రూ.46 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయ్
రూ.46 వేల కోట్ల పెట్టుబడులొచ్చాయ్
తమిళనాడు సీఎం కరుణానిధి వెల్లడి
నిస్సాన్ కార్ల తయారీ పరిశ్రమ ప్రారంభం
కాంచీపురం, న్యూస్‌టుడే: తమిళనాడులో 37 పారిశ్రామిక సంస్థల ద్వారా రూ.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి వెల్లడించారు. తద్వారా 2.2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికిందని తెలిపారు. కాంచీపురం జిల్లా ఒరగడం సిప్కాట్ ఇండస్ట్రియల్ పార్కులో కొత్తగా నిర్మించిన రేనాల్ట్-నిస్సాన్ సంయుక్త కార్ల తయారీ ప్లాంటు ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. 990 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4650 కోట్లు) వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంటును ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించగా, కొత్తగా తయారైన నిస్సాన్ కార్లను ముఖ్యమంత్రి కరుణానిధి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనేక వసతులు కల్పిస్తున్నందున రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మొత్తం 25 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, మరో 12 సంస్థలకు అనుమతిచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జపాన్ మాజీ ప్రధాని యోషిరోమోరీ, రేనాల్ట్-నిస్సాన్ ఛైర్మన్-సీఈవో కార్లోస్ గోష్న్ తదితరులు పాల్గొన్నారు.