ఆగిన లెవీ సేకరణ!
బియ్యం పథకానికి ముప్పు
సంక్షోభంలో మిల్లింగ్ పరిశ్రమ
హైదరాబాద్ - న్యూస్‌టుడే
దేశ, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎఫ్‌సీఐ రాష్ట్రంలో బియ్యం సేకరిస్తోంది. ఆ బియ్యాన్నే రూ.2 కిలోబియ్యం పథకంతోపాటు హాస్టళ్లు, ఇతరత్రా అవసరాల కోసం ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇక్కడ సేకరించిన ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తుంటారు. ఏటా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మరుసటి ఏడాది సెప్టెంబర్ నెలాఖరు మధ్య వచ్చే ఖరీఫ్, రబీ పంటల బియ్యం సేకరణను లెవీ మార్కెటింగ్ ఏడాదిగా పిలుస్తుంటారు. ఈ లెవీ ఏడాదిలో 37 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చిబియ్యం (రారైస్), 25 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. సాధారణంగా లెవీ ప్రారంభ నెలల్లో వచ్చే ఖరీఫ్ పంట కాలంలోనే దాదాపుగా పచ్చి బియ్యం సేకరణ పూర్తిచేస్తుంటారు. ఇప్పటివరకు 23.60లక్షల టన్నుల పచ్చిబియ్యం, 5.60 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించారు.
అక్కడ ఖాళీ లేక: రాష్ట్రంలో అన్ని గోదాముల్లో మొత్తం 33 లక్షల మెట్రిక్ టన్నుల వస్తువులను నిల్వ చేయొచ్చు. ప్రస్తుతం వాటిలో అధిక భాగం ఉప్పుడు బియ్యం, గోధుమలతోపాటు మరికొన్ని ఇతర వస్తువులు ఉన్నాయి. ఉప్పుడు బియ్యాన్ని కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు.. గోధుమలను పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు పంపించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాల్లో గోదాములు ఖాళీ లేవన్న కారణంతో వాటిని ఇంకా తరలించడంలేదు. ఈ ప్రభావం లెవీ సేకరణపై పడింది. ప్రతినెలా దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యం కిలో రెండు రూపాయల బియ్యం పథకం, ఇతరత్రా అవసరాల కోసం వినియోగిస్తుంటారు. గోదాముల్లో నెలనెలా అలా ఖాళీ అయిన మేర మాత్రమే లెవీ బియ్యం సేకరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల దగ్గర 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలున్నాయి. ఇది కాకుండా రైతుల దగ్గర కూడా మరో ఐదారు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలున్నట్లు తెలుస్తోంది.