ఆ నల్ల బంగారం విలువ రూ.35వేల కోట్లు
గనుల నిర్వహణపై త్వరలో విధాన నిర్ణయం
సింగరేణికి అప్పగించే అవకాశం: ఏపీఎండీసీ ఎండీ
నౌగాన్ తెలిసాహి బొగ్గుగని: దీనిపై ఒరిస్సా మైనింగ్ సంస్థ, ఏపీఎండీసీ రెండింటికీ సమాన వాటా ఉంది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఇక్కడ 900 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయని అంచనా. ప్రస్తుత మార్కెట్ ప్రకారం మధ్యశ్రేణి నాణ్యత గల టన్ను బొగ్గు ధర రూ.650 వరకూ ఉంది. దీని ప్రకారం ఇది రూ.58,500 కోట్ల విలువ చేస్తుంది. ఇందులో ఏపీఎండీసీ వాటా రూ.29,250 కోట్లు ఉంటుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో బొగ్గు ధరలు పెరిగితే ఆదాయం ఇంకా పెరగొచ్చనీ చెబుతున్నారు.
సిన్‌గ్రౌలీలోని గని: ఇందులో 80 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ రూ.5,200 కోట్లు చేస్తుంది.
'ఘనుల' కన్ను
ఈ రెండు గనులను ఏపీఎండీసీ సొంతంగా నిర్వహించడానికి తగిన సామర్థ్యం లేదు. సరిగ్గా దీన్ని ఆసరా చేసుకునే కొందరు ఘనులు వీటిపై కన్నేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీఎండీసీ నుంచి పరోక్షంగా లీజు తీసుకోవడానికి విద్యుత్ ఉత్పాదన రంగంలో ఉన్న రాష్ట్ర రాజకీయ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇనుము, బాక్సైట్ గనుల కేటాయింపుల తరహాలో ఏపీఎండీసీ నుంచి వీటిని సొంతం చేసుకోవాలనేది వీరి వ్యూహం. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయనే భయంతో ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సింగరేణికి అప్పగింత!
ఈ గనుల్లో బొగ్గును వెలికితీసే విధానాలపై ఎంఈసీఎల్ నుంచి సాంకేతిక నివేదిక అందాల్సి ఉందని ఎపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ 'న్యూస్‌టుడే'తో చెప్పారు. ఒరిస్సా బొగ్గుగని నిర్వహణకు సంబంధించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) కూడా ఏపీఎండీసీకి ఒక ప్రతిపాదన చేసిందన్నారు. ఇందులో పేర్కొన్న సాంకేతిక అంశాలు సంతృప్తికరంగా లేనందున దీనిని సింగరేణికి అప్పగించి, ఏపీజెన్‌కోకు బొగ్గు సరఫరా చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుతానికైతే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలేవీ లేవని తెలిపారు. దీనిపై ఏపీఎండీసీ పాలకమండలి సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.