యులిప్ వివాదం
పింఛన్ పథకాలపైనా గురి..?
యూనిట్ ఆధారిత బీమా పథకాల (యులిప్) కోవలోనే పింఛన్ పథకాల పైనా సెబీ తన దృష్టిని ఇక సారించనుందా..? పింఛన్ ఫండ్ మేనేజర్లు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పింఛన్ పథకాలు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నియంత్రణలో ఉన్నాయి. యులిప్‌లలో బీమా ప్రీమియం వాటాను మినహాయించగా మిగతా సొమ్మును ఈక్విటీలు, రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్న కారణంగా యులిప్‌లకు తన అనుమతిని పొంది తీరాలని సెబీ స్పష్టం చేసిన విషయం విదితమే. సెబీ ఇదే తర్కాన్ని పింఛన్ పథకాల విషయంలోనూ వర్తింపచేయవచ్చని పింఛన్ నిధుల అధికారులు అభిప్రాయపడుతున్నారు. అవ్యవస్థీకృత రంగంలోని పనివారికి ఉద్దేశించి అమల్లోకి తెచ్చిన పింఛన్ పథకంలోని నిధులను షేర్ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇతర పింఛన్ పథకాలలోనూ ఈ సౌలభ్యం ఉంటోంది. సెబీ ముఖ్యోద్దేశం మదుపరుల ప్రయోజనాలను కాపాడాలన్నదే. అయితే, పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం ఇంకా పార్లమెంట్ ఆమోదం పొందవలసి ఉన్నందువల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ఘర్షణ తలెత్తకపోవచ్చని పరిశ్రమ వర్గాలు కొన్ని గుర్తు చేస్తున్నాయి.