Monday, March 15, 2010

ఉద్యోగుల వలస తగ్గలేదు

టీసీఎస్‌ ఇ.డి. మహాలింగం
ఇట్స్‌ఏపీ అవార్డుల ప్రదానం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగ నియామకాలు మళ్లీ జోరందుకున్నప్పటికీ.. టీసీఎస్‌లో ఉద్యోగుల వలస రేటు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) ఎస్‌.మహాలింగం తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల వలస రేటు 11.5 శాతం ఉంది. పెరుగుతున్న వేతనాలు ఒక్కటే వలస రేటును నిర్ణయించలేవని అన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఇట్స్‌ఏపీ) అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖాతాదారుల నుంచి ప్రతి గంటకు వసూలు చేసే మొత్తం, కంపెనీ మార్జిన్లలో ఎటువంటి మార్పులేదని చెప్పారు. ఉద్యోగులకు వేతనాల పెంపు, బోనస్‌ వంటి అంశాలను ఏప్రిల్‌లో సమీక్షించనున్నట్లు తెలిపారు.

అయిదు విభాగాల్లో 19 అవార్డులు: ఇట్స్‌ఏపీ 2008-09 ఏడాదికి అయిదు విభాగాల్లో మొత్తం 19 అవార్డులను ప్రకటించింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అవార్డులను మహాలింగం చేతులు మీదగా ఆయా కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. గత మూడేళ్లుగా చేపట్టిన ఎగుమతులు, వృద్ధి మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక కమిటీ అవార్డులకు ఎంపిక చేసినట్లు ఇట్స్‌ఏపీ అధ్యక్షుడు నరసింహారావు తెలిపారు.