Monday, March 15, 2010

త్వరలో ఐటీకి అత్యవసర సేవల హోదా

ఇక అనుమతులన్నీ ఒకచోటే
జూన్‌ చివరకు కొత్త విధాన ముసాయిదా
చిన్న కంపెనీలకు సహకారం
మంత్రి కోమటిరెడ్డి వెల్లడి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) రంగాన్ని మరింత వృద్ధి పథంలో నడిపించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి పటిష్ఠమైన చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వెల్లడించారు. ఐటీ కంపెనీల కార్యకలాపాలకు త్వరలో 'అత్యవసర సేవల' హోదా కల్పించనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల నిరంతరాయ విద్యుత్‌ వంటి సౌకర్యాలు లభించడమే కాకుండా బంద్‌ల సమయంలో పనులకు అంతరాయం కలిగించే పరిస్థితులను నివారించవచ్చు. 'ఈ దిశగా చర్యలు తీసుకోవడానికి అత్యవసర సేవల నిర్వహణ చట్టంలో (ఎస్మా) సవరణలు చేయడానికి ప్రభుత్వం గురువారమే అంగీకరించింది. ఈ చట్టంలో సవరణలకు అవసరమైన బిల్లును ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతాం' అని మంత్రి అన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఇట్స్‌ఏపీ) 18వ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల ప్రదర్శన, సమావేశాన్ని ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా వెంకట రెడ్డి మాట్లాడారు. ఐటీ కంపెనీలకు అన్ని రకాల అనుమతులివ్వడానికి ఏక గవాక్షాన్ని (సింగిల్‌ విండో) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఐటీ విధానం మార్చితో ముగుస్తుంది. కొత్త విధాన ముసాయిదా సిద్ధం చేశాం. పరిశ్రమలు, కంపెనీల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చేస్తాం. జూన్‌ చివరకు కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందులో చిన్న కంపెనీలకు అండగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఐటీ సెజ్‌ల కోసం స్థలాన్ని పొందిన కంపెనీలు దాన్ని ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తే ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల హిందు ప్రాజెక్ట్సుకు ఈ మేరకు నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఇటువంటి కంపెనీలను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందన్నారు.

చిన్న పట్టణాలకు విస్తరించక తప్పదు: ఇటీవలి రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఐటీ కంపెనీల కార్యకలాపాలకు కొంత అంతరాయం కలిగిందని, ప్రస్తుతం పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయని ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సీఎండీ బి.వి.ఆర్‌.మోహన్‌ రెడ్డి తెలిపారు. గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌ ఉపన్యాసం చేశారు. అంతరాయం లేకుండా ఐటీ పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. క్యాపిటివ్‌ విద్యుత్‌ను (సొంత అవసరాల కోసం ఆయా కంపెనీలే ఉత్పత్తి చేసుకునే విద్యుత్‌) సమకూర్చుకోవడం చిన్న కంపెనీలకు సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం దేశంలో అయిదు నగరాల నుంచే 90 శాతం సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు అవుతున్నాయి. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ పరిమాణం 5,000 కోట్ల డాలర్లు (దాదాపు రూ.2,35,000 కోట్లు). వచ్చే పదేళ్లలో మూడింతలై కనీసం 15,000 కోట్ల డాలర్లకు చేరుతుంది. ఈ స్థాయిలో ఎగుమతులు పెరగడానికి తగిన మౌలిక సదుపాయాలు ఈ నగరాల్లో లేవు. కాబట్టి ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించక తప్పదని మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులను రూ.32,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచుకోవడానికి వరంగల్‌, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాలపై దృష్టి కేంద్రీకరించాలని ఇట్స్‌ఏపీ అధ్యక్షుడు నరసింహారావు అన్నారు. నిపుణులు, వ్యయాల్లో వ్యత్యాసాల కారణంగా బెంగళూరు నుంచి ఏ విధంగా పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిందో అదే విధంగా చిన్న పట్టణాలకు కూడా విస్తరించగలదని అన్నారు.