Monday, March 15, 2010

కంపెనీలకు 10 ప్రమాణాలు

విడుదల చేసిన ఐసీఎస్‌ఐ
రెండింటికి కొత్త కంపెనీల బిల్లులో స్థానం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దేశంలోని అన్ని కంపెనీలు ఒకే విధమైన కార్పొరేట్‌ ప్రమాణాలు పాటించేందుకు అనువుగా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ), 10 సెక్రటేరియల్‌ ప్రమాణాలను విడుదల చేసింది. వీటిని అమలు చేయాల్సిందిగా మేం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నాం- అని ఐసీఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు వినాయక్‌ ఎస్‌. ఖన్వల్కర్‌ చెప్పారు. ప్రస్తుతానికి సాధారణ సమావేశం, బోర్డు సమావేశాలకు సంబంధించిన రెండు సెక్రటేరియల్‌ ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నూతన కంపెనీల బిల్లు-2009లో పొందుపరిచిందని ఆయన తెలిపారు. ఈ అంశాలపై ప్రస్తుత చట్టంలో స్పష్టత లేదని, కొత్తగా ప్రమాణాలు రూపొందించడం వల్ల స్పష్టత ఏర్పడుతోందని అన్నారు. ఇదేవిధంగా అన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు. కార్పొరేట్‌ ప్రపంచంలో చోటుచేసుకుంటున్న అనూహ్యమైన మార్పుల వల్ల కంపెనీ సెక్రటరీలకు విశేష ప్రాధాన్యం లభిస్తోందని, అంతేగాక కొత్త కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ సెక్రటరీల పాత్ర విస్తృత మవుతోందని అన్నారు. ఐసీఎస్‌ఐ విద్య నభ్యసించే వారి సంఖ్య గత మూడేళ్లుగా బాగా పెరుగుతోందని ఆయన వివరించారు.

రూ. 5 కోట్లతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌
ఐసీఎస్‌ఐ ప్రాంతీయ మండళ్లు, చాప్టర్లను బలోపేతం చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌'ను నిర్మించనున్నట్లు వినాయక్‌ ఎస్‌. ఖన్వల్కర్‌ చెప్పారు. ఉప్పల్‌లో 1.26 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీ కేటాయించిందని, ఈ స్ధలంలో రూ.5 కోట్లు వెచ్చించి ఈ సెంటర్‌ను నిర్మిస్తామని వివరించారు. ముంబయిలోని సెంటర్‌ ఫర్‌ కార్పొరేట్‌ గవర్నన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ తరహాలో హైదరాబాద్‌ కేంద్రం రూపుదిద్దుకుంటుందని తెలిపారు.

సత్యం కంపెనీ సెక్రటరీ తప్పు లేదు
సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌లో చోటుచేసుకున్న ఖాతాల కుంభకోణంలో కంపెనీ సెక్రటరీ పాత్రపై పరిశీలన జరిపామని, అందులో ఆయన పాత్ర ఏమీ లేదని తేటతెల్లం అయినట్లు వినాయక్‌ ఎస్‌. ఖన్వల్కర్‌ చెప్పారు. కంపెనీ సెక్రటరీ నుంచి వివరణ తీసుకున్నామని, ప్రాక్టీసింగ్‌ కంపెనీ సెక్రటరీ నుంచి నివేదిక అడిగామని, తప్పులేమీ మా దృష్టికి రాలేదని ఆయన వివరించారు. కానీ కంపెనీల శాఖ ఆధ్వర్యంలోని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ దర్యాప్తు బృందం ఈ కేసులో గుర్తించిన పదిమంది నిందితుల్లో సత్యం కంపెనీ సెక్రటరీ ఉండటం గమనార్హం. సత్యం సంఘటనను దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్‌ గవర్నెన్స్‌ కోర్సును ఐసీఎస్‌ఐ ప్రారంభించిందని ఖన్వల్కర్‌ చెప్పారు.