Friday, March 19, 2010

కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌లో 49% వాటా విక్రయం

గాయత్రి ప్రాజెక్ట్స్ ఎండి సందీప్‌రెడ్డి

నెలాఖరు నాటికి రుణ ఒప్పందాలు ఖరారు
మరో 5,000 కోట్ల రోడ్లు ప్రాజెక్టులకు బిడ్డు

హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ తన పవర్ యూనిట్‌లో వాటాను విక్రయించటానికి సిద్దమవుతోంది. కృష్ణపట్నం సమీపంలో నిర్మిస్తున్న 1320 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో 49 శాతం వాటాను రానున్న రెండు నెలల కాలంలో వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించాలన్న యోచనలో ఉన్నట్లు గాయత్రీ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ టివి సందీప్ రెడ్డి తెలిపారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని కంపెనీలతో చర్చలు సాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కంపెనీల వివరాలు వెల్లడించటానికి నిరాకరించారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కృష్ణపట్నం సమీపంలో గాయత్రి ప్రాజెక్ట్స్ అనుబంధ సంస్థ గాయత్రీ ఎనర్జీ వెంచర్స్ 1320 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది.

సుమారు 1,600 కోట్ల రూపాయల ఈక్విటీ కాంపోనెంట్ గల ఈ పవర్ ప్రాజెక్టులో 49 శాతం వాటా ను కంపెనీ విక్ర యించనుంది. 1,400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజె క్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులతో పాటు బొగ్గు దిగుమతికి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫైనాన్షియల్ క్లోజర్ త్వరలోనే పూర్తికానుందని, అలాగే రుణ సమీకరణకు సంబంధించి ఒప్పందాలు కూడా ఈ నెలాఖరు కల్లా ఖరారు కావచ్చని సందీప్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి కానున్న 70 శాతం విద్యుత్‌ను దీర్ఘకాలిక కాంట్రాక్టులకు విక్రయించటంతో పాటు మిగిలిన మొత్తాన్ని మర్చంట్ మార్కెట్ ద్వారా అమ్మకాలు చేయవచ్చని కంపెనీ భావిస్తోంది. మూడేళ్లలో కంపెనీ ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సందీప్ రెడ్డి వెల్లడించారు.

ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు
జూన్ నాటికి కనీసం 5,000 కోట్ల రూపాయల విలువగల రోడ్డు ప్రాజెక్టులకు బిడ్‌లను దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో 2,300 కోట్ల రూపాయల విలువైన రోడ్ ప్రాజెక్టులున్నాయి.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఎఐ)కు చెందిన 50 ప్రాజెక్టులకు కంపెనీ అర్హత సాధించినట్లు తెలిపారు. దీంతోపాటుగా మరో రెండు, మూడు ప్రాజెక్టులకు కూడా బిడ్డింగ్ వేయటానికి సమాయత్తమవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ 6,000 కోట్ల రూపాయలుగా ఉంది.

ఎన్‌హెచ్ఎఐ నుంచి మరో 2,000 కోట్ల రూపాయల ఆర్డర్లను చేజికి ్కంచుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి కంపెనీ 1,300 కోట్ల రూపాయల ఆదాయాలను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో గాయత్రి ప్రాజెక్ట్స్ టర్నోవర్ 1,800 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సందీప్ రెడ్డి తెలిపారు.