అధిక డిమాండ్, కరెంటు కోతలే కారణం
మరోపక్క ఈ వారంలో బస్తాకు రూ.25 వరకూ ధర పెంచేందుకు ఉత్పత్తిదార్లు సన్నాహాలు చేస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉందని, అదే సమయంలో కరెంటు కోత వల్ల భారీగా ఉత్పత్తి నష్టం జరుగుతూ ఉండటంతో రిటైల్ మార్కెట్లో ధర పెరిగిపోతోందని సిమెంటు కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంతేగాక ఈ వారంలో మరో విడత ధర పెంచేందుకు ఉత్పత్తిదార్లు సిద్ధమవుతున్నారని తెలిసింది. బస్తాకు రూ. 25 వరకూ పెంచే ఆలోచన ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. బొగ్గు ధర పెరగడం, ఇతరత్రా ఉత్పత్తి వ్యయాలు అధికం అయినందున ధర పెంచాల్సి వస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏడాది క్రితం సిమెంటు ఇదే ధర పలికింది. మళ్లీ ఇప్పుడు అక్కడికే చేరుకుంటోంది.
8% పెరిగిన అమ్మకాలు
సిమెంటు విక్రయాలు మనరాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా 13.71 మిలియన్ టన్నుల సిమెంటు విక్రయాలు నమోదయ్యాయి. ఈ అమ్మకాలు గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 8 శాతం అధికం. ఇదేవిధంగా సిమెంటు ఉత్పత్తి కూడా 9.5 శాతం పెరిగి 13.91 మిలియన్ టన్నులు అయింది. ఈ ఫిబ్రవరి నెలలో దాదాపుగా అన్ని ప్రముఖ సిమెంటు కంపెనీలు అధిక అమ్మకాలను నమోదు చేశాయని సీఎంఏ (సిమెంటు ఉత్పత్తిదార్ల సంఘం) వర్గాలు పేర్కొంటున్నాయి. అధిక డిమాండ్ వల్ల దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సిమెంటు ధర పెరుగుతున్నట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి.