జూజూల ఇన్నింగ్స్ మళ్లీ మొదలైంది
ఐపీఎల్3 మ్యాచ్‌లు ప్రారంభం కావడంతోనే జూజూల హడావుడి కూడా మొదలైంది. 43 రోజులపాటు నరాలు తెగే ఉత్కంఠతో సాగే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆటవిడుపుగా వచ్చే జూజూల సందడిని కోట్లమంది వీక్షకులు ఆస్వాదించబోతున్నారు. టీవీలతో పాటు దేశవ్యాప్తంగా 1000 సినిమా హాళ్లు, యూట్యూబ్‌లోనూ ఈ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్నారు. దేశ, విదేశీ ఆటగాళ్ల విన్యాసాల మధ్యలో జూజూలు ఇవి ప్రత్యక్ష మవుతాయ్. కోడిగుడ్ల వంటి తలలు, ముద్దొచ్చే చిన్నపాటి రూపాలు 'జూజూ'లతో 29 విభిన్న ప్రచార చిత్రాలను రూపొందించింది వొడాఫోన్. గత ఏడాది ఐపీఎల్-2 ప్రత్యక్ష ప్రసారాల్లో జూజూలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈసారి ప్రచార చిత్రాల్లో జూజూలు అడవులు, ఎడారులు, సర్కస్‌లతో పాటు రోదసికి సైతం వెళ్తాయట! ఎస్సార్ వొడాఫోన్ బ్రాండ్‌ను వినియోగదారులకు మరింత దగ్గర చేయడంతో పాటు రింగ్‌టోన్లు, స్టాక్ మార్కెట్ ఎస్‌ఎంఎస్‌లు, బ్యూటీ టిప్స్ వంటి విలువ ఆధారిత సేవలను ప్రచారం చేసేందుకు జూజూలతో తీసిన చిత్రాలు ఉపయోగపడతాయని వీటి రూపకర్త, అగ్రశ్రేణి ప్రచారసంస్థ ఓగిల్వి&మాధుర్‌తో పాటు వొడాఫోన్ ఎస్సార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కుమార్ రామనాథన్ ఆశాభావంతో ఉన్నారు.