Monday, March 15, 2010

పల్లె పరిశ్రమలకు అధిక రాయితీలు

కొత్త పారిశ్రామిక విధానంలో ఎస్‌ఎంఈలకు ప్రాధాన్యం
మంత్రి డి.కె.అరుణ వెల్లడి
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న నూతన పారిశ్రామిక విధానం (2010-2015)లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వనున్నట్లు చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి డి.కె.అరుణ చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టదలచిన వారికి అధికంగా రాయితీలు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు ఆమె స్పష్టం చేశారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ సారథ్యంలో చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థలకు వృద్ధి అవకాశాలు' అనే అంశంపై శనివారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న పరిశ్రమలకు ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజి ఏర్పాటయితే నిధుల సమీకరణ సులువు కావచ్చని అభిప్రాయపడ్డారు. కంపెనీ సెక్రటరీలు మార్గదర్శకత్వాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తగిన మార్గదర్శకత్వం, సలహా సంప్రదింపు సేవలు లేక చిన్న, మధ్యతరహా సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని, వీటికి సేవలందించే అవకాశాన్ని కంపెనీ సెక్రటరీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఐసీఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు వినాయక్‌ ఎస్‌. ఖన్వల్కర్‌, దక్షిణ ప్రాంత కౌన్సిల్‌ ఛైర్మన్‌ పుట్టపర్తి జగన్నాధం, హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ రజనీష్‌ సి. పోపట్‌, మాజీ ఛైర్మన్‌ దాట్ల హనుమంత రాజు, సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యుడు సుధీర్‌ బాబు మాట్లాడారు. పలువురు కంపెనీ సెక్రటరీలు, విద్యార్థులు హాజరయ్యారు.