మహీంద్రా సత్యంను వదిలేస్తున్న సీనియర్లు!
ఈనెలలో ఇప్పటికే 1500 మంది
9 నెలల్లో 12000 మంది బయటకు
కొత్త యాజమాన్యంతో ఇమడలేకే!
భవిష్యత్తుపై కొరవడిన భరోసా
వలస రేటు 16-18 శాతమే: కంపెనీ
కంపెనీకి నిపుణుల కొరత!
వీరి పరిస్థితి ఏమిటి?: సత్యంను గత ఏప్రిల్‌లో హస్తగతం చేసుకున్న తర్వాత ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధం చేయడానికి టెక్ మహీంద్రా యాజమాన్యం వర్చ్యువల్ పూల్ కార్యక్రమాన్ని ప్రకటించింది. పని లేకుండా ఖాళీగా ఉన్న (బెంచ్‌పైన ఉన్న) ఉద్యోగులను ఇందులో చేర్చింది. డిసెంబరు వరకు వారికి మూలవేతనం, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కల్పించింది. డిసెంబరు తర్వాత కూడా మూడు నెలల పాటు ఎటువంటి చెల్లింపులు లేకుండా కొనసాగడానికి వెసులుబాటు కల్పించింది. వీపీపీలో ఉన్న నిపుణుల్లో (ఇంజినీర్లు) దాదాపు 3,000 మందిని మళ్లీ కంపెనీలోకి తీసుకున్నామని కంపెనీ ప్రతినిధి 'న్యూస్‌టుడే'కు తెలిపారు. అయితే.. ఇంకా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం మార్చి తర్వాత ఇంటిదారి పట్టక తప్పదు.
కింది స్థాయి ఉద్యోగులతో పనులు!: వీపీపీలో దాదాపు 8000 మందిని చేర్చగా ఇందులో నిపుణులు (బిల్లబుల్) 6,000 మంది, నాన్ బిల్లబుల్ 2,000 మంది ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. నిపుణుల్లో 4,000 మంది కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నాన్‌బిల్లబుల్‌లో రవాణా, కార్పొరేట్ సర్వీసెస్, మానవ వనరులు, గ్రంథాలయ ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా ఎవరినీ మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోలేదు. అధిక శాతం మంది ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. మిగిలిన కొద్ది మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కంపెనీ ప్రతినిధి మాత్రం భవిష్యత్తులో వీరికే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇటీవల నియామకం చేసుకున్న ఉద్యోగార్ధులకు హైదరాబాద్‌లోని సత్యం టెక్నాలజీ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి గ్రంథాలయంలో కూడా తగిన సిబ్బంది లేరని, అన్ని పనులూ కింది స్థాయి ఉద్యోగులే చూసుకుంటున్నారని తెలుస్తోంది.