Monday, March 15, 2010

అది పొసగని పెళ్లి విడాకులు మేలు

ఏఐ- ఐఏ విలీనంపై
కిశోర్‌ చంద్ర దేవ్‌ కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: ఎయిరిండియా (ఏఐ), ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ (ఐఏ)ల విలీనం 'ఏ కోశానా రాజీకి తావు లేని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పెళ్లి లాంటిది' అని పార్లమెంటరీ సంఘమొకటి తీవ్ర వ్యాఖ్య చేసింది. ప్రభుత్వం పెద్దగా ఆలోచించకుండానే, తప్పు నిర్ణయాన్ని తీసుకొన్నట్లు సంఘం విమర్శించింది. కాంగ్రెస్‌ నాయకుడు వి.కిశోర్‌ చంద్ర ఎస్‌. దేవ్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆన్‌ పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ (సీఓపీయూ) తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పిస్తూ, ఒకే హోల్డింగ్‌ కంపెనీ కింద దేశీయ, అంతర్జాతీయ విమాన సంస్థలను వేర్వేరుగా ఉంచడం మేలని సూచన చేసింది. ఈసరికే తీసుకున్న విలీన నిర్ణయానికి బాధ్యులైన సంస్థలను, వ్యక్తులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలకు ఇలాంటి ''కనపడని నష్టం'' జరగడాన్ని నివారించాలని పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది.

ఇంకా నివేదిక ఏమందంటే: నేషనల్‌ ఏవియేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసీఐఎల్‌-నాసిల్‌)ను బాధిస్తున్న సమస్యలకు విలీనమే మూలకారణం. ఆరంభంలోనే లోపభూయిష్ఠమైన విలీనం ఎన్నటికీ సఫలీకృతం కాలేకపోయింది. (ఎయిరిండియా రూ.7,000 కోట్ల మేరకు నష్టాల్లో కూరుకుపోయింది.)

* నాసిల్‌ను హోల్డింగ్‌ కంపెనీగా ఉంచి, దాని అజమాయిషీలో నాసిల్‌-ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను ఢిల్లీ ప్రధాన కేంద్రంగాను, నాసిల్‌-ఎయిరిండియాను ముంబయి ప్రధాన కేంద్రంగాను పనిచేసేలా చూడాలి.

* ఈ రెండు కంపెనీలకు చెరొక ఎండీ ఉండాలి. వారు ఇరువురు నాసిల్‌ ఛైర్మన్‌కు రిపోర్టు చేయాలి. కేంద్రం ఈ సూచనలను తక్షణం అమల్లోకి తీసుకురావాలి.

* విలీన నిర్ణయాన్ని పౌర విమానయాన శాఖ ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ల నెత్తిన రుద్దింది. ఆ తరువాత పురోగతిని పర్యవేక్షించేందుకు ఎలాంటి చొరవా తీసుకోలేదు. నాయకత్వ పటిమను కొనసాగించడంలో విఫలం అయింది.