Friday, April 2, 2010

2009-10 వాహన అమ్మకాలు అదుర్స్‌!

2009-10 వాహన అమ్మకాలు అదుర్స్‌!
25-30% పెరిగిన వార్షిక విక్రయాలు
మార్చిలోనూ అదేస్థాయి దూకుడు
ముందుంది కష్టకాలం: విశ్లేషకులు
వాహన రంగం 2009-10
దేశీయ వాహన పరిశ్రమకు 2009-10ప్రోత్సాహకరంగా గడిచింది. మాంద్యం నేపథ్యంలో ప్రారంభమైన గత ఆర్థిక సంవత్సరం మొదట్లో వాహన సంస్థలు కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కున్నాయి. అయితే కేంద్రం, బ్యాంకులు, తయారీ సంస్థలు చేపట్టిన చర్యలతో ఏడాది చివరి నాటికి ఈరంగం పూర్తిస్థాయిలో కోలుకొంది. 2009-10లో ప్రధాన కంపెనీల వార్షిక అమ్మకాలు 25-30% పెరగడమే ఇందుకు నిదర్శనం. ఒకవైపు రికవరీని కొనసాగిస్తూనే మారుతీ సుజుకీ, హీరోహోండా లాంటి దిగ్గజ సంస్థలు రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. మారుతీ సుజుకీ 10,18,365 వాహనాలను విక్రయించి రికార్డు నెలకొల్పింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈసంస్థ విక్రయాలు 2009-10లో 28.55 శాతం పెరిగాయి. మరోవైపు హీరోహోండా కూడా అత్యధికంగా 46,00,130 వాహనాలను విక్రయించింది. ఈసంస్థ మార్చి అమ్మకాలు 17.34 శాతం పెరిగాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కూడా గతంలో ఎన్నడూలేని విధంగా మార్చిలో 27.26 శాతం వృద్ధితో 31,0501 వాహనాలను విక్రయించింది. సంస్థ స్థాపించాక ఒకే నెలలో ఇంతటి స్థాయిలో అమ్మకాలు జరగడం ఇదే ప్రథమమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు పలు వాహన సంస్థలు నెలవారీ అమ్మకాలలోనూ సరికొత్త రికార్డులను తిరగ రాశాయి. చౌకగా రుణాలు లభిస్తుండడం.. ప్రభుత్వ రాయితీలు.. కొత్త మోడళ్లకు ఆకర్షితులైన వినియోగదారులు ఎక్కువగా వాహన కొనుగోళ్లు జరిపారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈరంగంలో మందగమనం క్రమంగా కనుమరుగు అయినట్లు వారు విశ్లేషిస్తున్నారు.
వైభవం తగ్గొచ్చు
మార్చితో ముగిసిన ఏడాది చాలాప్రోత్సాహకరంగానే సాగినప్పటికీ కొత్త ఏడాది వాహన తయారీ సంస్థలకు కష్టకాలంగానే కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జనవరి నుంచి వాహనాల ధరలు 2 సార్లు పెరిగాయి. తాజాగా 13 ప్రధాన నగరాల్లో బీఎస్‌ IV కాలుష్య ప్రమాణాల అమలులోకి రావడంతో ధరలు మళ్లీ పెరగనున్నాయి. విక్రయాలూ కొంత ప్రభావితం కానున్నాయి. దేశీయ వాహన సంస్థల విక్రయాల్లో సగానికి పైగా అమ్మకాలు ఈప్రధాన నగరాల్లోనే ఉండడం ఆందోళనకర అంశం. కొత్త ప్రమాణాల వల్ల ఆదరణ ఉన్న పలు వాహనాల అమ్మకాలు నిలిచిపోతుండడం బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం, ఏడాది మధ్యలో ప్రభుత్వం మరోసారి పన్ను'పోటు' వేసే ప్రతిపాదనల్లో ఉండడం, బ్యాంకుల రుణాలు భారం కానుండడంతో కొత్త ఏడాదిలో అమ్మకాలు తగ్గుతాయని అంచనా. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటున్నందున వాహన సంస్థలు వినూత్న పద్ధతుల ద్వారా వినియోగదారులకు చేరువైతే తిరిగి పూర్వవైభవం సొంతం అవుతుందని వారు చెబుతున్నారు.