న్యూఢిల్లీ: లియోండెల్ బాసిల్‌ను హస్తగతం చేసుకోవడంలోసఫలం కాలేకపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తాజాగా అమెరికాకు చెందిన అట్లాస్ ఎనర్జీతో కలసి ఆ కంపెనీకి చెందిన గ్యాస్ క్షేత్రాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒక ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేసే దిశగా చర్చలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నాస్‌డాక్‌లో నమోదు అయిన అట్లాస్ ఎనర్జీకి చెందిన మార్సెలస్ షేల్ గ్యాస్ కార్యకలాపాల్లో పాలు పంచుకొనే ఉద్దేశంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందని అభిజ్ఞ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై ఆర్‌ఐఎల్ ప్రతినిధిని సంప్రదించినపుడు ఆ ప్రతినిధి ఎలాంటి వ్యాఖ్య చేయడానికి నిరాకరించారని పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. చేజారిన వేల్యూ క్రియేషన్స్!: కెనడాకు చెందిన వేల్యూ క్రియేషన్స్ నియంత్రిత వాటా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 బిలియన్ డాలర్ల బిడ్‌ను సమర్పించింది. అయితే వేల్యూ క్రియేషన్‌కు చెందిన టెర్రీ డి గ్రేస్ ఇసుక చమురు బ్లాకుల్లో వాటాను అమెరికాలో అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థ బీపీ పీఎల్‌సీ చేజిక్కించుకుంది. ఈ సంస్థ రిలయన్స్ సమర్పించిన బిడ్ కన్నా అధిక బిడ్‌ను సమర్పించినట్లు తెలుస్తోంది.