Friday, March 19, 2010

ముందస్తు పన్ను చెల్లింపుల్లో ఎస్‌బీఐ టాప్‌

ముంబయి: ముందస్తు పన్ను చెల్లింపుల జాబితాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) అగ్ర స్థానంలో ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఎస్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,552 కోట్ల మందుస్తు పన్ను కట్టినట్లుగా ఈ వర్గాలు వివరించాయి. గత ఏడాది ఎస్‌బీఐ ముందస్తు పన్ను చెల్లింపులు రూ.5,733కోట్లు మాత్రమే. అత్యధిక పన్ను చెల్లింపులు జరిపిన మొదటి 10 సంస్థల జాబితాలో ఎల్‌ఐసీ, ఐఓసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్లు ఈ వర్గాల సమాచారం. ఎస్‌బీఐ తరువాత స్థానాన్ని ఎల్‌ఐసీ దక్కించుకొంది. ఎల్‌ఐసీ ఈ ఏడాదికి రూ.3,253 కోట్ల ముందస్తు పన్ను చెల్లింపులు చేసింది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని ప్రైవేటు సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.3,075 కోట్ల ముందస్తు పన్ను చెల్లించి జాబితాలో మూడో స్థానంలో నిలిచినట్లు ఆదాయపు పన్ను వర్గాలు వివరించాయి. దీంతో అత్యధికంగా ముందస్తు పన్ను కట్టిన చేసిన ప్రైవేటు సంస్థగా రిలయన్స్‌ నిలిచినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. జాబితాలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (రూ.1,505 కోట్లు పన్ను చెల్లింపుతో) నాలుగో స్థానంలో నిలిచింది. స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ అయిదో స్థానాన్ని, హెచ్‌డీఎఫ్‌సీ ఆరో స్థానాన్ని, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు సమాచారం.

నాలుగో త్రైమాసిక చెల్లింపుల వివరాలు ఇవీ: మార్చి త్రైమాసికానికి ఎస్‌బీఐ రూ.1,857 కోట్లు, ఎల్‌ఐసీ రూ.864 కోట్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.770 కోట్లు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌రూ.275 కోట్ల ముందస్తు పన్నును కట్టాయి. ఈసంస్థలన్నీ గత ఏడాది ఇదే కాలపు పన్ను చెల్లింపులతో పోలిస్తే అధిక పన్నునే చెల్లించాయి. అయితే సిటీ బ్యాంక్‌ చెల్లింపులు మాత్రం గణనీయంగా రూ.1010 కోట్ల నుంచి రూ.150 కోట్లకు తగ్గాయి. హెచ్‌ఎస్‌బీసీ వార్షిక పన్ను చెల్లింపు కూడా రూ.1375 కోట్ల నుంచి రూ.835 కోట్లకు కుంగింది. ముందస్తు పన్ను కట్టడాలు తగ్గిన సంస్థల్లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(రూ.702 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.1,502కోట్లు), టాటా స్టీల్‌(రూ.1,793 కోట్లు)ఉన్నాయి.