మీడియా, వినోద రంగాలకు మంచిరోజులు
మీడియా, వినోద రంగాలకు మంచిరోజులు
2010పై ఫిక్కీ- కేపీఎంజీ నివేదిక
న్యూఢిల్లీ: రెండేళ్ల స్తబ్దత అనంతరం భారత సమాచార ప్రసార, వినోద (ఎం అండ్ ఈ) పరిశ్రమ ఈ సంవత్సరం పుంజుకోవడానికి సిద్ధంగా ఉందని ఒక నివేదిక పేర్కొంటోంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా కార్పొరేట్లు తమ ప్రకటనల బడ్జెట్లలో కోత పెట్టుకోవడంతో కంపెనీల నుంచి అందే ప్రకటనల మద్దతుపై న ఆధారపడ్డ మీడియా, వినోద పరిశ్రమ రెండు సంవత్సరాలుగా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నట్లు ఫిక్కీ- కేపీఎంజీ నివేదిక వివరించింది. గతేడాది ఎం అండ్ ఈ పరిశ్రమ 2008తో పోలిస్తే కేవలం 1.3 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. ఇపుడు ఆర్థిక వృద్ధి రేటు ఎగబాకుతుండడం, కార్మికులు, శ్రామికుల చేతిలో ఆడే డబ్బు, కొన్ని రకాల వస్తువులపై వారు వెచ్చిస్తున్న సొమ్ము పెరుగుతూ ఉండడం ఈ పరిశ్రమకు సానుకూల అంశాలు కానున్నాయంది. అదీ కాక అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త కొత్త పరికరాలను అందిస్తుండటం కూడా పరిశ్రమ స్థాయిని విస్తరించుకొనే అవకాశాల్ని కల్పిస్తున్నట్లు నివేదికలో తెలిపారు. డిజిటైజేషన్, స్పర్థ, నూతన ఆవిష్కరణలు, ప్రాంతీయ వ్యూహాలు, మార్కెటింగ్- పంపిణీ పరంగా మార్పులు వృద్ధికి బాట వేయవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లో 'ఫేస్‌బుక్' కేంద్రం
హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ 'ఫేస్‌బుక్' హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ప్రారంభించబోతోంది. పెరుగుతున్న వినియోగదార్లు, ప్రకటనకర్తలు, డెవలపర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. ఫేస్‌బుక్‌కు ఇటీవలి కాలంలో పెద్దఎత్తున వినియోగదార్లు పెరిగారు. మనదేశంలో 80 లక్షల మంది వినియోగదార్లు ఉన్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది దీన్లో నమోదై ఉన్నారు. ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు అయిన ఆర్కుట్, మైస్పేస్, ఫ్లికర్‌కు గట్టిపోటీ నిచ్చేదిగా ఫేస్‌బుక్ ఎదిగింది. హైదరాబాద్ కేంద్రంలో ఆన్‌లైన్ ప్రకటనల బృందం, డెవలపర్ సపోర్ట్ టీమ్ ఉంటాయని, అన్నివేళల్లో, అన్ని భాషలకు అనువైన ఆన్‌లైన్ సపోర్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదార్లకు ఈ కేంద్రం అందిస్తుందని 'ఫేస్‌బుక్' వివరించింది. కాలిఫోర్నియా, డుబ్లిన్, ఐర్లాండ్, ఆస్టిన్ నగరాల్లో ఇప్పటికే ఉన్న కేంద్రాలతో పాటు హైదరాబాద్ కేంద్రం సేవలు అందిస్తుందని పేర్కొంది. హైదరాబాద్ కేంద్రం కోసం అవసరమైన నిపుణుల ఎంపిక ఇప్పటికే ప్రారంభమైంది. తాము మెరుగైన సేవలు అందించడానికి ఈ కేంద్ర తోడ్పడుతుందని భావిస్తున్నట్లు ఫేస్‌బుక్ డైరెక్టర్ (గ్లోబల్ ఆన్‌లైన్ ఆపరేషన్స్) డాన్ ఫౌల్ అన్నారు.
రాష్ట్ర మార్కెట్లోకి త్వరలో నిస్సాన్ స్పోర్ట్స్ కారు
హైదరాబాద్, న్యూస్‌టుడే: ఆకర్షణీయంగా ఉండే 'నిస్సాన్ 370జడ్' కారును వినియోగదార్లకు పరిచయం చేసే ఉద్దేశంతో కంపెనీ దీన్ని డీలర్ల వద్ద ప్రదర్శనకు పెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కంపెనీ అధీకృత డీలర్ లక్ష్మీ నిస్సాన్ షోరూంలో 'నిస్సాన్ 370జడ్'ను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అమ్ముడైన స్పోర్ట్స్ కారు ఇదే. 1969లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 15 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. త్వరలో రాష్ట్ర మార్కెట్‌కు ఈ మోడల్ కారును అందించబోతున్నట్లు లక్ష్మీ నిస్సాన్ ప్రతినిధులు తెలిపారు.