Friday, March 19, 2010

3జీ బరిలో భారతీ, ఆర్‌కామ్‌, వొడాఫోన్‌లు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 22 సర్కిళ్లలో 3జీ మొబైల్‌ స్పెక్ట్రమ్‌ కోసం భారతీ ఎయిర్‌టెల్‌ దరఖాస్తు చేసింది. కంపెనీ ప్రతినిధి ఈ విషయాన్ని ఒక వార్తాసంస్థ ప్రతినిధికి తెలిపారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌), వొడాఫోన్‌-ఎస్సార్‌లు కూడా దాదాపు 22 సర్కిళ్లకు దరఖాస్తులు పెట్టినట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. 3జీ దరఖాస్తుల సమర్పణ గడువు నేటితో ముగియనుంది. ఎయిర్‌సెల్‌ కూడా 3జీకి శుక్రవారం దరఖాస్తు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 5వ, 6వ తేదీల్లో మాక్‌ ఆక్షన్‌ను, అదే నెల 9న సిసలైన వేలంపాటను నిర్వహించనున్నారు. యావద్దేశ (ప్యాన్‌-ఇండియా) స్పెక్ట్రమ్‌కు రిజర్వ్‌ ధరను రూ.3,500 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. వేలంలో విజేతలైన కంపెనీలను వాణిజ్య ప్రాతిపదికన 3జీ సేవలను అందించేందుకు సెప్టెంబరు 1 నుంచి అనుమతిస్తారు.

టీటీఎంఎల్‌ కూడా..
ముంబయి: టాటా టెలిసర్వీసెస్‌ మహారాష్ట్ర (టీటీఎంఎల్‌) తన టవర్ల వ్యాపారాన్ని విక్రయించగా వచ్చే డబ్బును రుణాల తిరిగి చెల్లింపుతో పాటు జీఎస్‌ఎమ్‌ సేవల విస్తరణకు, 3జీ వేలంలో పాల్గొనేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. 'మాకు రూ.3,400 కోట్లు అప్పు ఉంది' అని టాటా గ్రూపు కంపెనీ అయిన టీటీఎంఎల్‌ ఎండీ ముకుంద్‌ రాజన్‌ గురువారం ఒక వార్తాసంస్థ ప్రతినిధితో అన్నారు. టీటీఎంఎల్‌ తన టవర్ల వ్యాపారాన్ని బుధవారం రూ.1,318 కోట్లకు క్విపో-డబ్ల్యూటీటీఐఎల్‌కు అమ్మివేసింది.