Friday, April 2, 2010

15,000 మంది కరస్పాండెంట్ల భర్తీ

ఎస్‌బీఐ యోచన
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15,000 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమించుకోవాలనే ఆలోచనతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉంది. ఎస్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు ఈ సంగతిని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బ్యాంక్‌ ఖాతాలను తెరిచేందుకు ముందుకు రావడం కోసం బిజినెస్‌ కరస్పాండెంట్ల సేవలను ఉపయోగించుకొనే ఉద్దేశం ఎస్‌బీఐకి ఉంది. పల్లెవాసులు బ్యాంకింగ్‌ వ్యవహారాలు నెరపడంలోనూ బిజినెస్‌ కరస్పాండెంట్లు తోడ్పడతారు. ప్రతి గ్రామంలో బ్యాంకు శాఖలను ప్రారంభించడం సాధ్యం అయ్యే పని కాదు కాబట్టి బ్యాంకింగ్‌ సౌకర్యాలను దేశంలోని నలుమూలలకు విస్తరించడంలో బిజినెస్‌ కరెస్పాండెంట్లు, వ్యాపార సమన్వయకర్త (బిజినెస్‌ ఫెసిలిటేటర్‌)లు సహకరిస్తారని ఎస్‌బీఐ విశ్వసిస్తోంది. మరీ ముఖ్యంగా డిపాజిట్లను స్వీకరించడం, నగదు చెల్లింపులు జరపడంలో వీరు కీలక పాత్రను పోషిస్తారని భావిస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శక సూత్రాల ప్రకారం.. పదవీవిరమణ చేసిన ఉద్యోగులను, మాజీ సైనికోద్యోగులను, విశ్రాంత ప్రభుత్వోద్యోగులను.. బిజినెస్‌ కరస్పాం డెంట్లుగా భర్తీ చేసుకోవచ్చు. అయితే వారు మంచి పేరు కలిగి, స్థానిక ప్రజల విశ్వాసం చూరగొన్నవారై ఉండాలని ఆర్‌బీఐ పేర్కొంది.