివిజన్ ప్రసారాలను త్వరలో ప్రారంభించనున్నాం. మొబైల్ ఫోన్ల తరహాలోనే ఒక్కో చందాదారుల నుంచి నెలకు సగటున లభించే ఆదాయం డీటీహెచ్ కంపెనీలకు కీలకం. ఇతర కంపెనీలతో పోలిస్తే టాటా స్కై నెలవారీ సగటు ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. అయితే.. ఈ వివరాలను మాత్రం వెల్లడించలేనని మెహ్రా అన్నారు.