Saturday, April 3, 2010

మొబైల్‌లో 'ఐపీఎల్‌' ఆనందం

35% పెరిగిన చందాదారులు
రెండేళ్లలో 50 లక్షల మంది
అపల్యా టెక్‌ సీఈఓ వంశీ కృష్ణా రెడ్డి అంచనా
మీరు క్రికెట్‌ వీరాభిమానులు. ఇండియన్‌ ప్రీమియం లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌లను ఒక్కటి కూడా వదలకుండా చూడాలన్నది మీ కోరిక. అయినా.. కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూర్చుని మ్యాచ్‌లు వీక్షించడం సాధ్యం కాదు. అటువంటప్పుడు మీ కోరిక ఎలా తీరుతుంది? దీనికి పరిష్కారమే మొబైల్‌ టీవీ. దీంతో క్రికెటే కాదు.. వార్తలు, వినోద కార్యక్రమాల చానెళ్లను సైతం ఎక్కడున్నా చక్కగా చూడవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల పుణ్యమాని మొబైల్‌ టీవీ చందాదారుల సంఖ్య ఏకంగా 35 శాతం పెరిగింది.

హైదరాబాద్‌కు చెందిన అపల్యా టెక్నాలజీస్‌ దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌ టీవీ సేవలను సమకూరుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పాటు మూడేళ్లు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి ఈ కంపెనీ హక్కులు కొనుగోలు చేసింది. దేశంలో మొబైల్‌ టీవీ సేవలను అందిస్తున్న ఏకైక కంపెనీ ఇదే. మొబైల్‌ టీవీ ప్రసారాల కోసం చందాదారుల నుంచి టెలికాం ఆపరేటర్లు నెలకు రూ.150 వసూలు చేస్తున్నాయి. 55 చానెళ్లను ప్రసారం చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేక చానెల్‌ను పొందాలంటే మాత్రం నెలకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం జనరల్‌ ప్యాకెట్‌ రేడియో సర్వీసెస్‌ (జీపీఆర్‌ఎస్‌) ఆధారిత మొబైల్‌ ఫోన్లలో టెలివిజన్‌ కార్యక్రమాలను వీక్షించడానికి వీలు ఉంటుంది.

రెండు వారాల్లో 3.5 లక్షల మంది
ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాక ముందు దేశంలో మొబైల్‌ టీవీ చందాదారులు 10 లక్షల మంది ఉండగా.. గత రెండు వారాల్లో కొత్తగా 3.5 లక్షల మంది చేరారు. ఈ నెల 25న ఐపీఎల్‌ మ్యాచ్‌లు ముగిసే నాటికి కొత్త చందాదారులు 10 లక్షలకు పెరగవచ్చని అపల్యా టెక్నాలజీస్‌ సీఈఓ వంశీ కృష్ణా రెడ్డి అంచనా. మ్యాచ్‌లు ముగిశాక కొత్త చందాదారుల్లో 50 శాతం మంది కొనసాగవచ్చని, అంటే.. మొత్తం మొబైల్‌ చందాదారుల సంఖ్య 15 లక్షలు ఉండవచ్చని ఆయన అంటున్నారు. మొబైల్‌ టీవీ చందాదారుల్లో దాదాపు 20 శాతం మంది రాష్ట్రంలోనే ఉండడం విశేషం. వచ్చే రెండేళ్లలో మొబైల్‌ టీవీ చందాదారులు 50 లక్షలకు చేరవచ్చు. 3జీ సేవలు, అత్యాధునిక మొబైల్‌ హ్యాండ్‌ సెట్లు, మారుతున్న జీవన శైలి తదితర అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

- న్యూస్‌టుడే, హైదరాబాద్‌
2013కల్లా 3జీ మొబైళ్లు 5 కోట్లకు!
* దేశంలో జనాభా 100 కోట్లు మించగా, టెలివిజన్‌ సెట్లు 12 కోట్లే ఉన్నాయి.

* ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్‌ హ్యాండ్‌సెట్లలో 10 శాతం జీపీఆర్‌ఎస్‌ ఆధారిత ఫోన్లు.

* త్వరలో 3జీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు డేటా బదిలీ వేగాన్ని పెంచుతాయి. 3జీ తరహాలో సీడీఎంఏ ఫోన్లకు కూడా కొత్త తరం టెక్నాలజీ ఈవీడీఓ అందుబాటులోకి రానుంది. 3జీ సేవలు ప్రారంభమైన రెండు మూడేళ్లలో ఈ సేవలకు అనువైన 5 కోట్ల హ్యాండ్‌సెట్లు చందాదారుల చేతుల్లో ఉంటాయని ఒక అంచనా.

* భవిష్యత్తులో డేటా బదిలీకి సాధారణ బ్రాడ్‌బ్యాండ్‌ కన్నా వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎక్కువ అధారపడే అవకాశాలు ఉన్నాయి.

* చానెళ్లు పెరిగే కొద్దీ ఇంట్లో ఒక టెలివిజన్‌తోనే సరిపెట్టుకొనే పరిస్థితులు పోతున్నాయి. అయితే విద్యుత్తు కోత ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికేలా చేస్తోంది. ఒక పరిష్కారంగా మొబైల్‌టీవీ కనిపిస్తోంది.

అగ్రస్థానం కొనసాగిస్తాం
ప్రస్తుతం అపల్యా టెక్నాలజీస్‌ ఒక్కటే ఈ సేవలు అందిస్తున్నప్పటికీ, ఒకటి రెండేళ్లలో 5-6 కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయినప్పటికీ మొదట ఈ రంగంలోకి ప్రవేశించిన కంపెనీగా తమ అగ్ర స్థానం కొనసాగుతుందని అపల్యా టెక్నాలజీస్‌ సీఈఓ వంశీ కృష్ణారెడ్డి అంటున్నారు. చందాదారుల నుంచి టెలికాం కంపెనీలకు వచ్చే ఆదాయంలో 30-45% ఆదాయం అపల్యాకు లభిస్తుంది. కంపెనీకి వచ్చిన ఆదాయంలో సగం టెలివిజన్‌ చానెళ్లకు (కంటెంట్‌ ప్రొవైడర్లు) చెల్లిస్తారు. 2007లో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడితో కంపెనీని ప్రారంభించారు. మొదట ఒక్క ఐడియా సెల్యులార్‌ మొబైల్‌ టీవీ సేవలను అందించేది. తొలి ఏడాదిలో లక్ష మంది చందాదారులే ఉండగా.. రెండేళ్లలోనే 10 లక్షలకు చేరింది. అపల్యా ఆదాయం గత రెండేళ్లలో ఏడాదికి 250 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని వంశీ తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీలు క్వాల్‌కామ్‌, ఐడీజీలు దాదాపు రూ.15 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ నిధులను విస్తరణ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని, 1-2ఏళ్ల వరకు నిధుల అవసరం ఉండకపోవచ్చని వంశీ చెప్పారు. భవిష్యత్తులో డీటీహెచ్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొబైల్‌ టీవీ సేవలను అందించనున్నట్లు తెలిపారు. మొబైల్‌ టీవీ ప్రసారాలకు డీటీహెచ్‌ ప్రసారాలు ఏ విధంగానూ పోటీ కాదని అభిప్రాయపడ్డారు.