Friday, March 19, 2010

ఏ జిల్లా ఎక్కడ?

వివిధ రంగాలపై సర్కారు గణాంకాలు
ఎమ్మెల్యేలకు సంకలనం ప్రతుల అందజేత
హైదరాబాద్‌, న్యూస్‌టుడే
రాష్ట్రానికి ఇప్పుడు అంకెల జ్వరం పట్టుకుంది. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఏర్పాటయిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి సమగ్ర వివరాల్ని అందజేయాలన్న తలంపుతో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు గణాంకాల్ని తవ్వితీసే పనిలో పడ్డాయి. జిల్లాల్లో వివిధ రంగాల ముఖ చిత్రాల్ని గణాంకాల ద్వారా తెలుసుకోవడానికి ఉత్సుకత కనబరుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో... రాష్ట్ర ప్రభుత్వం తాజా వివరాలతో గణాంకాల సంకలనాన్ని గురువారం శాసన సభ్యులకు అందజేసింది. 'స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌-2009' పేరుతో రాష్ట్ర అర్థ, గణాంక విభాగం ఈ సంకలనాన్ని రూపొందించింది. ఏయే రంగాల్లో ఏ జిల్లా ఏ స్థానంలో ఉన్నదీ దీని ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లాంటివి ఏ జిల్లాలో ఎన్నేసి ఉన్నదీ ఇందులో పొందుపరిచారు. నీటిపారుదల, పశుపోషణ, అడవులు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, పోలీస్‌, పర్యాటకం, రవాణా, బ్యాంకులు, ధరలు వంటి వాటితో పాటు రాష్ట్ర ఆర్థిక రంగంపై విశ్లేషణలూ ఇందులో చూడొచ్చు. అందులో పొందుపరచిన గణాంకాల ప్రకారం.. 2008-09లో కొన్ని ముఖ్యమైన రంగాల పరిస్థితి ఇలా ఉంది...
వరిలో కోస్తా.. చెరకులో తెలంగాణ

* వరి విషయంలో కోస్తాలో సాగు విస్తీర్ణం, ఉత్పాదకత(దిగుబడి) రెండూ ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో తెలంగాణ ప్రాంతం కోస్తాకు కొంత దగ్గరగా ఉండగా... రాయలసీమ మరింత వెనుకబడి ఉంది.

* జొన్నసాగు విస్తీర్ణంలో ముందంజలో ఉన్న తెలంగాణలో పంట దిగుబడిలో బాగా వెనుకబడి ఉంది. ఇందులో కోస్తా ముందంజలో ఉండగా రాయలసీమలో దిగుబడి తెలంగాణ కంటే రెట్టింపు స్థాయిలో ఉంది. మొక్కజొన్న ఉత్పాదకతలోనూ ఇదే పరిస్థితి. కంది సాగు, ఉత్పత్తిలోనూ తెలంగాణదే అగ్రస్థానం.

* తెలంగాణలో చెరకు సాగు విస్తీర్ణం కోస్తా కంటే తక్కువగా ఉన్నా దిగుబడి విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. విస్తీర్ణం తక్కువగా ఉన్న రాయలసీమలో దిగుబడి రెండు ప్రాంతాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం

* వేరుసెనగ సాగు విస్తీర్ణంలో తెలంగాణ, కోస్తా ప్రాంతాలు రాయలసీమకు దరిదాపుల్లో కూడా లేవు. దిగుబడులు తెలంగాణ, కోస్తాలలోనే అధికం.

మెదక్‌లో విద్యుత్‌ వినియోగం ఎక్కువ

జిల్లాల వారీగా తలసరి విద్యుత్‌ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌జిల్లాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. శ్రీకాకుళం చిట్టచివరన ఉంది. మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో తలసరి వినియోగం పెరగడానికి కారణం.. అక్కడ సాగునీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడటంతో పాటు పారిశ్రామిక వినియోగం ఎక్కువగా ఉంది. గృహ వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మహబూబ్‌నగర్‌ జిల్లాది అట్టడుగున స్థానం కావడమే ఇందుకు నిదర్శనం. నల్గొండ జిల్లాదీ ఇదే పరిస్థితి.

* రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో సాగునీటి కోసం బోర్లపై ఆధారపడటంతో తలసరి వినియోగం ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ వినియోగంలో నిజామాబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలోఉంది. ఆ తర్వాత నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కడప, అనంతపురం జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ను మినహాయిస్తే వ్యవసాయ వినియోగం అతి తక్కువుంది విశాఖ జిల్లా. విశాఖ కంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వినియోగం ఎక్కువగా ఉంది.

సాగులో ప.గోదావరి ప్రథమ.. కరీంనగర్‌ ద్వితీయ

* రాష్ట్రంలో ఆయకట్టు సాగులో పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా... కరీంనగర్‌ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా ఆఖరుస్థానం దక్కించుకొంది.

* చెరువులు, కాలువలు, బావులు, ఇతర వనరుల కింద పశ్చిమ గోదావరి జిల్లాలో 6,49,663 హెక్టార్లలో సాగు కాగా, కరీంనగర్‌ జిల్లాలో 5,73,255 హెక్టార్లు, రంగారెడ్డి జిల్లాలో 73,733 హెక్టార్లు సాగైంది.

* నీటి వనరుల కింద 3 లక్షల హెక్టార్లకు మించి సాగైన జిల్లాల్లో పశ్చిమ గోదావరి, కరీంనగర్‌ తర్వాత గుంటూరు(5,16,168), తూర్పు గోదావరి (5,03,128) కృష్ణా (4,88,429), వరంగల్‌ (4,44,945), నల్గొండ (4,35,530), నిజామాబాద్‌ (3,30,121) నెల్లూరు(3,26,383) జిల్లాలున్నాయి.

* దిగువ నుంచి వరుసగా రంగారెడ్డి తర్వాత అదిలాబాద్‌, విశాఖపట్నం, అనంతపురం, విజయనగరం, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, మెదక్‌, ప్రకాశం, కర్నూలు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలున్నాయి.

పడకల్లో హైదరాబాద్‌..
పీహెచ్‌సీల్లో చిత్తూరు టాప్‌
రుగుపొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో వైద్య రంగంలో ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవు. జిల్లాల వారీగా పరిస్థితిని విశ్లేషిస్తే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

* ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య ప్రకారం హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. రెండు మూడు స్థానాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. చివరి మూడు స్థానాల్లో విజయనగరం, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలున్నాయి.

* ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఆధారంగా మొదటి మూడు స్థానాల్లో... చిత్తూరు, మహబూబ్‌నగర్‌, తూర్పుగోదావరి ఉన్నాయి. రంగారెడ్డి, నిజామాబాద్‌, విజయనగరంలు- చివరి 3 స్థానాల్లో ఉన్నాయి.

* శాశ్వత వైద్యుల పరంగా... నిజామాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం చివరి మూడుస్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, గుంటూరు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

విద్యాభివృద్ధి వికేంద్రీకృతం
క్షరాస్యత ప్రగతికి ఆలవాలం. ఈ రంగానికి ప్రాధాన్యమిచ్చే రాష్ట్రాలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికొస్తే విద్యాభివృద్ధి వికేంద్రీకృతమయింది. ఒక్కో కేటగిరిలో ఒక్కో జిల్లాకు అగ్రస్థానం లభించింది. ప్రాథమిక విద్యారంగంలో చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు 4546 ఉన్నాయి. రెండోస్థానంలో తూర్పుగోదావరి(3533), మూడో స్థానంలో విశాఖ(3320) ఉన్నాయి.

* మాధ్యమిక విద్యలో అనంతపురం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాలలు 936 ఉన్నాయి. తర్వాత స్థానాల్లో కరీంనగర్‌(893), మహబూబ్‌నగర్‌(870) నిలిచాయి. హైదరాబాద్‌ చివరి స్థానంలో(382) ఉంది.

* ఉన్నత పాఠశాలల సంఖ్య అన్నింటికంటే ఎక్కువగా(1231) రంగారెడ్డి జిల్లాలో ఉండగా.. రెండు, మూడో స్థానాల్లో కరీంనగర్‌(1186), హైదరాబాద్‌(1090) నిలిచాయి. విజయనగరం(404) చివరి స్థానంలో ఉంది. శ్రీకాకుళం(484) దానికన్నా కాస్త ముందుంది.

* జూనియర్‌ కళాశాలల్లో హైదరాబాద్‌ (340) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి (318), తూర్పుగోదావరి(258) నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా(24) అన్నింటికంటే చివరిస్థానంలో ఉంది. ఆ పై స్థానంలో నిజామాబాద్‌(102) ఉంది.


హాస్టళ్ల తీరిదీ..
'పేద' జిల్లాల్లో హాస్టళ్లకు గిరాకీ
పేదరికం, వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో హాస్టళ్లలో అడ్మిషన్ల సంఖ్య అధికంగా ఉంది. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువున్నాయి. కానీ విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఎక్కువుండటం గమనార్హం. పేదరికం, వలసల కారణంతో మహబూబ్‌నగర్‌ జిల్లా హాస్టల్‌ అడ్మిషన్లలో ముందుంది.

* హైదరాబాద్‌, విజయనగరం, శ్రీకాకుళం, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అతి తక్కువ ఎస్సీ హాస్టళ్లున్నాయి. అడ్మిషన్ల సంఖ్య కూడా తగ్గింది.

* ఎస్టీ హాస్టళ్లు ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. అలానే విద్యార్థుల సంఖ్య ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ జిల్లాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గిరిజన జనాభా ఉన్నా హాస్టళ్ల సంఖ్యతోపాటు, అడ్మిషన్ల సంఖ్య కూడా తక్కువగా ఉంది.