ఇబ్బడిముబ్బడిగా ఐపీఓలు, ఎఫ్‌పీఓలు ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు వరదలా ముంచెత్తుతున్నాయి. దానివెంటే మరికొన్ని కంపెనీల మలివిడత ఇష్యూలూ మదుపర్లను పలకరిస్తున్నాయి. సగటున వారానికి రెండు లేదా మూడు ఇష్యూలు మార్కెట్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. భారత్‌పై విదేశీ సంస్థాగత మదుపర్ల విశ్వాసం, సెన్సెక్స్ జోరు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అయితే అధికశాతం ఇష్యూలకు రిటైల్ మదుపర్లు పెద్దగా మక్కువ చూపడం లేదన్నది వాస్తవం. పూర్తిగా దూరంగా ఉండేకంటే సమయానుకూలంగా వ్యవహరిస్తే మంచి ప్రతిఫలాలు పొందడానికి ఆస్కారం ఉంటుందని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.
పీఎస్‌యూ ఇష్యూలకు చిన్న మదుపర్లు దూరం
ప్రైవేటు ప్రతిఫలాలు పుష్కలం
నువ్వా నేనా: ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2010-11 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ కార్యక్రమం ద్వారా సమీకరించదలచిన నిధుల మొత్తాన్ని రూ.40,000 కోట్లకు పెంచుతున్నట్లు విత్త మంత్రి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్‌లో స్పష్టం చేసిన విషయం విదితమే. ప్రైవేట్ రంగం కూడా దాదాపు ఇంతే మొత్తం సమీకరించే అవకాశం ఉంది. అంటే, నిధుల సమీకరణకు ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రైవేట్ కంపెనీలు కూడా పరస్పరం పోటీ పడతాయన్న మాట.
పీఎస్‌యూ ఇష్యూల కేలండర్ ఇదీ
ఇంచుమించుగా ఏప్రిల్‌లో సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్, మే-జూన్ మధ్యలో ఇంజినీర్స్ ఇండియా, ఆగస్టు-సెప్టెంబరులలో కోల్ ఇండియా కంపెనీల్లో వాటాల ఉపసంహరణ జరిగే సూచనలు ఉన్నాయి. నవరత్న పీఎస్‌యూ 'నాల్కో'లో 10 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.2,200 కోట్ల నిధులను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తొలుత వినవచ్చినా తరువాత అలాంటి ప్రతిపాదన లేదని గనుల శాఖ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పీఎస్‌యూ వాటాల విక్రయం కోసం ఏప్రిల్ చివరికి మార్గదర్శన ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పీఎస్‌యూల జాబితాలో బీఎస్‌ఎన్‌ఎల్‌నూ చేర్చే అవకాశం ఉండొచ్చు. మరో పీఎస్‌యూ హిందుస్థాన్ కాపర్ ఎఫ్‌పీఓకు వచ్చే సన్నాహాలు చేస్తున్నట్లు అభిజ్ఞవర్గాల సమాచారం. ఇందులో వాటాల విక్రయం ద్వారా సమీకరించనున్న మొత్తంలో చెరి రూ.4,500 కోట్లను కేంద్ర గనుల శాఖ, కంపెనీ పంచుకోనున్నట్లు పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక మాంగనీస్ ఓర్ ఇండియా (ఎంఓఐఎల్) కంపెనీలో 10% వాటాను విక్రయించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కంపెనీలో ప్రస్తుతం కేంద్రానికి 81.57% వాటా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2010-11)లో పబ్లిక్ ఇష్యూకు రానున్న సెయిల్, కోల్ ఇండియా, హిందుస్థాన్ కాపర్‌ల వంటి ఏదైనా ఓ సంస్థలో ఎంఓఐఎల్‌ను విలీనం చేయనున్నారనేది పరిశ్రమ వర్గాల అంచనా.
మదుపరుల నిరుత్సాహానికి వెనుక..
ఓవైపు ఇష్యూలు దూసుకొస్తున్నా వాటిలో, మరీ ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల తొలి/మలి విడత ఇష్యూల్లో పాల్గొనకుండా రిటైల్ మదుపర్లు ముభావంగా ఉంటున్నారు! వీటి ధరలు మరీ అధికంగా ఉన్నాయని మదుపరులు భావించడం; నమోదు సమయంలో ప్రతిఫలాలు తక్కువగా ఉండడం (ఇష్యూ ధర కన్నా తక్కువ వద్ద నమోదు కావడం) వంటివి ఇష్యూలపై రిటైలర్లు అంతగా ఆసక్తిని కనబరచకపోవడానికి కారణాలు అయ్యాయని చెప్తున్నారు. ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీ ఇష్యూలకు లభించిన ఆదరణ తీరును చూసి ఎన్‌ఎండీసీ ఎఫ్‌పీఓ జారీ ధరలో రిటైల్ మదుపర్లకు 5% తగ్గింపును కేంద్రం ప్రకటించాల్సి వచ్చింది. ఎన్‌ఎండీసీ ఎఫ్‌పీఓకు వస్తుందనే కబురు షికారు చేయగానే అంతక్రితం 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.571.80గా ఉన్న ఆ కంపెనీ షేరు ధర క్రమంగా పడిపోసాగింది. ఎఫ్‌పీఓ ధరల శ్రేణిని రూ.300-350గా నిర్ణయించారు. కానీ ఇష్యూ ప్రారంభ దినాన ఈ స్క్రిప్ ధర రూ.381.65కి దిగజారింది. 2007లో షేర్ల నమోదు ప్రతిఫలాలు సగటున 27 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది 2 శాతానికి తగ్గాయి. అయితే ఇక్కడో విషయం గమనించాలి. అప్పుడు ఎక్కువ నమోదు ప్రతిఫలాలు వచ్చినా నెల రోజుల తరువాత ఆ స్క్రిప్‌లన్నీ ఇష్యూ ధర వద్దే తచ్చాడుతూ వచ్చాయి.