Monday, March 15, 2010

కొత్త 'అవతార్‌'

కొత్త 'అవతార్‌'
3డీ టెక్నాలజీతో రానున్న టీవీలు
పోటీకి సిద్ధమవుతున్న కంపెనీలు
ఆదరణ కష్టమే అంటున్న విశ్లేషకులు
నిన్నటి రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబయి ఇండియన్స్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ చూశారా.. రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ యూసుఫ్‌ పఠాన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ మిమ్మల్ని కట్టిపడేసింది కదూ! అతను సిక్సర్లు బాదుతుంటే.. గాల్లోకి లేచే బంతి.. ప్రేక్షకుల గ్యాలరీలో ఎటుపడుతుందో తెలియదు.. ప్రత్యక్షంగా మ్యాచ్‌ను తిలకించిన వారికే కాదు.. అలాంటి అనుభూతిని మీరూ సొంతం చేసుకోవచ్చు.. ఇంట్లో 3డీ టీవీ ఉంటే.. బ్యాట్స్‌మెన్‌ కొట్టే బంతి తమ మీదకే వస్తున్నట్లు భ్రమ కల్పించి, క్యాచ్‌ పట్టుకునేలా చేతులను ముందుకు చాచేలా చేయగల అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే 3డీ టీవీల గురించి చదవండి...
సాంకేతిక విప్లవం మానవ అభిరుచులను ఎప్పటికప్పుడు మార్చేస్తోంది. సాధారణ టీవీలను వదిలి ఇప్పుడిప్పుడే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, హెచ్‌డీ టీవీలకు మారుతున్న ప్రేక్షకులు ఇంకా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించక ముందే మార్కెట్లోకి 3డీ టీవీలు వచ్చేస్తున్నాయి. శామ్‌సంగ్‌ సంస్థ ఇప్పటికే ఈతరహా టీవీలను విదేశీ మార్కెట్లలో తీసుకురాగా, పోటీ సంస్థ సోనీ కార్పొరేషన్‌ తాజాగా జూన్‌-జులైలలో 3డీ టీవీలను మార్కెట్లో ఆవిష్కరించనుంది. పోటీ సంస్థలు ఎల్‌జీ, హెయిర్‌లు కూడా రానున్న కొన్ని వారాల్లోనే ఈ టీవీల విడుదలకు సిద్ధమవుతున్నాయి. టీవీ వీక్షకులను మరింత కనువిందు చేసేందుకు వివిధ ఎలక్ట్రానిక్‌ కంపెనీలన్నీ కొత్తగా ఈ 3డీ ఎత్తుగడను అందుకున్నాయి. అవతార్‌ వంటి గ్రాఫిక్‌ ఆధారిత సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో 3డీ తరహాలో గ్రాఫిక్‌ కార్యక్రమాలు వీక్షకులను మరింత అలరిస్తాయని తయారీ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో ఎక్కువ మొత్తంలో 3డీ ఉత్పత్తుల తయారీకి ఆయా సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఎలా పనిచేస్తుందంటే
3డీ టీవీలు స్టీరియోస్కోపిక్‌ విధానంలో పనిచేస్తాయి. దీంతో ఇవి మన సాధారణ టీవీల కన్నా విభిన్నమైన రీతిలో వీక్షకానుభూతిని అందిస్తాయి. అంటే ఒక సన్నివేశం ఉద్యానవనంలో జరగుతుంటే.. మనం కూడా అదే ఉద్యానవనంలో ఉండి నేరుగా ఆ సన్నివేశాన్ని చూస్తున్న అనుభూతిని టీవీ ప్రేక్షకునికి కలుగుతుందన్న మాట. ఈతరహా టెలివిజన్‌ సెట్లలో ప్రసారాలు మరింత కలర్‌ డెప్త్‌, షార్ప్‌నెస్‌తో చూపరులకు కనువిందు చేస్తాయి. అక్వేరియం సీన్‌లను గనుక చూస్తే మనం నీళ్లలో ఉన్నట్లు.. చేపలు మన ముఖంపైకి వస్తున్న అనుభూతి కలగుతుంది. ఇక సాకర్‌ ఆటగాళ్లు కొట్లే గోల్స్‌ను చూస్తే అయితే బాల్‌ మన ముఖానికి తాగుతుందనేలా ఈ టీవీలోబాల్‌ కనిపిస్తుంది. పాత 3డీ సాంకేతిక పరిజ్ఞానానికి మరిన్ని కొత్త హంగులు అద్దుతూ ఈ టీవీలను తయారు చేస్తున్నారు. దీంతో 1080పీ హెచ్‌డీ రిజల్యూషన్‌తో మరింత మెరుగ్గా 3డీ చిత్రాల్ని ఈ టీవిల్లో ఆస్వాదించవచ్చు. సాధారణ టీవీ ప్రసారాలను కూడా ఇదే టీవీలో వీక్షించే వెసులుబాటుతో పలు సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయి. దీనికి తోడు ఇంటర్‌నెట్‌, ల్యాన్‌లను కనెక్ట్‌ చేసుకొనే సౌకర్యము ఇందులో ఉంది. ఈసౌలభ్యంతో రియల్‌ టైమ్‌ ఇంటర్‌నెట్‌ను, యు-ట్యూబ్‌ క్లిప్పింగ్‌లను ఆస్వాధించ వచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌ తదితర ఆఫీసు అవసరాలకు దీనిని వాడుకొనే వీలుంటుంది.

మరో చరిత్ర సృష్టించనున్నాయా?
సోనీ, శామ్‌సంగ్‌, పానసానిక్‌, తోషిబా, విజియో వంటి కంపెనీలు వినూత్నమైన 3డీ టీవీ సెట్లను మార్కెట్లలోకి తెచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే ఇవి భారత్‌లో ఇపుడపుడే రాణించే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీవీ సెట్లు అధికంగా సామాన్యునికి చేరువైన నేపథ్యంలో మార్కెట్‌ను విస్తృతపరుచుకొనేందుకు ఆయా సంస్థలు కొత్తకొత్త టెక్నాలజీలతో టీవీలను మార్కెట్లోకి తెస్తున్నాయన్నది వారి వాదన. అయితే వీటికి అవసరమైన కార్యక్రమాలు, ప్రసారాలు (కంటెంట్‌) కూడా 3డీ రూపంలోనే సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ తరహా టీవీలు ఇప్పుడే ఆదరణ అందిపుచ్చుకొనే అవకాశం లేదని వారు అంటున్నారు. ప్రసారాలకు అవసరమైన కంటెంట్‌ను 3డీ రూపంలో చిత్రీకరించడం, అనువదించడం, 3డీ లో రికార్డింగ్‌, ట్రాకింగ్‌, ప్రసారాలు చేయాల్సి ఉంటుందనీ, ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పనిని విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కువ వ్యయంతో కూడుకున్న ఈ ప్రక్రియ కోసం ప్రసార సంస్థలు, ప్రోడక్షన్‌ సంస్థలు ఇప్పుడే ముందుకు రాకపోవచ్చన్నది వారి వాదన. అదీ కాకుండా 3డీ కళ్లజోళ్లు, టీవీల్లో తయారీ సంస్థలు వాడుతున్న విభిన్న టెక్నాలజీల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఏకరూపత రావాల్సి ఉంది. అయితే అప్పటి వరకు ఈ టీవీలు సక్సెస్‌ సాధించడం కష్టమే. అయితే ఈఎస్‌పీఎన్‌, ఫాక్స్‌ స్పోర్ట్స్‌ వంటి రెండు మూడు సంస్థలు 3డీ టీవీల కోసం ప్రత్యేకంగా ఛానెళ్లను తెచ్చేందుకు సిద్ధమవుతుండడం ఒక శుభ పరిణామం. ఈ ప్రక్రియ సామాన్యున్ని చేరేందుకు కొంత సమయం పడుతుందన్నది నిజమే అయినప్పటికీ.. ప్రేక్షకులకు ఇంట్లో కనువిందు చేసేందుకు మరో కొత్తరకం సాంకేతిక పరిజ్ఞానం మాత్రం ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిందన్నది విషయం వాస్తవం, ప్రశంసనీయం.

సమస్యలు ఇవి..
* 3డీ టీవీ చూసేందుకు కళ్లజోళ్లు తప్పనిసరి కావడంకొంత ఇబ్బందికర అంశం. ఇంట్లో బంధువుల ఇతరులతో కలిసి ఏక కాలంలో టీవీ కార్యక్రమాలను ఆస్వాదించలేం.

* వీటి ధర ప్రపంచ మార్కెట్లలోనే సుమారు రూ.లక్షన్నర నుంచి రూ.3.5 లక్షల వరకు పలుకనున్నట్లు సమాచారం. ఖరీదు కూడా ఎక్కువ కావడంతో వీటిని అధిక సంఖ్యలో కొనలేం.

* కంటి చూపులో లోపాలు ఉన్నవారికి ఈ టీవీలు పనికి రావు.
* కంటెంట్‌ సిద్ధంగా లేకపోవడం మరో ప్రతికూల అంశం.