సెబీ వాదనతో ఏకీభవించలేం
యూలిప్‌లపై ఐఆర్‌డీఏ అభిప్రాయం
న్యూఢిల్లీ: యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యూలిప్)ల నియంత్రణ అధికారం సెబీ, 'ఐఆర్‌డీఏ'లలో ఎవరికి చెందుతుందన్న అంశం వాగ్యుద్ధానికి దారితీస్తోంది.. క్రమాదాయ (రెగ్యులర్ ఇన్‌కమ్) లేదా పింఛన్ ప్లాన్‌లకు ఒక ప్రత్యామ్నాయంగానే యూలిప్‌లను బలవంతంగా కొనుగోలు చేయించేందుకు (హార్డ్‌సెల్లింగ్) యత్నిస్తున్నట్లు సెబీ దృష్టికి ఐఆర్‌డీఏ తీసుకువచ్చింది. విశ్రాంత జీవనంలో రెగ్యులర్ ఇన్‌కమ్/ పెన్షన్ ఏర్పాట్లు చేసుకోకపోయినట్లయితే అలాంటివారు యూలిప్ పథకాలపై మొగ్గు చూపవచ్చని బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏ పేర్కొంది. గురువారమిక్కడ ఐఆర్‌డీఏ ఒక ప్రకటనను వెలువరిస్తూ యూలిప్‌లు ఇచ్చే ప్రయోజనాలను, వాటిలో ఇమిడి ఉన్న నష్టభయాలను ఏకరవు పెట్టింది. జీవిత బీమా కంపెనీలు విక్రయించే బీమా పథకాలే యూలిప్‌లు. యూలిప్ పథకాలను అమ్మజూపే కన్నా ముందు సెబీ ఆమోదాన్ని ఎందుకు తీసుకోవడం లేదని వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు సెబీ ఇదివరకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఐఆర్‌డీఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సెక్యూరిటీల మార్కెట్‌కు సంబంధించిన ఎలాంటి పెట్టుబడులకు అయినా సెబీ ఆమోదం అవసరమని నిర్దేశిస్తున్న సెబీ చట్టం బీమాకు వర్తించదు అన్నది ఐఆర్‌డీఏ వాదన.