కార్మికులకూ, సంఘాలకూ వర్తింపు
రేపే ప్రభుత్వానికి నివేదిక
ఒత్తిడి నేపథ్యంలోనే సత్వర నివేదిక
రుణ మాఫీ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 312 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఎవరెవరికీ అమలు చేయాలనే విషయమై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘం గత నెల రెండో వారంలో ప్రజాప్రతినిధులు, సంఘాల నేతల అభిప్రాయాలను సేకరించింది. బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించి చర్చించింది. రుణ మాఫీని వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని ప్రభుత్వం భావించడంపై చేనేత వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయింది. ఇప్పటికే విపక్షాలు శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించడంతోపాటు ఆందోళన నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీన్ని పరిగణనలోనికి తీసుకొని ఉపసంఘం సత్వరమే నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత రుణ మాఫీని కార్మికులకే వర్తింపజేయాలని భావించినా, సంఘాల నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి రావడంతో సంఘాలను సైతం ఇందులో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. మంత్రుల ఆదేశాల మేరకు చేనేత శాఖ రుణ మాఫీ ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సోమవారం ఉపసంఘం సమావేశమై నివేదికను ఖరారు చేస్తుంది. అదే రోజు సాయంత్రం నివేదికను సీఎంకు అందజేస్తుంది.
తుది నిర్ణయం సీఎందే
మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సోమవారం అందాక అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి ఉపసంఘం సభ్యులతో పాటు ఆర్థిక, చేనేత శాఖల అధికారులతో రుణ మాఫీపై చర్చించనున్నారు. ఉపసంఘం నివేదిక ఎలా ఉన్నా తుది నిర్ణయం సీఎందేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 17న శాసనసభలో రుణమాఫీపై ప్రకటన చేస్తామని సీఎం శుక్రవారం ప్రకటించారు. అన్ని అంశాలు సానుకూలంగా ఉంటే రుణ మాఫీ ప్రకటన వెలువడే వీలుంది.
ఏ ఏ రుణాలు మాఫీ అవుతాయి?
* మొత్తం 1339 సంఘాలకు గాను ప్రస్తుతం 748 సంఘాలే పనిచేస్తున్నందున వాటికి మాత్రమే మాఫీని వర్తింపజేయడానికి నిర్ణయించారు. ఈ సంఘాలపై రూ. 117 కోట్ల అప్పు ఉంది. మాఫీ వల్ల 1,39,594 మంది సభ్యులు లబ్ధిపొందుతారు.
* సంఘాలకున్న రూ.27 కోట్ల ప్రభుత్వ రుణాలు రద్దవుతాయి.
* 45,183 మంది చేనేత కార్మికులకు వృత్తికార్డులపై ఉన్న రుణాలు రూ.77.34 కోట్లు
* 6,832 మందిపై ఉన్న పీఎంఆర్‌వై రుణాలు రూ. 29.10 కోట్లు
* రాజీవ్ యువశక్తి పథకం కింద 4,540 మందిపైనున్న రూ. 19.97 కోట్లు
ఈ జాబితా ప్రకారం మొత్తం రూ.271.33 కోట్ల రుణాలు లెక్కతేలినా లోన్‌బుక్ అడ్జస్ట్‌మెంట్ కింద రూ.27.89 కోట్లను మినహాయించి మొత్తం రూ.243.44 కోట్లను మాఫీ చేయాలని ఉపసంఘం ప్రతిపాదించనుంది. దీంతోపాటు ఆప్కోకి, పవర్‌లూమ్ కార్మికులపైనున్న రుణాలను మాఫీచేయాలని చేనేత శాఖ ప్రతిపాదించనుంది.