లీజుపైనా కేజ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు
విశాఖపట్నం - న్యూస్‌టుడే
అన్ని చోట్లా విజయం..!
జపాన్, తైవాన్ వంటి దేశాల్లో విజయవంతమైనకేజ్ కల్చర్‌ను మన దేశంలో అభివృద్ధి చేసేందుకు వివిధ సంస్థలు గత30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 2006లో కేంద్ర వ్యవసాయ శాఖ సీఎంఎఫ్‌ఆర్‌ఐకి రూ.2.75 కోట్లు కేటాయించడంతో, 2007లో ప్రయోగాత్మకంగా విశాఖలో చేపట్టారు. అప్పట్లో ఇక్కడ సీఎంఎఫ్‌ఆర్‌ఐ సైంటిస్ట్ ఇన్‌ఛార్జిగా ఉన్న సైదారావు ఆధ్వర్యం వహించారు. ఇంజినీరింగ్ డిజైన్ లోపాల వల్ల తొలి ప్రయత్నంలో కేజ్ ఎంతో కాలం సముద్రంలో నిలవలేదు. అప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్ సహాయంతో మరో డిజైన్ రూపొందించారు. కేజ్‌ను సముద్రంలో నిలిపి ఉంచే ప్రక్రియ (మూరింగ్)లో మార్పులు చేసి, పండుగప్ప పిల్లలు వేయగా విజయవంతమైంది. దాంతో జాతీయ మత్స్య అభివృద్ధిబోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) రూ.1.15 కోట్లు కేటాయించగా, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం; తమిళనాడులో చెన్నై, మండపం, కన్యాకుమారి; కేరళలో కోచి, విళింజం; కర్ణాటకలో మంగుళూరు; మహారాష్ట్రలో ముంబాయి, గుజరాత్‌లో వెరావల్, ఒరిస్సాలోని బాలాసోర్‌లలో ప్రాజెక్టు అమలవుతోంది. అన్ని చోట్లా మంచి ఫలితాలు వస్తున్నట్టు డాక్టర్ సైదారావు వివరించారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పండుగప్ప, లాబ్‌స్టర్ వంటి విలువైన జాతుల్ని పెంచుతున్నారు.
ఇదీ లాభం
సముద్రంలో రొయ్యలు, విలువైన చేపల లభ్యతతగ్గుతున్న నేపథ్యంలో కేజ్ కల్చర్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. రెండు మూడు నెలల వ్యవధిలోనే ఒక్కో కేజ్‌లో 4.5-5 టన్నుల చేపల్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మేలు రకాల చేపలు, అన్నీ దాదాపు ఒకే సైజులో ఉన్నవీ, బతికి ఉన్న చేపల్ని విక్రయించే అవకాశం ఈ విధానంలో ఉంటుంది. ప్రస్తుతం సీఎంఎఫ్‌ఆర్‌ఐ కూడా ఆయా రాష్ట్రాల్లో స్థానిక మత్స్యకారుల సహకారంతో ప్రాజెక్టు అమలు చేస్తోంది. కేజ్‌ల ఏర్పాటుకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, సబ్సిడీపై కేజ్‌లు ఇతర పరికరాలను భవిష్యత్తులో మత్స్యకార సంఘాలకు అందజేసే ఆలోచనలో ఉన్నారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కేజ్‌ల ఏర్పాటుకు ముందుకి వస్తే సముద్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలను లీజుకి ఇచ్చే అంశం కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం మార్గదర్శకాలపై చర్చ జరుగుతోందని సైదారావు వెల్లడించారు. సాధారణంగా కేజ్‌లు తీరానికి దగ్గర్లోనే ఏర్పాటు చేస్తారు. సముద్రంలో 12 నాటికల్ మైళ్ల దూరం వరకు ఆయా రాష్ట్రాల అధీనంలో ఉంటుంది. కాబట్టి విధానాల రూపకల్పన విషయంలో రాష్ట్రప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని సైదారావు అభిప్రాయపడ్డారు.