Saturday, March 20, 2010

కేంద్ర ఉద్యోగులకు 8% డీఏ

కేంద్ర ఉద్యోగులకు 8% డీఏ
ఏప్రిల్‌ నుంచి జాతీయ జనాభా రిజిస్టర్‌ తయారీ
క్యాపిటేషన్‌ ఫీజు వసూలుచేస్తే
50 లక్షల జరిమానా, మూడేళ్ల జైలు
విమానాలు హైజాక్‌చేసే వారికి మరణశిక్ష
నిమ్స్‌ నవీకరణకు అదనపు నిధులు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ: దేశంలోని 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. వీరికి కేంద్రం 8 శాతం కరవు భత్యాన్ని(డీఏ) పెంచింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం మూలవేతనంలో డీఏ 27 శాతం ఉంది. పెంచిన 8 శాతంతో కలిపి ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు కరవు సాయం(డీఆర్‌) విడుదల చేయాలని శుక్రవారం నాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశానంతరం సమాచార, ప్రసారశాఖల మంత్రి అంబికా సోని విలేకరులతో మాట్లాడుతూ ధరల పెరుగుల దృష్ట్యా డీఏ పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆరోవేతన సంఘం సిఫార్సుల ప్రాతిపదికగా ఆమోదిత ఫార్ములా మేరకే డీఏ పెంచినట్లు వివరించారు. డీఏ, డీఆర్‌ల పెంపువల్ల కేంద్రంపై ఏటా రూ.6969.36 కోట్ల అదనపు భారం పడుతుంది.

* జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) తయారీ పని వచ్చేనెలలో మొదలవుతుంది. సెప్టెంబరు నాటికంతా ఇది ముగుస్తుంది. ఈ భారీ కసరత్తు కోసం రూ.3539.24 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దేశ మొత్తం జనాభా వివరాల్ని ఈ రిజిస్టర్‌లో పొందుపరుస్తారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడం, దేశ భద్రతను పెంపొందించడం ఈ కసరత్తు ఉద్దేశం. ఇందులో భాగంగా డిజిటల్‌ డేటాబేస్‌ను తయారుచేస్తారు. ఫొటోలు, వేలిముద్రలు, బయోమెట్రిక్స్‌తో కలిపి గుర్తింపు వివరాల్ని నమోదుచేస్తారు. ఇది పూర్తయిన తర్వాత.. నెంబరు ఇవ్వడం కోసం విశిష్ఠ గుర్తింపు అథారిటీకి ఈ వివరాల్ని పంపుతారు. ఆ తర్వాత ప్రజలకు కార్డులు జారీచేస్తారు. ఈ కార్డు ఒక్కో దానికి రూ.28 ఖర్చవుతుంది. ఎన్‌పీఆర్‌ కింద... దేశంలో 15 ఏళ్ల పైబడిన వారి వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి. 15 ఏళ్లలోపు పిల్లల వివరాల్ని తల్లిదండ్రుల కార్డులో నమోదుచేస్తారు. జనాభా లెక్కల సేకరణలో కులాల ప్రాతిపదికగా గణన ఉండదు. మొత్తం 25లక్షల మంది ప్రభుత్వోద్యోగులు జనాభా లెక్కల పనిలో పాలుపంచుకుంటారు.

* విద్యారంగంలో సంస్కరణల కోసం మూడు ప్రధాన బిల్లులకు మంత్రివర్గం ఆమోదం. సాంకేతిక, వైద్య విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో అనైతిక, అక్రమ కార్యకలాపాల నిరోధానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు-2010కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల నుంచి క్యాపిటేషన్‌ ఫీజును వసూలుచేసినా, ఇచ్చిన హామీ మేరకు నాణ్యమైన విద్యను అందించలేకపోయినా అలాంటి వారికి రూ.50 లక్షల దాకా జరిమానా, మూడేళ్లదాకా జైలుశిక్ష విధించడానికి ఈ బిల్లు ఉపకరిస్తుంది. అలాగే క్యాంపస్‌లలో వివాదాల పరిష్కారానికి విద్యా ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుతో పాటు, విద్యాసంస్థలకు అక్రెడిటేషన్‌ ఇవ్వడం, ప్రమాణాల రూపకల్పనకు జాతీయ అక్రెడిటేషన్‌ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు.

* విమానాల హైజాకింగ్‌కు పాల్పడేవారికి ఇతర శిక్షలు సహా మరణశిక్ష విధించాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. ఇందుకోసం 1982 నాటి హైజాక్‌ వ్యతిరేక చట్టానికి సవరణ చేయడానికి కేబినెట్‌ అంగీకారం.

* త్వరలో ఆచరణలోకి రానున్న ఆరు ఎయిమ్స్‌ తరహా సంస్థలు, ప్రస్తుతమున్న 13 ప్రభుత్వ వైద్య కళాశాలల నవీకరణకు గాను అదనంగా రూ.5,535 కోట్లు కేటాయించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం. గతంలో దీనికి రూ.3975 కోట్లు కేటాయించారు. ఎయిమ్స్‌ తరహా సంస్థలు భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, పాట్నా, రాయ్‌పూర్‌, రిషికేష్‌లలో 2012 నాటికంతా పూర్తవుతాయి. అలాగే హైదరాబాద్‌లోని నిమ్స్‌ సహా వివిధ వైద్య విద్యా ఆసుపత్రుల్ని ఎయిమ్స్‌ స్థాయికి నవీకరిస్తారు.

* కాలుష్యమయమైన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చి, అక్కడి ప్రజలకు పునరావాసం కల్పించడానికి ఉద్దేశించిన ఓ సరికొత్త ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. 'కెపాసిటీ బిల్డింగ్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ పొల్యూషన్‌ మేనేజ్‌మెంట్‌' పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు సాయం అందిస్తుంది. రూ.343 కోట్లతో దీనిని చేపడతారు. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లోని గుర్తించిన ప్రదేశాల్లో ఐదేళ్లపాటు దీనిని అమలుచేస్తారు.

* దేశంలోని లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) వైద్య సంరక్షణ సదుపాయాలు కల్పించడానికి మంత్రివర్గం నిర్ణయం. ఇందుకోసం ఈఎస్‌ఐసీ చట్టం-1948ను సవరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్‌ఐసీ వైద్య సంరక్షణ సదుపాయాలు అందేలా చూస్తారు. పది లేదా అంతకన్నా ఎక్కువమంది అసంఘటిత రంగ కార్మికులు పనిచేసే ప్రతిచోటా ఈ సౌకర్యాలు వర్తిస్తాయి. బీమా చేసిన వ్యక్తులపై ఆధారపడిన వారికి ప్రయోజనాల్ని ప్రస్తుతమున్న 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకు పొడిగిస్తారు.

* జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆలోచన విరమణ. ప్రస్తుతమున్న విశ్వవిద్యాలయాలు, సంస్థల్లోనే ప్రతిభావంతమైన అధ్యయన కేంద్రాలు ఏర్పాటుచేయాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదన రావడం, పైగా విశ్వవిద్యాలయ ఏర్పాటు ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఆ ఆలోచనను మంత్రివర్గం ఉపసంహరించుకుంది.

* కామన్వెల్త్‌ క్రీడల ఏర్పాట్లకు మరో రూ.687.06 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం.