పావులు కదిపిన రిజర్వు బ్యాంకు
రెపో, రివర్స్ రెపో రేట్లు పెంపు
జులై 2008 తర్వాత ఇదే తొలిసారి
ఏప్రిల్ 20 తర్వాతే వడ్డీ రేట్లపై నిర్ణయం: బ్యాంకులు
వృద్ధి రేటు తగ్గుతుంది: పరిశ్రమ వర్గాలు
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే: ఆర్‌బీఐ
ముంబయి: రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో పరపతి విధానాన సమీక్ష చేపట్టాల్సి ఉండగా.. అంతకంటే ముందే రెపో, రివర్స్ రెపో రేట్లను పెంచుతున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఆర్‌బీఐ నిర్ణయం గృహ, వాహన రిటైల్ రుణాలపై వడ్డీ రేట్ల పెంపునకు దారితీయొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి రెపో, రివర్స్ రెపో రేట్లను స్వల్పంగా పావు శాతం మేర పెంచింది. దీంతో రెపో రేటు 5 శాతానికి, రివర్స్ రెపో రేటు 3.5 శాతానికి చేరుతుంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రకటించింది. జులై 2008 తర్వాత ఆర్‌బీఐ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. వచ్చే ఏప్రిల్ 20 నాటి సమీక్షకు ముందే మరో విడత రేట్ల పెంపునకు ఆర్‌బీఐ సిద్ధం కావొచ్చని, తద్వారా గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. రెండంకెల దిశగా ఉరకలేస్తున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెపో, రివర్స్ రెపో రేట్లను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో నిధుల లభ్యతకు లోటు లేనందున తాజా చర్య ఆర్థిక రికవరీపై ప్రభావం చూపదని ఆర్‌బీఐ చెబుతోంది. అయితే ఇది వృద్ధి రేటును ప్రభావితం చేయడం తథ్యమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.
ఏప్రిల్‌లో మరిన్ని వడ్డనలు: విశ్లేషకులు
మరోపక్క ఆర్‌బీఐ తాజా నిర్ణయం వల్ల తక్షణం వడ్డీ రేట్లు పెరగవని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే చాలావరకు బ్యాంకులు ఇప్పటికే టీజర్ గృహ రుణ రేట్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ చర్య వడ్డీ రేట్ల పెంపు దిశగా పయనిస్తుందని విశ్లేషకులంటున్నారు. ఏప్రిల్ పరపతి విధాన సమీక్ష దాకా వేచిచూడాలని చాలావరకు బ్యాంకులు భావిస్తున్నాయి. 'ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం పెద్ద ఆశ్చర్యం కలిగించడం లేదని.. అయితే రెపో, రివర్స్ రెపో రేట్లను మరో పావు శాతం పెంచొచ్చ'ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ముఖ్య ఆర్థిక వేత్త అభీక్ బారువా అభిప్రాయపడుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ క్రిసిల్ ప్రధాన ఆర్థిక వేత్త డి.కె. జోషి సైతం 'ధరల పెరుగుదలను అరికట్టేందుకు రిజర్వు బ్యాంకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చ'ని చెబుతున్నారు. మరో పక్క 'భవిష్యత్‌లో మరిన్ని కఠిన చర్యలుంటాయనడానికి ఇది ఒక సంకేతమ'ని స్టాండర్డ్ చార్టర్డ్ కంట్రీ హెడ్ నీరజ్ స్వరూప్ పేర్కొన్నారు.
స్థిరాస్తిపై తీవ్ర ప్రభావం..డీఎల్‌ఎఫ్: వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే స్థిరాస్తి రంగం ఆర్‌బీఐ తాజా నిర్ణయం వల్ల తీవ్ర ప్రభావానికి లోనుకానుందని డీఎల్‌ఎఫ్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ తల్వార్ అంటున్నారు. ద్రవ్యలభ్యత మందగించి ఆస్తుల ధరలు పెరుగుతాయని.. డిమాండు తగ్గుతుందని ఆయన చెప్పారు.
వాహన రంగంపైనా..: ఇప్పటికే చాలా వరకు వాహన కంపెనీలు ధరలు పెంచిన కారణంగా ఈ చర్య మరింత ప్రభావాన్ని చూపగలదని సియామ్ ప్రెసిడెంట్ పవన్ గోయెంకా అన్నారు.
వడ్డనకు ఇది సంకేతమే కీలక స్వల్పకాలిక వడ్డీ రేట్లు పెరిగినంత మాత్రాన గృహ రుణాలు, రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం తక్షణం ఉండదు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటేమిటంటే బ్యాంకుల వద్ద కావలసినంత ద్రవ్యలభ్యత ఉంది. మరో పక్క రుణ వితరణ లేదు. మౌలికం వంటి రంగాలకు బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నా అవి తీసుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పెరుగుతాయని భావించలేం. మరో కారణం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సర ముగింపుకు అట్టే దూరం లేదు. అదీ కాక ఏప్రిల్ 20న ఎలాగూ ఆర్‌బీఐ పరపతి విధానం ఉంది కాబట్టి ఆ తర్వాతే బ్యాంకులు ఒక నిర్ణయానికి వస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం వడ్డీ రేట్లు పెంచే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏప్రిల్ 20 సమీక్షలో కానీఅంతకు ముందు కానీ ఆర్‌బీఐ సీఆర్‌ఆర్ పెంచే అవకాశం ఉంది. అపుడుద్రవ్యలభ్యత తగ్గుతుంది కాబట్టి గృహ రుణాలపై వడ్డీ రేట్లు తప్పక పెరిగేందుకు అవకాశాలెక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్‌బీఐ చర్యను భవిష్యత్‌లో వడ్డీ రేట్లు పెరుగుతాయనడానికి ఒక సంకేతంగా భావించొచ్చు. -తుమ్మల కిశోర్, బ్యాంకింగ్ నిపుణులు |
అప్పటిదాకా వేచిచూస్తాం రుణ వితరణ, ద్రవ్యలభ్యతలపై మధ్యకాలంలో ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాతే రుణ రేట్లపై ఒక నిర్ణయానికి వస్తాం. అంతవరకూ వేచిచూస్తాం. - చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ |
| పరపతి విధాన సమీక్ష ఏప్రిల్ 20న రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) ఏప్రిల్ 20న ఉదయం 11 గంటలకు 2010-11 ఆర్థిక సంవత్సర ద్రవ్య,పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ప్రధాన వాణిజ్య బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు భేటీ సందర్భంగా ఆయన సమీక్ష వివరాలు వెల్లడిస్తారు. వడ్డీరేట్లు పెరగొచ్చనే అంచనాలు మిన్నంటుతున్న నేపథ్యంలో ఈసారి వెలువడుతున్న విధాన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. |