న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరి నెలలో మెరుగైన వృద్ధి రేటును కనబరచింది. తద్వారా భారత వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందన్న అంచనాలు నిజమవుతాయన్న సంకేతాలు పంపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9 శాతానికి చేరుతుందన్న ప్రధాని ఆశలకు ఊతమిచ్చింది. తయారీ రంగంలో వృద్ధి అత్యంత వేగంగా ఉండడంతో భారత పారిశ్రామికోత్పత్తి అంతక్రితం ఏడాది జనవరి నెలతో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో 16.7 శాతం వృద్ధిని సాధించింది. తయారీ రంగం (17.9%), తవ్వక రంగం(14.6%) చేయూతనివ్వడంతో ఇది సాధ్యమైంది. అయితే అంతకు ముందు నెల(డిసెంబరు)లో వృద్ధి 17.6 శాతంతో పోలిస్తే కాస్త మందగించినట్లయింది. ఏప్రిల్ 2009- జనవరి 2010కి అంటే ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఐఐపీ 9.6 శాతంగా నమోదైంది. ప్రభావం మార్చి తర్వాతే: పాక్షిక ఉద్దీపనల ఉపసంహరణ ఫిబ్రవరి 26 అర్థరాత్రి నుంచి అమల్లోకి రావడం వల్ల ఈ ప్రభావం మార్చి.. ఆ తర్వాతి నెలల్లో కనిపించనుంది. ప్రస్తుత ధోరణి వచ్చే కొద్ది నెలలూ కొనసాగితే అంచనా కంటే ఎక్కువ వృద్ధినే సాధించొచ్చని పారిశ్రామిక మండలి ఫిక్కీ అభిప్రాయపడుతోంది. కాగా 2009-10 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర గణాంకాల సంస్థ 7.2 శాతం వృద్ధిని అంచనా వేసింది. కానీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 6 శాతం వృద్ధినే సాధించడం వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చనేది విశ్లేషకుల వాదన. తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో 6.1%; రెండో త్రైమాసికంలో 7.9%(జులై-సెప్టెంబరు) జీడీపీ వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే.