Monday, March 15, 2010

ఏయూతో మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రఖ్యాత ఐటీ కంపెనీమైక్రోసాఫ్ట్‌తో శుక్రవారం కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. దీన్ని 'డ్రీమ్‌ స్పార్క్‌' ఎంఓయూగా వ్యవహరిస్తున్నారు. యువ మెదళ్లలో ఉత్తేజం రగిలించి వారి కలల్ని సాకారం చేసేందుకు దోహదం చేస్తుంది కాబట్టి ఈ ఎంఓయూకి డ్రీమ్‌ స్పార్క్‌గా పేరు పెట్టినట్టు ఏయూ, మైక్రోసాఫ్ట్‌ అధికారులు పేర్కొన్నారు. ఏయూ వీసీ బీల సత్యనారాయణ సమక్షంలో రిజిస్ట్రార్‌ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి, మైక్రోసాఫ్ట్‌ జీఎం అండ్‌ కంట్రీ హెడ్‌ (డెవలపర్‌ ప్లాట్‌ఫాం విభాగం) మూర్తి ఉప్పలూరి ఒప్పందం పత్రాలు మార్చుకున్నారు. తాము మార్కెట్‌లోకి విడుదల చేసే సాఫ్ట్‌వేర్లను ఎంఓయూలో భాగంగా ఏయూ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ఉచితంగా ఇవ్వనుంది. ఏయూ క్యాంపస్‌లో, అనుబంధ కళాశాలల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, డిజైన్‌ కోర్సులు చదువుతున్న 3 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ తమ సాఫ్ట్‌వేర్‌ 'కీ' ఉచితంగా ఇవ్వనుంది. ఈ విధానంలో ప్రతి విద్యార్థికీ ప్రత్యేక పాస్‌వర్డ్‌ ఉంటుంది. దాని ద్వారా మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌లను విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు.