సీఐఐ-ఏపీకి శక్తిసాగర్ సారథ్యం
సవాళ్ల మధ్య
హరీష్‌చంద్ర ప్రసాద్ పదవీ కాలం పూర్తి
హైదరాబాద్, న్యూస్‌టుడే: భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ విభాగం (సీఐఐ-ఏపీ) సారథ్య బాధ్యతలను శక్తిసాగర్ చేపట్టబోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సేవల కంపెనీ ఏడీపీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సీఐఐ-ఏపీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనను లాంఛనప్రాయంగా ఛైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఈ పదవీ కాలం ఒక ఏడాది ఉంటుంది. గత ఏడాది కాలంగా ఛైర్మన్‌గా ఉన్న వై. హరీష్‌చంద్ర ప్రసాద్ అత్యంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య తన పదవీ కాలాన్ని పూర్తిచేశారు. గత ఏడాది మార్చి 13న హరీష్‌చంద్ర ప్రసాద్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ రాష్ట్రంలో ఏదో ఒక ప్రధాన సమస్య ఉత్పన్నమై పారిశ్రామిక రంగానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం ప్రభావం అప్పట్లో ఎంతో ఎక్కువగా ఉంది. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు జరగడం, ఆ తర్వాత రాష్ట్రంలో కరవు పరిస్థితులు, కొద్దికాలానికే వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం, కృష్ణా నది వరదలు... ఇలా ఒకదాని వెంట మరొకటిగా సమస్యలు తలెత్తాయి. ఈ పరిణామాల ప్రభావం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై బలంగా పడింది. కేజీ బేసిన్ గ్యాస్ అంశం నుంచి ప్రస్తుతం ఎదురైన విద్యుత్తు కోత వరకూ పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి, పరిశ్రమ అభిప్రాయాలను ప్రతిబింబించడానికి సీఐఐ-ఏపీ ఈ ఏడాది కాలంలో ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భాగస్వామ్య సదస్సును రాష్ట్రానికి తెప్పించడంలో సీఐఐ-ఏపీ విజయం సాధించినప్పటికీ, అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా చెన్నైకి తరలివెళ్లిపోయింది. దీనికి బదులుగా పట్టుబట్టి 'ప్రపంచ పెట్టుబడుల సదస్సు'ను సీఐఐ-ఏపీ సంపాదించింది. ఈ సదస్సు ఈ ఏడాది అక్టోబరులో హైదరాబాద్‌లో జరగనుంది. సీఐఐ సభ్యత్వాన్ని పెంపొందించడానికి, విస్తృత ప్రాతిపదికన దీని నిర్మాణం ఉండటానికి ఈ ఏడాది కాలంలో తాను కృషి చేశానని ఈ సందర్భంగా హరీష్ చంద్ర ప్రసాద్ 'న్యూస్‌టుడే'కు చెప్పారు. సీఐఐపై 'బిగ్ బాయ్స్ క్లబ్' అనే విమర్శ ఉంది. దీని నుంచి బయటపడటానికి చిన్న, మధ్యస్థాయి పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేశారు. జోనల్ స్థాయిలో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, వరంగల్ తదితర ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి ఆయా ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉన్న పారిశ్రామిక అనుకూల, అననుకూల విధానాలపై చర్చాగోష్ఠులు నిర్వహించారు. ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొనేందుకు సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ సమావేశంలో ఛైర్మన్‌గా శక్తిసాగర్ ఎంపిక లాంఛన ప్రాయమే కాగా, వైస్-ఛైర్మన్ ఎన్నికే ముఖ్యమైన అంశంగా ఉంది. ఈసారి ఎవరిని ఎన్నుకుంటారనే అంశంలో సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. మరోపక్క సీఐఐ- దక్షిణ ప్రాంతానికి రాష్ట్రానికే చెందిన బి.వి.ఆర్.మోహన్ రెడ్డి ఛైర్మన్‌గా పనిచేశారు. గతంలో ఆయన సీఐఐ-ఏపీ ఛైర్మన్‌గా పనిచేసి, తదుపరి సదరన్ రీజియన్‌కు వెళ్లారు. ఇదే విధంగా వై. హరీష్ చంద్ర ప్రసాద్ కూడా సదరన్ రీజియన్‌లో ఏదో ఒక కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.