లాభం రూ.1,020కోట్లు.. నష్టం రూ.30కోట్లు
ఇదీ పన్నురేట్ల సవరణల తీరు
త్వరలో హోటళ్లకూ వడ్డింపు
హైదరాబాద్, న్యూస్‌టుడే: అమ్మకం పన్ను రేట్ల పెంపు కారణంగా ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జించనుంది. కొద్దిపాటి వస్తువులపై పన్ను రేట్లను తగ్గిస్తున్నట్లు చెబుతూనే ఒక్కసారిగా అసంఖ్యాక వస్తువులపై పన్నురేటును సర్కారు రెండు శాతం మేర ఇటీవల పెంచింది. పన్ను రేటు తగ్గిన వస్తువులపై సర్కారుకు ఏడాదికి వచ్చే నష్టం కేవలం రూ.30కోట్లు మాత్రమే. పన్ను రేటును పెంచటం వల్ల అదనపు లాభం ఏకంగా రూ.1,020 కోట్లను చేరనుంది. ఈ లెక్కలు సర్కారు వేసినవి. రేట్లలో తెచ్చిన మార్పులతో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టాన్ని ప్రభుత్వం సవరించనుంది. వివిధ వస్తువుల పన్నుల్లో మార్పులను తేవటానికి గల కారణాలను సవరణ బిల్లుతో పాటు అందజేసే 'ఉద్దేశాలు'లో ప్రభుత్వం వివరించింది. దీని ప్రకారం మూడు నక్షత్రాలు, లేదా వార్షిక టర్నోవర్ రూ.1.50 కోట్లపైన గల హోటళ్లలో కూడా త్వరలో పన్ను రేటు 14.5 శాతానికి పెరగనుంది. అలాగే వర్క్స్ కాంట్రాక్టులపైనా ఇదే విధంగా పన్ను పెరుగుతుంది. సవరణల బిల్లు త్వరలో సభలో చర్చకు రానుంది.