Friday, April 2, 2010

అ'ధనం'పై ఆడిట్‌ ఆరా

ప్రాణహిత- చేవెళ్ల ఇంజినీర్లలో దడ
ముందస్తు చెల్లింపులతో చిక్కు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
నులు ప్రారంభం కాకముందే ప్రాణహిత- చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి దొడ్డిదారిన జరిపిన అదనపు చెల్లింపులపై తాజాగా ఆడిట్‌ విభాగం ఆరా తీస్తోంది. ఒప్పందానికి విరుద్ధంగా గుత్తేదార్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సు, ఇన్వెస్టిగేషన్‌ పేరుతో వందల కోట్ల రూపాయలను గత ఏడాది అప్పటి సర్కారు కట్టబెట్టింది. కొన్ని పనుల్లో ఆ నిధులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా రికవరీ మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో గుత్తేదార్లకు చేసిన చెల్లింపులు, పనుల తీరుపై వివరాలను అందజేయాల్సిందిగా ఆడిట్‌ అధికారులు కోరారు. దీంతో భారీ మొత్తంలో గుత్తేదార్లకు బిల్లులు చెల్లించిన ఇంజినీర్లకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

2008 మేలో ప్రారంభమైన ప్రాణహిత- చేవెళ్ల ఒప్పందాలు ఆరునెలల క్రితంవరకూ జరిగాయి. 28 ప్యాకేజీల పనులకు రూ.36,258 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి వరకూ గుత్తేదార్లకు రూ.796 కోట్లు చెల్లించారు. ఇందులో మొబిలైజేషన్‌ అడ్వాన్సు కిందనే రూ.343.63 కోట్లు ఇచ్చారు. ఇది ఒప్పందంలో దాదాపుగా ఒక శాతం. ఒప్పందం ప్రకారం మొదట ఒక శాతం చెల్లించి ఇన్వెస్టిగేషన్‌, డిజైన్‌ పూర్తిచేశాక పనులు ప్రారంభానికి ముందు 4 శాతం చెల్లించాల్సి ఉంది. కానీ ఆ రెండు పనులను పూర్తిచేయక ముందే అదనపు చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వ పెద్దలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇన్వెస్టిగేషన్‌ పూర్తిచేసిన గుత్తేదారుకు ఒప్పందం మొత్తంలో 0.45 శాతం నుంచి 0.5 శాతం వరకూ చెల్లించాలి. కానీ ఇన్వెస్టిగేషన్‌ పూర్తికాగానే చెల్లించే మొత్తాన్ని భారీగా పెంచారు. ఏకంగా ఒప్పందం మొత్తంలో మూడున్నర శాతం చెల్లించేలా సంబంధిత చీఫ్‌ ఇంజినీరు ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రాణహిత- చేవెళ్లలో కేవలం ఇన్వెస్టిగేషన్‌ కోసం గుత్తేదార్లకు చెల్లించే మొత్తమే సుమారు రూ.1200 కోట్లు అయింది. ఆదేశాలు జారీ అయిన వెంటనే కొందరు గుత్తేదార్లకు చెల్లింపులు జరిగాయి. జనవరి వరకూ సుమారు రూ.450 కోట్లకుపైగా చెల్లించగా తాజాగా మరికొంత ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆడిట్‌ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం కోరడంతో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆడిట్‌ అధికారులు అడిగిన సమాచారం ఇదే...

*ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం, అటవీశాఖ అనుమతులొచ్చాయా?
*ఇన్వెస్టిగేషన్‌, డిజైన్లు ఎప్పటిలోగా పూర్తి చేయాలి?
*ఒప్పందం ప్రకారం 10శాతం పని ఎప్పుడు పూర్తి చేయాలి?
*60 శాతం పని ఎప్పుకల్లా చేయాలి?
*ఇప్పటివరకూ ఎంత పని చేసి ఉండాలి? చేసిందెంత?
*జాప్యానికి కారణాలేమిటి?
*భూసేకరణకు సంబంధించిన వివరాలేమిటి?
*ఇప్పటిదాకా గుత్తేదార్లకు ఎంత చెల్లించారు?
*మొబిలైజేషన్‌ అడ్వాన్సు నుంచి ఎంత రికవరీ చేశారు? చేయకుంటే జాప్యానికి కారణమేమిటి?
*ఆరు నెలల్లో పూర్తిచేయాల్సిన ఇన్వెస్టిగేషన్‌ ఎంతవరకు వచ్చింది?
*జాప్యానికి కారకులైన గుత్తేదార్లపై లిక్విడేట్‌ డ్యామేజెస్‌ (నష్టపరిహారం) ఎంత విధించారు?
ఇన్వెస్టిగేషన్‌ పేరుతో మూడున్నర శాతం చెల్లించడానికి ఆదేశాలివ్వడం, ఇప్పటికే 2శాతం దాకా చెల్లించడం వంటివి ఒప్పందానికి విరుద్ధం కావడంతో ఆడిట్‌ చేతిలో చిక్కినట్లేనన్న అభిప్రాయాన్ని ఇంజినీర్లు వ్యక్తం చేస్తున్నారు.