8 లక్షల బేళ్లు తగ్గిన వైనం
85 శాతం పూర్తయిన కొనుగోళ్లు
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా దిగుబడి మాత్రం ఆశించినంత రావడం లేదు. ఈ ఏడాది వరుణుడు కరుణించకపోవడంతో పత్తి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. మొత్తం 33.25 లక్షల ఎకరాల్లో పంట సాగయినా అంచనా కన్నా 8 బేళ్లు(ఒక్కో బేలు 5.5 క్వింటాళ్లతో సమానం) తక్కువగా దిగుబడి ఉంది. ఈ ఏడాది సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని భారత పత్తి సలహా మండలి 48 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. ఈ లెక్కన 2.64 కోట్ల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు రావాల్సి ఉంది. 40 లక్షల బేళ్లు(2.20 క్వింటాళ్లు) మాత్రమే వచ్చాయి. ఇప్పటికే 85 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. అంతర్జాతీయంగా భారత పత్తికి డిమాండ్ ఏర్పడటంతో ఎగుమతులు ఊపందుకున్నాయని సీసీఐ అధికారి వివరించారు. దీంతో ధర నిలకడగా ఉందన్నారు. మార్కెట్‌లోకి వస్తున్న పత్తి నాణ్యత తక్కువగా ఉన్నా డిమాండ్ దృష్ట్యా మద్దతు ధరకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో క్వింటాలు రూ.3,000 నుంచి రూ.3,300 వరకు ధర ఉండగా, గుంటూరు జిల్లాలో రూ.3,100 నుంచి రూ.3,200లతో అమ్మకాలు జరుగుతున్నాయి. మార్కెట్ కొనుగోళ్లు 78.36 లక్షల క్వింటాళ్లే: 2008లో భారత పత్తి సంస్థ(సీసీఐ) ఏర్పాటు చేసిన 73 కేంద్రాల్లో 1.63 కోట్ల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఇందులో సీసీఐ 144.75 క్వింటాళ్లను కొనుగోలు చేయడం విశేషం. ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మొత్తం 75 కేంద్రాల్లో కేవలం 78.36 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లే జరిగాయి. ఇందులో సీసీఐ 19.11 లక్షల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. ప్రైవేట్ వ్యాపారులు 59.10లక్షల క్వింటాళ్లు కొనుగోలుచేశారు. ఈ ఏడాది మార్చి రెండోవారం నాటికి దేశవ్యాప్తంగా మార్కెట్‌లోకివచ్చిన పత్తి 231లక్షల బేళ్లుగా ఉందని పత్తి సలహా మండలి పేర్కొంది. గత ఏడాది ఇది 238 లక్షల బేళ్లుగా నమోదయింది.