Friday, March 19, 2010

ఈ ఏడాదీ 50 కొత్త ఫోన్లు

ఈ ఏడాదీ 50 కొత్త ఫోన్లు
టచ్‌స్క్రీన్‌, డ్యూయల్‌ సిమ్‌ మొబైళ్లపై దృష్టి
రెండు డ్యూయల్‌ ఫోన్ల విడుదల
విపణిలో మరో 8-10% వాటా లక్ష్యం
శామ్‌సంగ్‌ డైరెక్టర్‌ రంజిత్‌ యాదవ్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఇప్పటికే టచ్‌స్క్రీన్‌ మొబైల్‌ ఫోన్‌ల విపణిలో అగ్రగామిగా ఉన్న శామ్‌సంగ్‌ ఈ ఏడాది ఈ విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోనుంది. డ్యూయల్‌ సిమ్‌ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ విభాగంలో కూడా విస్తరించనుంది. యువత, వ్యాపార వర్గాలు మొదలైన వారి అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం కంపెనీ 20 టచ్‌స్క్రీన్‌ మొబైల్‌ ఫోన్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 6 కొత్త మోడళ్లను విడుదల చేసింది. కంపెనీ విక్రయిస్తున్న మొత్తం ఫోన్లలో టచ్‌స్క్రీన్‌ ఫోన్ల అమ్మకాల వాటా 14 శాతం ఉందని శామ్‌సంగ్‌ ఇండియా డైరెక్టర్‌ (మొబైల్‌, ఐటీ) రంజిత్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఏడాది కంపెనీ మొబైల్‌ అమ్మకాల్లో డ్యూయల్‌ సిమ్‌ హ్యాండ్‌సెట్ల అమ్మకాలను 15 శాతానికి పెంచుకోనున్నట్లు చెప్పారు. ఇప్పటికే నాలుగు డ్యూయల్‌ సిమ్‌ మోడళ్లను విక్రయిస్తున్న కంపెనీ తాజాగా రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన సందర్భంగా యాదవ్‌ మాట్లాడారు. కొత్తగా విడుదల చేసిన బి-5722 రకం (జీఎస్‌ఎం+జీఎస్‌ఎం) ధర రూ.10,650 కాగా.. 'డ్యూస్‌ 259' మోడల్‌ (జీఎస్‌ఎం+సీడీఎంఏ) ఖరీదు రూ.7,799. గత ఏడాది మొత్తం 50 మోడళ్లను విడుదల చేసిన కంపెనీ 2010లో కూడా అంతకు తక్కువ కాకుండా కొత్త మొబైళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విలువ పరంగా దేశీయ మొబైల్‌ విపణిలో శామ్‌సంగ్‌కు దాదాపు 20 శాతం వాటా ఉంది. దీన్ని ఈ ఏడాది 30 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది. సంఖ్య పరంగా (యూనిట్లు) కూడా వాటా 15.7 శాతం నుంచి 22-23 శాతానికి చేరగలదని కంపెనీ అంచనా వేస్తోంది. 3జీ సేవలకు అనుగుణంగా ఇప్పటికే కంపెనీకి చెందిన 10 మోడళ్లు అందుబాటులో ఉన్నాయని యాదవ్‌ తెలిపారు.

సొంత ఓఎస్‌తో ఫోన్లు
సొంతగా అభివృద్ధి చేసిన ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) 'బాడా'తో త్వరలో ఫోన్లను ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు విండోస్‌, ఆండ్రాయిడ్‌, సింబియన్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థల ఆధారిత ఫోన్లు కూడా లభిస్తాయి. యువత ఎక్కువగా అప్లికేషన్లను వినియోగిస్తున్నందున మెసేజింగ్‌, పర్సనల్‌ ఫైనాన్స్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌ వంటి జావా ఆధారిత 40 అప్లికేషన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌ శామ్‌సంగ్‌ ఫన్‌ క్లబ్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.