Monday, March 15, 2010

ద్రవ్యోల్బణం తగ్గుతుంది

మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా
20న ప్రణాళికా సంఘం సమావేశం
ముంబయి: రబీ దిగుబడులు బాగుండవచ్చని, అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం రానున్న రెండు నెలల్లో దిగి రావడానికి ఒక కారణం కావచ్చని ప్రణాళికా సంఘం అభిప్రాయపడుతోంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా శుక్రవారం ఇక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆహార ధరల ద్రవ్యోల్బణం ఒకటి రెండు నెలల్లో దిగివస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్లూపీఐ) రెండంకెలకు ఎగబాకగలదన్న భయాలను అహ్లువాలియా తోసిపుచ్చారు. 'అది క్రమంగా తగ్గుముఖం పడుతుంది.. చూడండి' అని ఆయన చెప్పారు. 'భారత ఆర్థిక వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తోంది.. అసాధారణ సంక్షోభానికి మనం ఎదురొడ్డి నిలిచాం, దీనిని సంబాళించడంలో ప్రభుత్వం బాగా కృషి చేసింది. 2010-11 సంవత్సరంలో మళ్లీ 8.5 శాతం వృద్ధి వైపునకు వెళ్తున్నాం.. ఆ తరువాత 9 శాతం వృద్ధిని కూడా చూస్తాం' అని అహ్లువాలియా వ్యాఖ్యానించారు. ఆర్థిక ఉద్దీపనల నుంచి ముందుగా వెనుకకు మళ్లిన దేశాల్లో భారత్‌ ఒకటి. చాలా దేశాలు ఈ మాటలైతే వల్లె వేశాయి గానీ, ఎప్పుడు ఉద్దీపనలను ఉపసంహరించాలో తేల్చుకోలేకపోయాయని అన్నారు. పదకొండో పంచ వర్ష ప్రణాళిక పై మధ్యంతర సమీక్షను చేపట్టడం కోసం ప్రణాళికా సంఘం ఈ నెల 20న సమావేశం కానుంది. ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈ సమావేశానికి హాజరు అవుతారని చెప్పారు.