Saturday, April 3, 2010

చెల్లింపుల్లో ముందు..వసూళ్లు బంద్‌!

ఇదీ మార్కెటింగుశాఖ నైపుణ్యం
రొయ్యల వ్యాపారులపై అవ్యాజ ప్రేమ
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఇది మార్కెటింగు శాఖ విచిత్రం! రొయ్యల వ్యాపారులు ప్రభుత్వానికి ఎగ్గొట్టిన రూ.1.84 కోట్ల సుంకాన్ని రాబట్టనే లేదు. మరో వైపు తాము అదనంగా సుంకం చెల్లించామని... ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చెయ్యాలని వ్యాపారులు కోరిందే తడవుగా...దాదాపు కోటి రూపాయలు సమర్పించేశారు. పరస్పర విరుద్ధ వ్యవహారం ఆ శాఖలోనే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రొయ్యల వ్యాపారులపై చూపుతున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది.

ఆక్వా వ్యాపారులు ఎగుమతి సుంకం ఎగవేస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం 2007లో ఒక పరిశీలన చేపట్టింది. విశాఖపట్నం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో రూ.1.84కోట్ల మేర సుంకం ఎగవేసినట్లు తేల్చింది. ఎగుమతి చేసిన రొయ్యల పరిణామాన్ని, మార్కెటింగ్‌ శాఖకు సమర్పించిన వ్యాపార పరిమాణ రికార్డుల్ని పరిశీలించిన తర్వాత సుంకం ఎగవేత వ్యవహారం బయటపడింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఎగవేసిన సొమ్ముల్ని రాబట్టాలని సూచించినా ఇప్పటికీ మార్కెటింగ్‌శాఖ కదిలింది లేదు.

రొయ్యల ఎగుమతులపై 0.5శాతంగా ఉన్న సుంకాన్ని 0.25శాతానికి తగ్గించాలన్న మంత్రుల సంఘం సిఫార్సు మేరకు 2007లో ఉత్తర్వులు జారీ చేశారు. 2006 నుంచే దీన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో తాము ఎక్కువుగా చెల్లించిన సుంకం మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని భీమవరం మార్కెట్‌ కమిటీ కార్యదర్శికి కొందరు వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. 0.5 శాతంగా సుంకం చెల్లించామని, ప్రభుత్వం 0.25శాతంగా నిర్ణయించినందున అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకారం రూ.99.4 లక్షలు వారికి తిరిగి చెల్లించాలంటూ భీమవరం మార్కెట్‌ కార్యదర్శి 4.6.2009న విజయవాడలోని మార్కెటింగ్‌శాఖ సంయుక్త సంచాలకునికి లేఖ రాశారు. అక్కడి నుంచి అదే సిఫార్సును ఆమోదిస్తూ 7.6.2009న మార్కెటింగుశాఖ కమిషనర్‌కు ఫైలు పంపారు. మొత్తం రూ.99.4లక్షలు చెల్లించాలంటూ కమిషనర్‌ జూన్‌ 9న ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఫైలు భీమవరం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వరకు కదిలి తుది నిర్ణయం కూడా తీసేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆ మొత్తాన్ని తిరిగివ్వకుండా తరువాతి సంవత్సరాల్లో వారు చెల్లించాల్సిన దానికి సర్దుబాటు చేయటమో, వారు గతంలో ఏమైనా బకాయిలుంటే వాటికి జమ చేసుకోవటమో చేస్తుంటారు. ఈ వ్యవహారంలో ఆ పరిశీలన ఏమీ లేకుండానే నిధుల్ని వెనక్కిచ్చేశారు. అంతే కాకుండా ప్రస్తుతం రైతులు రొయ్యల ఎగుమతిపై చెల్లిస్తున్న 0.25శాతం సుంకాన్ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై మార్కెటింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి రత్నకిషోర్‌ని 'న్యూస్‌టుడే' సంప్రదించగా... ప్రభుత్వం సుంకం తగ్గించి 2006 నుంచే అమలు చేయమన్నందున ఆ ప్రకారమే కమిషనర్‌ రూ.99 లక్షలు వెనక్కు ఇచ్చారని చెప్పారు.