Friday, March 19, 2010

నిత్యావసరాల ధరలు తగ్గుతాయి: శరద్‌పవార్‌

న్యూఢిల్లీ: పంచదారతో సహా నిత్యావసరాల ధరలు త్వరలో తగ్గుముఖం పడతాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. గోధుమల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణల్ని పవార్‌ నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అలాంటి అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాల(ఏపీఎల్‌)కు కోటాను మరింత పెంచే అవకాశం ఉందని ఆయన స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోధుమల ఎగుమతుల్ని అనుమతించం అని పవార్‌ అన్నారు. ద్రవ్యోల్బణం వల్ల ధరల పెరుగుతున్నాయన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ..''నేను ఆర్థికవేత్తను కాను. రైతును.. ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతుందో నాకైతే తెలీదు'' అని బదులిచ్చారు. మార్చి ఒకటినాటికి దేశంలో 183.88 లక్షల టన్నుల గోధుమలు గోదాముల్లో నిల్వ ఉన్నాయని తెలిపారు. ధరలు పెరిగేందుకు దోహదపడే ఎలాంటి నిర్ణయాలను తాము తీసుకోమని.. మంత్రిమండలి మాత్రం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత సీజన్‌లో చెరకు దిగుబడి ఆశాజనకంగా ఉందని, మార్కెట్లో పంచదార ధరలు తగ్గుముఖం పడతాయని పవార్‌ చెప్పారు. మహిళా బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. ముందు యథాతథ రూపంలోనే ఆమోదించేద్దామని, మైనారిటీలు, ఓబీసీల రిజర్వేషన్ల అంశంపై ఆ తర్వాత చర్చించుకోవచ్చని అన్నారు. ఆహార భద్రతా బిల్లు ముసాయిదాను గురువారం కేంద్ర మంత్రుల సాధికార బృందం ఆమోదించింది. కిలో 3 రూపాయల చొప్పున నెలకు 25 కిలోల ఆహారధాన్యాలను పేదలకు అందించేందుకు కేంద్రప్రభుత్వం ఆహార భద్రతాచట్టాన్ని తెస్తోంది. వచ్చేవారం ఈ ముసాయిదా బిల్లు కేబినెట్‌ ముందుకు వెళుతుందని పవార్‌ తెలిపారు.