Friday, April 2, 2010

జంటనగరాలకు సీఎన్‌జీ వంటగ్యాస్‌

2012 నాటికి ప్రతి ఇంటికీ సరఫరా
కాకినాడ-అహ్మదాబాద్‌ పైప్‌లైన్‌ నుంచి సేకరణ
రవాణాశాఖ కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ వెల్లడి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: జంటనగరాల్లోని అన్ని గృహాలకు 2012 నాటికి పైప్‌లైన్‌ ద్వారా సీఎన్‌జీ వంటగ్యాస్‌ సరఫరా ప్రారంభం కానుందని రవాణాశాఖ కమిషనర్‌ రేమండ్‌పీటర్‌ తెలిపారు. భాగ్యనగర్‌ గ్యాస్‌ కంపెనీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారమిక్కడ రేమండ్‌పీటర్‌ విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు..

కాకినాడ-అహ్మదాబాద్‌ వెళ్లే పైప్‌లైన్‌ నుంచి రాష్ట్ర రాజధాని గ్యాస్‌ అవసరాల కోసం కొంత సీఎన్‌జీని సేకరిస్తారు. ఇందుకోసం శామీర్‌పేట వద్ద ఒక పాయింట్‌ ఏర్పాటైంది. అక్కడి నుంచి గ్యాస్‌ను పైప్‌లైన్‌ ద్వారాసికింద్రాబాద్‌ సిఖ్‌విలేజ్‌లోని ప్రధాన స్టేషన్‌కు తరలిస్తారు. దాని ద్వారాజంటనగరాల్లోని అన్ని కాలనీల్లోని ఇళ్లకు వంటగ్యాస్‌గా సీఎన్‌జీ పైప్‌లైన్‌ ద్వారా సరఫరా అవుతుంది. ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లో కూడా అన్ని వాహనాలను సీఎన్‌జీకి మార్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆరు సీఎన్‌జీ బంకులున్నాయి. ఈనెలలో అమీర్‌పేట లాంటి ప్రధాన ప్రాంతాల్లో మరో 12 సీఎన్‌జీ బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాకినాడ గ్యాస్‌ అందుబాటులోకి రావడం వల్ల సీఎన్‌జీ ధర కూడా తగ్గే అవకాశం ఉంది. హకీంపేట డిపోలోని అన్ని ఆర్టీసీ బస్సులను సీఎన్‌జీ గ్యాస్‌తో నడుపుతారు. భవిష్యత్తులో కూకట్‌పల్లి, రాణిగంజ్‌ డిపో ఆర్టీసీ బస్సులను కూడా సీఎన్‌జీతో తిప్పుతారు. దశలవారీగా నగరంలో అన్ని బస్సులను ఇలా మారుస్తారు.

పాన్‌కార్డు ఉంటేనే రవాణా వాహనం: రూ.50 వేలకు పైబడి విలువ చేసే అన్ని రకాల రవాణా వాహనాలను(ఆటోతో సహా) కొనుగోలు చేసే వారు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి తప్పనిసరిగా పాన్‌కార్డును సమర్పించాలని రేమండ్‌ పీటర్‌ తెలిపారు. పాన్‌కార్డు లేని యజమానుల వాహనాన్ని డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేయరని తెలిపారు. ఈ నిబంధన నుంచి ద్విచక్ర వాహనాలను మినహాయించినట్లు చెప్పారు. నిర్మాణ పనులకు ఉపయోగించే ఎస్కలేటర్‌,గ్రేడర్స్‌లాంటి యంత్రాలను జీవిత పన్ను పరిధిలోకి తెచ్చామన్నారు. వాహనదారులు ఈ పన్నులో 50 శాతాన్ని ఈనెల 15వ తేదీలోగా చెల్లించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2100 కోట్లు వసూలు చేయాలని తొలుత రవాణాశాఖకు లక్ష్యంగా నిర్దేశించగా రూ.2007 కోట్ల ఆదాయాన్ని సాధించామన్నారు. వాహనదారులు పాత వాహనం నెంబర్‌ను కొత్త వాహనానికి వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇకపై వాహనదారులు ఆరు నెలలకోసారి వాహన కాలుష్య సర్టిఫికెట్‌ను సమర్పించే పద్ధతి మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. సరైన నిబంధనలు లేకపోవటంతో ఆర్టీసీ బస్సులు వెదజల్లే కాలుష్యంపై చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. రాజధానిలో బీఎస్‌-4 ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్‌ 1వతేదీ వరకు కేంద్రం వాయిదా వేసిందన్నారు. బీఎస్‌-3 ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్‌ నుంచి ప్రారంభిస్తామన్నారు.