7,100 కోట్ల రూపాయల విలువ గల ఆర్థిక కుంభకోణంపై దర్యాప్తునకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఆ కేసుతో సంబంధం ఉన్న అందరినీ విచారించాలని భావిస్తోంది. కాని కేసులో ప్రధాన నిందితుడైన రామలింగరాజు నిమ్స్‌లో హెపటైటిస్-సికి చికిత్స చేయించుకుంటున్నందు వల్ల విచారణకు హాజరు కావడంలేదు. రాజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ప్రత్యేక న్యాయమూర్తి బివిఎల్ఎన్ చక్రవర్తి గురువారం ప్రశ్నించగా తాజా స్థితిపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని రాజు తరఫు న్యాయవాది తెలిపారు.
దీంతో వెంటనే స్పందించిన ప్రత్యేక న్యాయమూర్తి ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో అయినా రాజును కోర్టు ముందు హాజరు పరిచేందుకు ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అన్న విషయం తెలియచేస్తూ తాజా నివేదిక ఇవ్వాలని నిమ్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ కేసులో ఇతర నిందితులు పది మంది జుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ కేసు విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.
విచారణ జాప్యం చేయడానికే నిమ్స్ వైద్యులు రామలింగరాజు చికిత్సను పొడిగిస్తూ వస్తున్నారని ఈ కేసును విచారిస్తున్న సిబిఐ ఇప్పటికే కోర్టుకు నివేదించింది. ఔట్ పేషెంట్‌గా రాజుకు చికిత్స చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నదని, ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటుందని గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెడ్ డాక్టర్ అజిత్ కుమార్ గత వారం కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలియచేశారు. రాజుకు మరో నాలుగు నుంచి ఆరు వారాల పాటు ఇన్‌పేషెంట్‌గానే చికిత్స చేయాల్సిఉంటుందని కూడా ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా సత్యం కేసులో నిందితులు నలుగురిని విచారించడానికి అనుమతి కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి మార్చి 26 లోగా కౌంటర్లేవైనా ఉంటే దాఖలు చేయవచ్చునని పిటిషనర్‌ను ఆదేశించారు.
కె.సురేందర్‌ను సీనియర్ స్పెషల్ కౌన్సిల్‌గాను, ఇ.శ్రీనివాసరెడ్డి, కె.వేణుమాధవ్‌లను జూనియర్ స్పెషల్ కౌన్సిల్స్‌గాను తమ తరఫున నియమించినట్టు తెలియచేస్తూ సిబిఐ మరో మెమోరాండం అందచేసింది. తమ ఖాతాలపై స్తంభనను తొలగించాలని కోరుతూ నిందితుల్లో కొందరి కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న పిటిషన్ల విచారణను కూడా 26వ తేదీకి వాయిదా వేశారు.
ఇద్దరు పిడబ్ల్యుసి ఆడిటర్ల ప్రాక్టీస్‌పై నిషేధం
సత్యం కుంభకోణంతో సంబంధం కలిగిన ఇద్దరు ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ ఆడిటర్ల ప్రాక్టీస్‌ను అమెరికన్ ఆడిటింగ్ పర్యవేక్షణ ఏజెన్సీ నిషేధించింది. పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ ఓవర్‌సైట్ బోర్డ్ (పిసిఏఓబి) ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ శివప్రసాద్ పులవర్తి, చింతపట్ల రవీంద్రనాథ్‌ల ప్రాక్టీస్‌పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది.
కుంభకోణంపై తాము జరుపుతున్న దర్యాప్తులో ఈ ఆడిటర్లు సహకరించడంలేదని బోర్డు తన ఆదేశంలో స్పష్టం చేసింది. సత్యం కుంభకోణం జరిగిన సమయంలో వీరిద్దరూ పిడబ్ల్యుసి అనుబంధ కంపెనీ లవ్‌లాక్ అండ్ లూయిస్‌లో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గాను, క్లయింట్ రిలేషన్‌షిప్ మేనేజర్‌గాను పని చేశారు.
2004-05 నుంచి 2007-08 సంవత్సరాల మధ్య నాలుగు సంవత్సరాలు లవ్‌లాక్ అండ్ లూయిస్ సత్యం ఖాతాల ఆడిటింగ్ నిర్వహించింది. ఆ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పని చేసిన ఆ ఇద్దరూ సత్యం నగదు ఖాతాలు, కంపెనీకి వస్తున్న ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ఖాతాలు పరిశీలించే వారు. 2010 జనవరిలో వీరిద్దరూ రాజీనామా చేశారు.
Friday, March 19, 2010
'సత్యం' రాజు ఆరోగ్యంపై తాజా నివేదిక నిమ్స్‌కు ప్రత్యేక కోర్టు ఆదేశం
హైదరాబాద్ : వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి సూత్రధారి అయిన సత్యం రామలింగరాజు కేసు విచారణకు అనారోగ్య కారణాలపై గైర్‌హాజరవుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై తాజా నివేదిక అందించాలని ఆ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అసలు ఆయన కోర్టు ముందు హాజరయ్యేందుకు ఆరోగ్యం సహకరిస్తుందా లేదా తేల్చి చెప్పాలని సూచించింది.