Friday, March 19, 2010

రోజు బ్యాంకు వడ్డీ



బ్యాంకు వడ్డీయా? ఆ! ఎంతొస్తుంది? ఆ లెక్కలు కూడా మనకు అర్థం కావు. తప్పనిసరై అందులో ఉంచాల్సిందే! పొదుపు ఖాతాలో సొమ్ము గురించి అడిగితే చాలామంది వ్యక్తం చేసే అభిప్రాయం ఇదే. ఇక ఈ భావన మార్చుకోవాల్సిందే. వడ్డీ గణనకు నూతన విధానం వచ్చే నెల నుంచే ప్రారంభం కానుంది.
కొత్త ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురే ఉంది. దేశవ్యాప్తంగా వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తున్న కోట్లాది మంది ఏప్రిల్‌ 1, 2010 నుంచి అదనపు ప్రయోజనాన్ని పొందబోతున్నారు. పొదుపు ఖాతాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 3.5 శాతమే కొనసాగుతుంది. అయినప్పటికీ వడ్డీ లెక్క కట్టే విధానంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఖాతాదారుల వడ్డీ ఆదాయం పెరగనుంది. పొదుపు ఖాతాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు రిజర్వు బ్యాంకు నియంత్రణలో ఉంటుంది. దీన్ని తమ నిర్ణయాధికారాలకే వదిలేయాలని గతంలో కొన్ని బ్యాంకులు ఆర్‌బీఐని కోరాయి. మరికొన్ని వడ్డీ రేటును తగ్గించాలని సూచించాయి. అయితే, రిజర్వు బ్యాంకు మాత్రం వడ్డీ లెక్కకట్టే కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. దాంతో వచ్చే నెల నుంచి కొత్త విధానంలోకి మారడానికి బ్యాంకులు సన్నాహాలు చేస్తున్నాయి.

పారదర్శకం..
ఇప్పటిదాకా అమలులో ఉన్న విధానం ప్రకారం.. పొదుపు ఖాతాలో ప్రతి నెలా పదో తారీఖు నుంచి ఆ నెల చివరి తేదీ దాకా ఉన్న కనిష్ఠ నగదు నిల్వలపైనే వడ్డీ లెక్కిస్తారు. పదో తేదీ లోపు ఖాతాలో ఎంత మొత్తం ఉన్నప్పటికీ దానిపై ఏ మాత్రం వడ్డీ ఉండదు. అందువల్ల ఖాతాదారులకు పూర్తి ప్రయోజనం అందడం లేదనే విషయాన్ని పలు డిపాజిటర్ల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రిజర్వు బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాయి. తత్ఫలితంగా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఆధ్వర్యంలో ఈ కొత్త విధానం రూపొందింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత పొదుపు ఖాతాలో ఉన్న నగదు నిల్వలపై పూర్తి స్థాయిలో వడ్డీ ఆదాయాన్ని పొందే వెసులుబాటు కలుగుతుంది. వడ్డీ గణన మరింత పారదర్శకంగా ఉంటుంది.

వారికి భారం...
ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ.. వారి ప్రయోజనాలను కాపాడేందుకు రిజర్వు బ్యాంకు పలు చర్యలు తీసుకుంది. బ్యాంకులకు అనేక మార్గదర్శకాలను రూపొందించింది. పొదుపు ఖాతాలపై వడ్డీ లెక్కగట్టే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం ఖాతాదారుల సేవల్లో మరో ముందడుగు. దీనివల్ల ఖాతాదారులకు అదనపు వడ్డీ వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. బ్యాంకులు మాత్రం కొంత అదనపు భారాన్ని భరించాల్సిందే.

స్వల్పకాలిక మదుపైనా...
ఏదైనా స్థిరాస్తి అమ్మినప్పుడో.. లేదా ఇతరత్రా పెద్ద మొత్తాలలో చేతికొచ్చిన సొమ్మును తిరిగి మదుపు చేసేందుకు సహజంగా కొంత సమయం పడుతుంది. ఇప్పటిదాకా ఈ నిధులను ముందుగా స్వల్పకాలిక ఫిక్సెడ్‌ డిపాజిట్లలో ఉంచి ఆ తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించేవారు.

* కొత్త వడ్డీ విధానం వల్ల పొదుపు ఖాతాల్లో ఉన్న మొత్తం సొమ్ముపై పూర్తి వడ్డీ ప్రయోజనం పొందే అవకాశం వచ్చింది. అందువల్ల చాలా సందర్భాల్లో స్వల్ప కాలిక డిపాజిట్లలో పెట్టేకంటే పొదుపు ఖాతాల్లోనే ఉంచడం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

* ముఖ్యంగా ఫిక్సెడ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం పరిమితికి మించి ఉంటే, దానిపై మూలంలోనే పన్ను పోటు తప్పదు. ఈ విధమైన పన్ను కోతలు పొదుపు ఖాతాలపై లేవు.

* స్వల్పకాలిక ఫిక్సెడ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు దాదాపు ఖాతాపై వచ్చే వడ్డీతో సమానంగా ఉన్నాయి. ఉదాహరణకు రూ. 10 లక్షలు 90 రోజుల వ్యవధికి ఫిక్సెడ్‌ డిపాజిట్లో ఉంచితే రూ. 8,630 వడ్డీ ఆదాయం వస్తుంది. కొత్త పద్ధతి ప్రకారం పొదుపు ఖాతాలో కూడా అంతే వడ్డీ వస్తుంది. ఫిక్సెడ్‌ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఆదాయం రూ. 8,630 పై మూలంలో పన్ను కోత లేకపోయినా సంబంధిత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం పరిమితికి మించి ఉంటే మాత్రం కోత తప్పదు.

* ఫిక్సెడ్‌ డిపాజిట్‌ను ముందస్తుగా రద్దు చేసుకుంటే కొన్ని బ్యాంకులు వడ్డీ రేటులో 1 శాతం కోత విధిస్తున్నాయి. కొత్త విధానం అమలు నేపథ్యంలో స్వల్ప కాలిక మదుపునకు ఫిక్సెడ్‌ డిపాజిట్ల కంటే పొదుపు ఖాతాలే మరింత వెసులుబాటు, ప్రయోజనాన్ని కల్పించనున్నాయి.

* కొన్ని వాణిజ్య బ్యాంకులు వాటి పొదుపు ఖాతాల్లో ఉంచాల్సిన కనీస మొత్తాన్ని (మినిమమ్‌ బ్యాలెన్స్‌) గణనీయంగా తగ్గించాయి. తత్ఫలితంగా ఈ అకౌంట్ల ప్రారంభం, నిర్వహణ మరింత సులువుగా మారింది. చాలా బ్యాంకులు పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ కంటే ఎక్కువున్న మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఫిక్సెడ్‌ డిపాజిట్‌ ఖాతాకు తరలించే సౌకర్యాన్ని కల్పించాయి. దానివల్ల ఖాతాదారులకు అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉండే మదుపు మార్గాలను ఎంచుకునే అవకాశం కల్గింది. మార్చి 2009 నాటికి దేశంలో ఉన్న వివిధ వాణిజ్య బ్యాంకుల పొదుపు ఖాతాల్లో రూ. 8,74,539 కోట్లున్నాయి. ఈ మార్చి ఆఖరుకు ఇవి దాదాపు రూ. 11 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది.

పాత, కొత్త పద్ధతుల్లో ఒక ఖాతాదారుడికి వచ్చే వడ్డీ ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.

ప్రస్తుతం అమలులో ఉన్న పద్ధతిలో వడ్డీ ఇలా లెక్కిస్తారు.
జనవరి 10 వ తేదీ నుంచి ఆ నెల చివరి వరకూ ఉన్న కనిష్ఠ నిల్వ రూ. 1,000. కాబట్టి, జనవరి నెలకు ఆ వెయ్యి రూపాయల పైనే వడ్డీ లెక్కగడుతారు.

ఇ ఇదీ కొత్త పద్ధతి

నూతన విధానం ప్రకారం పొదుపు ఖాతాలో ఆ నెలలో ఉన్న మొత్తాలపై రోజువారీ వడ్డీ లెక్క కట్టడం జరుగుతుంది.
పాత పద్ధతి ప్రకారం వడ్డీ కేవలం రూ. 2.97 వచ్చింది. కొత్త విధానంలో ఏకంగా రూ. 256.70 వస్తుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇంత వ్యత్యాసం ఉండకపోవచ్చు. కొత్త విధానం మాత్రం పొదుపు ఖాతాదారులకు లాభదాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఖాతాలో ఉన్న నగదు నిల్వ, జమ, ఖర్చుల లావాదేవీలను బట్టి వడ్డీ ఆదాయం మారుతుంది.