విశాఖలో ఐనాక్స్
వరుణ్ బీచ్‌లో ఒకేసారి 6 తెరలు
మరో 2 మల్టిప్లెక్స్‌ల్లోనూ ఐనాక్స్ స్క్రీన్‌లు!
విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి మల్టిప్లెక్స్ మంగళవారం వరుణ్ బీచ్‌లో శ్రీకారం చుట్టుకుంది. ఆరు తెరల సముదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ జె.శ్యామలరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుణ్ సంస్థల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రభు కిశోర్ మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని విధాలుగా ఎదిగినప్పటికీ మల్టిప్లెక్సులు లేని కొరత ఇంత కాలం ఉండేదని, ఈ దాహం ఇప్పుడు తీరనుందని చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మూడంతస్తుల్లో పార్కింగ్ కల్పించినట్లు వివరించారు. నోవాటెల్‌తో కలసి నక్షత్ర హోటల్ నిర్మాణాన్ని మొదట చేపట్టినా, ఆధునిక థియేటర్లు విశాఖకు అందుబాటులో రావాలనే ఉద్దేశంతో ప్లానును మార్పు చేసి మల్టిప్లెక్స్ నిర్మించినట్లు వివరించారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో వరుణ్ సంస్థ వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయని, రూ.1,400 కోట్ల టర్నోవర్ ఉన్న తమ గ్రూపు ద్వారా నోవాటెల్ హోటల్ డిసెంబర్ లోగా ప్రారంభం కానుందని వెల్లడించారు. ఐనాక్స్ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అలోక్ టాండన్ రాష్ట్రంలో విజయవాడ, హైదరాబాద్‌ల తరువాత మూడో నగరంగా తమ కార్యకలాపాలు విశాఖలో ప్రారంభం అవుతున్నాయన్నారు. విశాఖలో మరో రెండు మల్టీప్లెక్సుల్లోనూ ఐనాక్స్ స్క్రీన్‌లు రానున్నాయని ఆయన తెలిపారు. అంతక్రితం విలేకరుల సమావేశంలో టాండన్ మాట్లాడుతూ, వరుణ్ బీచ్‌లో 6 స్క్రీన్‌లకు కలిపి 1166 సీట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐనాక్స్‌కు దేశ వ్యాప్తంగా 30 మల్టిప్లెక్సుల్లో 109 స్క్రీన్‌లు ఉండగా ఇపుడు వరుణ్‌తో కలుపుకొని ఈ సంఖ్య 115కి చేరినట్లు చెప్పారు. కేవలం 8 సంవత్సరాల్లో 22 నగరాలకు తమ కంపెనీ విస్తరించినట్లు టాండన్ వివరించారు.